అంతా అయోమయం

ABN , First Publish Date - 2022-07-07T09:03:45+05:30 IST

అంతా అయోమయం

అంతా అయోమయం

3, 4, 5 తరగతుల విలీనంపై గందరగోళం 

పాఠశాలల్లో వసతుల లేమి, టీచర్ల కొరత

డీఈవోల నుంచి స్కూళ్లకు అందని ఆదేశాలు 

వాట్సాప్‌ జాబితాతో తరలించాలని సూచన

చాలాచోట్ల వెనకడుగు వేస్తున్న హెచ్‌ఎంలు 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

విద్యార్థులు ఏ పాఠశాలకు వెళ్లాలో తెలియదు.. ఏ ఉపాధ్యాయుడు ఎక్కడుంటారో స్పష్టత లేదు.. కూర్చోవడానికి తరగతి గదుల్లేవు. పాఠశాలల్లో తగిన వసతుల్లేవు. పుస్తకాలు పూర్తిస్థాయిలో పాఠశాలలకు చేరలేదు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. ‘నా రెండు దశాబ్దాల ఉపాధ్యాయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. ఇంత గందరగోళం మధ్య పాఠశాలలోకి అడుగుపెట్టలేదు’ అని ఓ ఉపాధ్యాయుడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పాఠశాల విద్యను వైసీపీ సర్కారు భ్రష్టుపట్టిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాఽధికారుల అత్యుత్సాహం మొత్తం వ్యవస్థనే అభాసుపాలు చేస్తోంది. 3,4,5 తరగతుల విలీన ప్రక్రియన తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తరగతులను తరలించొద్దంటూ బుధవారం కూడా నిరసనలు కొనసాగించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. ఈ గందరగోళానికి కారణమైన జీవో 117కు వ్యతిరేకంగా శుక్రవారం డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపునిచ్చింది. 


ఆదేశాలపై తికమక 

కిలో మీటరు దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విలీనంపై చాలాచోట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. తరగతుల విలీనంపై పాఠశాల విద్యా శాఖ సోమవారం రాత్రి హడావుడిగా ఆదేశాలు జారీ చేసింది. ముందుగా ఉత్తర్వులు జారీ చేసి, పాఠశాలలను అన్నివిధాలా సమాయత్తం చేయడంలో పూర్తిగా విఫలమైంది. పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసి రెండు రోజులైనా జిల్లా విద్యా శాఖ అధికారుల (డీఈవో) నుంచి పాఠశాలలకు ఇంకా ఎలాంటి అధికారిక ఆదేశాలూ అందలేదు. కేవలం వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టిన మ్యాపింగ్‌ పాఠశాలల జాబితా చూసుకుని తరగతులను తరలించాలని సూచిస్తున్నారు. దీనిపై చాలాచోట్ల హెచ్‌ఎంలు వెనకడుగు వేస్తున్నారు. అధికారిక ఆదేశాలు ఇవ్వకుండా, వాట్సాప్‌ మెసేజ్‌లు చూసుకుని విలీనం చేయాలంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఏ ఆదేశాల ప్రకారం తరగతులను తరలించారని భవిష్యత్తులో ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. ఇప్పటికీ పాఠశాల విద్యా శాఖ దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు.


సంక్లిష్టంగా మారిన ప్రక్రియ 

సొంత ఊరిలో అందుబాటులో ఉన్న బడిని వదిలేసి దూరంగా ఉన్న  ఉన్నత పాఠశాలలకు చిన్నపిల్లలను ఎలా పంపగలమని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అసలే వర్షాకాలం, అధ్వానపు రోడ్లలో విద్యార్థులను కిలోమీటర్ల దూరం పంపాలా అని ఉపాధ్యాయులను నిలదీస్తున్నారు. పలుచోట్ల పాఠశాలలకు కంచెలు వేసి నిరసనలు తెలుపుతున్నారు.  దశాబ్దాలుగా తమ గ్రామాల్లోనే బడులు ఉన్నాయని, ఇప్పటికిప్పుడు  సంస్కరణల పేరిట ఎక్కడికో వెళ్లాలంటే ఎలాగని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విలీనానికి వ్యతిరేకంగా నిరసనల హోరు కొనసాగుతోంది. ‘మా బడి మాకే కావాలి’ అనే నినాదంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. 


ఖాళీలను భర్తీ చేయకుండా ఉండేందుకే.. 

ఉపాధ్యాయ ఖాళీలకు మంగళం పాడేందుకే ప్రభుత్వం విలీన ప్రక్రియకు తెరతీసింది. వేలసంఖ్యలో ఉపాధ్యాయులు మిగులు ఉన్నారని చూపిస్తే, ఇక ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సిన అవసరం ఉండదని విలీన ప్రణాళిక రూపొందించింది. దీనివల్ల దాదాపు 24 వేల ఉపాధ్యాయ ఖాళీలు పూర్తిగా రద్దయ్యే పరిస్థితి రానుంది. పాఠశాలలు విలీనం చేయాలని గతంలోనే నిర్ణయించినా, ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా వేసవి సెలవుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని కూడా ప్రకటించింది. సెలవుల్లోపు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, బదిలీలు చేస్తామని తెలిపింది. కానీ బడులు తెరిచే వరకూ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో గందరగోళం నెలకొంది. విలీన ఆదేశాలను అమలు చేయలేక, తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.


మళ్లీ ప్రైవేటు బాటలో.. 

ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న గందరగోళంతో చాలామంది విద్యార్థులు ప్రైవేటు బాట పడుతున్నారు. ఏ పాఠశాలలో చదవాలనే దానిపై నెలకొన్న అస్పష్టత ఈ పరిస్థితికి దారితీస్తోంది. కరోనా సమయంలో తరగతులు లేకపోవడంతో ఫీజులు వృథా అని భావించిన చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మార్చారు. అలా చేరిన పిల్లలను చూపించి తమ సంస్కరణలతోనే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిందంటూ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంది. ఇప్పుడు కరోనా తగ్గడం, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో గందరగోళం నెలకొనడంతో ఇంతకుమందు ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తిరిగి అక్కడికే వెళ్లిపోతున్నారు. 



Updated Date - 2022-07-07T09:03:45+05:30 IST