అనైతిక పాలనలో అందరూ ఘనులే!

ABN , First Publish Date - 2022-05-13T06:10:51+05:30 IST

సూత్రాలు కాదు, మీరు ఎవరి పక్షాన ఉన్నారు అనేది ముఖ్యం! ఇదే, మన వర్తమాన ప్రజా జీవిత తత్వంగా కన్పిస్తోంది. మనమందరమూ సూత్రాల గురించి మాట్లాడతాం, ప్రమాణాల గురించి...

అనైతిక పాలనలో అందరూ ఘనులే!

సూత్రాలు కాదు, మీరు ఎవరి పక్షాన ఉన్నారు అనేది ముఖ్యం! ఇదే, మన వర్తమాన ప్రజా జీవిత తత్వంగా కన్పిస్తోంది. మనమందరమూ సూత్రాల గురించి మాట్లాడతాం, ప్రమాణాల గురించి ప్రస్తావిస్తాం, నియమాల గురించి పేర్కొంటాం– ఇదంతా, ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించుకున్న తరువాతనే కాదూ? ఎవరు ఒప్పు, ఏది తప్పు అనే విషయమై మన నిర్ణయాలకు సూత్రాలు, ప్రమాణాలు, నియమాలను చాలా అరుదుగా మాత్రమే ఆధారం చేసుకుంటాం. మరి ఎవరైనా ఒకరు సూత్రాల గురించి గంభీరంగా ఉద్ఘాటిస్తే పట్టించుకోకపోవడంలో ఆశ్చర్యమేముంది?


పద్ధతులకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తిగా మన ప్రజా జీవిత అవగుణాలను పలుమార్లు చవిచూశాను. నేను ఏదైనా ఒక విషయాన్ని అంగీకరించినప్పుడు అది సక్రమమైనదని విశ్వసించినందునే ఆమోదించానని భావించరెందుకని? రాజకీయ జీవితంలోనే కాదు, ఇతర జీవన వ్యవహారాలలోనూ మనస్తాపం కలిగించే విమర్శలకు గురవుతున్నాను. విద్యారంగం, ప్రభుత్వ సంస్థలు, సామాజిక ఉద్యమాలు మొదలైన వాటిలో సైతం నిష్పాక్షిక వైఖరిని గౌరవించడమనేది అరుదైపోయింది. ఒక ‘స్నేహితుడు’ చేసిన ప్రతిపాదన సరైనది కాదని చిత్తశుద్ధితో భావించి, దానికి మీరు ఆక్షేపణ తెలిపారనుకోండి. మీరు ఆ స్నేహితుడిని తప్పకుండా కోల్పోవలసి వస్తుంది. అవతలి పక్షం వారు చెప్పిన విషయం ఏదైనా సరైనదని మీకు అనిపించి, అదే భావాన్ని వ్యక్తం చేస్తే మీ చుట్టూ ఉన్నవారు ‘జరూర్ కుచ్ సెట్టింగ్ హై!’ అని చెవులు కొరుక్కోవడం ప్రారంభిస్తారు. జనవరి 26న ఎర్రకోట ప్రాంగణంలో మతపరమైన పతాక ఆవిష్కరణకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, సింఘు సరిహద్దులో ఒక దళిత సిక్కును నిహాంగ్‌లు హతమార్చడం పట్ల తీవ్ర నిరసన తెలిపినప్పుడు నాకు అటువంటి అనుభవమే ఎదురయింది. లఖీంపూర్ ఖేరీ ఘటనలో చనిపోయిన బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించినప్పుడు రైతు ఉద్యమ లక్ష్యం పట్ల నాకు విధేయత, నిబద్ధత లేనేలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి!


ఈ అనుభవాల దృష్ట్యా, ఇటీవల నేను చేసిన ఒక ట్వీట్ విషయంలో తీవ్ర ప్రతిస్పందనలకు ముందుగానే అన్ని విధాల సంసిద్ధమయ్యాను. ఆ ట్వీట్ బీజేపీ సభ్యుడు తజీందర్ పాల్ సింగ్ బగ్గా అరెస్ట్‌కు సంబంధించినది. ఆయన అరెస్ట్‌పై జూలై 6 వరకు స్టే విధిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును నేను స్వాగతించాను. ‘బగ్గా గురించిన మన అభిప్రాయం ఏమైనప్పటికీ హైకోర్టు ఉత్తర్వును స్వాగతించాలి’ అన్నదే నా ట్వీట్. ఒక ట్వీట్ విషయమై దాన్ని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని పోలీసులను పంపడమనేది బగ్గా విషయంలో జరగలేదు. జిగ్నేశ్ మేవానీ లేదా రాణా దంపతులు, అల్కా లాంబా లేదా దిశా రవి.. ఎవరైనా కావచ్చు రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేసేందుకు పోలీసులను ఉపయోగించడమనేది అనైతికం, చట్ట విరుద్ధం. బగ్గాపై నా ట్వీట్‌కు ప్రతిస్పందనలను పరిశీలించండి. నాపై పోకిరీ వ్యాఖ్యలు చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతుదారులు అగ్రగాములుగా ఉన్నారు. బీజేపీ వారు సైతం నాపై సదభిప్రాయమేమీ వ్యక్తం చేయలేదు. అరవింద్ కేజ్రీవాల్‌పై అసూయతోనే బగ్గాకు నేను మద్దతునిచ్చానని వారు అభిప్రాయపడ్డారు (సరే, ఆప్ చేపట్టిన ఏ కార్యక్రమాన్ని అయినా సమర్థిస్తే ‘స్వగృహాగమన’ ఆకాంక్షతోనే నేను మద్దతు ఇచ్చానని తప్పక వ్యాఖ్యానిస్తారు).


పలువురు విమర్శకులు యుక్తియుక్తమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రభుత్వాలు తమ విమర్శకుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులతో పోలిస్తే బగ్గాకు సంభవించింది చాలా చిన్న విషయమని అనేకమంది అభిప్రాయపడ్డారు. బగ్గా స్థానంలో ఉన్న ఇతర బాధితులకు న్యాయం చేయడంలో న్యాయస్థానాలు సమ వైఖరితో వ్యవహరించడంలేదని కూడా పలువురు పేర్కొన్నారు. బగ్గా గతాన్ని నేను మరచిపోయానని చాలా మంది నన్ను తప్పుపట్టారు. ‘మీ స్నేహితుడు, సహచరుడు ప్రశాంత్ భూషణ్‌పై బగ్గా దాడిని ఎలా విస్మరించారని’ నన్ను ప్రశ్నించారు. బగ్గా ట్వీట్లు అల్ప మనస్తత్వాన్ని ప్రతి బింబిస్తాయని, పంజాబ్ పోలీసులు అతనికి తమ సుప్రసిద్ధ డోస్‌ను ఇవ్వడం సహేతుకమేనని కూడా పలువురు సమర్థించారు.


బగ్గా వ్యక్తిత్వం ‘ఆమోదయోగ్యం కానిది’ అనడంలో సందేహం లేదు.. ఆయన ప్రవర్తనను చాల వరకు వ్యతిరేక విశేషణాలతో మినహా వివరించలేము. ప్రజా జీవితంలో కనిపిస్తున్న వ్యక్తిత్వమే ఆయన స్వతస్సిద్ధ స్వభావమా? మనకు తెలిసిందల్లా సామాజిక మాధ్యమాలలో వ్యక్తమవుతున్న ఆయన వైఖరులే. బీజేపీ లక్ష్యంగా ఎంచుకున్న వారిపై భౌతికంగా, శాబ్దికంగా దాడులు చేయడం ద్వారా తన కొక రాజకీయ వృత్తి జీవితాన్ని నిర్మించుకున్నాడని, అంతేగాక ఆ దాడులనే వ్యాపారావకాశాలుగా ఉపయోగించుకుంటున్నాడని మాత్రమే మనకు తెలుసు. బగ్గా లాంటి వ్యక్తులతో మనం ఎలా వ్యవహరించాలి? అటువంటి వారిని ఉపేక్షించడమే ఉత్తమం. అదే సరైన పద్ధతి. అతన్ని విమర్శించడం వల్ల ప్రయోజనం లేదు. అతిని వాదనలను తిరస్కరిస్తామంటారా? తిరస్కరించండి. అయితే అదొక అవివేక చర్య అవుతుందనేది నా అభిప్రాయం. అదేమీ ప్రభావ శీలంగా ఉండదని కూడా నేను భావిస్తున్నాను. నిజాలను వెల్లడించండి. అతని పోకిరీ వ్యాఖ్యలకు దీటైన పోకిరీ వ్యాఖ్యలు గుప్పించండి. అయితే అతనిపై పోలీసులను ఉసిగొలుపుతారా? ప్రస్తుత సందర్భంలో ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.


బగ్గా కేసు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోండి. ఈ ఏడాది మార్చిలో అతడు ఒక అసహ్యకర ట్వీట్ రాశాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను బీజేపీ ప్రోత్సహించడాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ శాసనసభలో చేసిన ఒక ప్రసంగానికి ప్రతిస్పందనగా బగ్గా ఆ ట్వీట్ రాశాడు. ముందే చెప్పినట్టు అదొక అసహ్యకరమైన ట్వీట్. రెచ్చగొట్టే విధంగా ఉందనడంలో కూడా సందేహం లేదు. అయితే అది ‘నేరపూరిత బెదిరింపు’ అనీ లేదా ‘భిన్న సామాజిక సముదాయాల మధ్య శతృత్వాన్ని పెంపొందించే విధంగా ఉందనీ’ మీరు చెప్పగలరా? స్థానిక ఆప్ కార్యకర్త ఒకరు చేసిన ఫిర్యాదు మేరకు పంజాబ్ పోలీసులు బగ్గాపై కేసు నమోదు చేశారు. ‘ప్రశ్నించేందుకు’ పంజాబ్ రావాలన్న పోలీస్ సమన్లను బగ్గా తిరస్కరించాడు (పోలీసులు ‘ప్రశ్నించడమంటే’ భౌతిక హింస, మానసిక వేధింపులకు గురిచెయ్యడమేనని మరి చెప్పాలా?) ఈ కేసుపై దృష్టిని కేంద్రీకరించిన పంజాబ్ పోలీసులు బగ్గాను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ వచ్చారు. దరిమిలా పంజాబ్, ఢిల్లీ, హర్యానా పోలీసుల ప్రమేయంతో చోటు చేసుకున్న పరిణామాలు బగ్గా కొంటె పనులకంటే ఘోరమైన ప్రహసనాలు. ముస్లింల గృహాలు, దుకాణాలను బుల్‌డోజర్లతో కూల్చివేయడంపై మౌనం వహించిన జాతీయ మైనారిటీల కమిషన్, తలపాగా ధరించేందుకు బగ్గాను అనుమతించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుదీర్ఘంగా సాగిన ఈ వ్యవహారానికి పంజాబ్, హర్యానా హైకోర్టు ఉత్తర్వు సముచితమైన ముగింపునివ్వడం స్వాగతించవల్సిన విషయం.


బగ్గా వ్యవహరంలో చోటుచేసుకున్న నాటకం దేశ వ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది. ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తా ‘మ్యూచ్యువల్లీ ఎస్యూర్డ్ డిటెన్షన్’ అని వ్యాఖ్యానించాడు. దర్యాప్తు సంస్థలు, ప్రధాన స్రవంతి మీడియా, సామాజిక మాధ్యమాల సహాయంతో తన విమర్శకులను లక్ష్యం చేసుకోవడంలో బీజేపీ అగ్రగామిగా ఉంటోంది. ప్రతిపక్షాల ఆధ్వర్యంలోని ప్రభుత్వాలు బీజేపీ నుంచి ఈ విషయంలో నేర్చుకోవల్సింది అంతా నేర్చుకుంటున్నాయి మరి. అవి కూడా తొలుత ఒక కొరగాని ఫిర్యాదును నమోదు చేస్తాయి. ఎఫ్ఐఆర్‌లో తీవ్ర అభియోగాలు మోపుతాయి. లక్షిత వ్యక్తులపైకి పోలీసులను ఉసిగొల్పుతాయి. వారికొక పాఠాన్ని నేర్పుతాయి. న్యాయస్థానంలో కేసు విచారణకు రాక ముందే జరగవలసినదంతా జరిగిపోతుంది.


ఈ కారణంగా నేను జిగ్నేశ్ మేవానీ కేసును ఉదాహరిస్తున్నాను. న్యాయం కోసం మేవానీ పోరాటాన్ని, అతని ధైర్య సాహసాలను బగ్గా లాంటి వ్యక్తుల వ్యవహారాలతో పోల్చడం హాస్యాస్పదం. చెప్పవచ్చినదేమిటంటే మేవానీ కేసులో బీజేపీ ఉపయోగించిన కపటోపాయం బగ్గా కేసులో ఆప్ సర్కార్ ఉపయోగించిన దానికంటే భిన్నమైనది కాదు. ఇప్పుడు ఒక రాష్ట్ర పోలీస్ దళంపై ఆప్‌కు ప్రప్రథమంగా సంపూర్ణ నియంత్రణ లభించింది. ఇతర ప్రభుత్వాల వలే ఆప్ సర్కార్ కూడా చాలా సంతోషంగా దాన్ని దుర్వినియోగం చేస్తుంది. తప్పుడు అభియోగాలతో కుమార్ విశ్వాస్, అల్కా లాంబా మొదలైన వారిని లక్ష్యం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.


మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూడా భిన్నమైనదేమీ కాదు. పార్లమెంటు సభ్యురాలు నవనీత్ రాణా, ఆమె భర్త, శాసనసభ్యుడు రవి రాణాల ఉదంతమే అందుకొక నిదర్శనం. ముఖ్యమంత్రి ప్రైవేట్ నివాసం ముందు హనుమాన్ చాలిసాను పఠిస్తామని రాణా దంపతులు హెచ్చరించారు. ఇదొక జిమ్మిక్. దీనికి వారిని ముందుస్తుగా నిర్బంధంలోకి తీసుకుంటే సరిపోయేది. అయితే రాజద్రోహం, భిన్న సామాజిక సముదాయాల మధ్య విద్వేషాన్ని రగుల్చుతున్నారనే ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు. అమన్ చోప్రా అనే టీవీ యాంకర్‌పై కూడా ఇటువంటి ప్రతీకార చర్యలకు పాల్పడ్డారు. అపాయంలో పడ్డ చట్టబద్ధ పాలన విషయమై ఆందోళన చెందుతున్నవారందరికీ నా అభ్యర్థన ఒక్కటే : వ్యక్తులు ఎవరైనప్పటికీ మనం సూత్రాలు, ప్రమాణాలు, నియమాలకు కట్టుబడి ఉండాలి. నేనేమన్నా అత్యాశపడుతున్నానా?


యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Read more