‘పోడు’ హక్కు గుర్తింపులో అంతా అపసవ్యమే

Nov 30 2021 @ 00:47AM

పోడుభూమి సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. అయితే దాని పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం, ప్రక్రియ ఆదివాసీల అటవీ భూమి హక్కు గుర్తిస్తూ 2006లో కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ‘అటవీహక్కుల గుర్తింపు’ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి. అన్యాయానికి గురైన ఆదివాసీలకు ఇతర సంప్రదాయక అటవీ నివాసితులకు న్యాయం చేయడమే అటవీహక్కుల గుర్తింపు చట్టం లక్ష్యం. అందువల్ల గుర్తింపునకు నోచుకోని ఆదివాసీల హక్కులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి.


లక్ష్యానికి భిన్నంగా చట్టం అమలు చేస్తున్న కారణంగానే తరచుగా తెలంగాణలో అటవీసిబ్బంది, ఆదివాసీల మధ్య భౌతికఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హడావిడిగా పోడుభూమి హక్కు గుర్తింపు వరకే పరిమితం చేసి ఆ చట్టం అమలుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. అత్యంత కీలకమైన ప్రజల సాముదాయక అటవీ హక్కును, అటవీ వనరులపై హక్కును గుర్తించేందుకు తగిన చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనం. లోపభూయిష్ట విధానాలతో చట్టం అమలు చేస్తే ఆదివాసీల అటవీహక్కు సమస్యను ప్రభుత్వం కొనసాగించడమే అవుతుంది. ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. 


గతంలో తిరస్కరణకు గురైన దరఖాస్తులను పునఃవిచారణ చేసి అటవీ హక్కులను గుర్తించాలని, ఏ కారణంతోనైనా తిరస్కరిస్తే అందుకు కారణాలు దరఖాస్తుదార్లకు తెలియజేయాలని సుప్రీంకోర్టు 2019లో రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అటవీహక్కుల గుర్తింపు చట్టం చెల్లుబాటుపై వైల్డ్‌లైఫ్ ఫస్ట్ అనే సంస్థ, ఇతరులు దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు ఆ ఆదేశాన్నిచ్చింది. అందులో భాగంగా 2019 జూలై నాటికి 2,03,976 వ్యక్తిగత పోడుభూమి దరఖాస్తులు, 6.95 లక్షల ఎకరాలకు పైగా అటవీహక్కులు కోరగా సుమారు 3.4 లక్షల మేరకు గుర్తించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింధి. 89,956 దరఖాస్తుదార్లకు సుమారు 3.28 లక్షల ఎకరాలపై హక్కు కోరే అర్హత లేదని, సుమారు 64 వేల ఎకరాలకు సంబంధించిన 19,246 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది. తిరస్కరణకు గురైన 89,956 దరఖాస్తులలో 61,416కు కారణాలు తెలియ జేసింది. ఇంకా 28,540 దరఖాస్తులకు కారణాలు తెలియజేయాల్సి ఉందని ప్రభుత్వం పేర్కొంది. 2021 జూలై నాటికి తిరస్కరణకు గురైన దరఖాస్తుల సంఖ్య 89,956 నుంచి 91,942 (3,33,837 ఎకరాలు)కి పెరిగింది. 


ప్రస్తుత అటవీహక్కుల దరఖాస్తుల స్వీకరణ, హక్కుల నిర్ధారణ ప్రక్రియ ఏ మేరకు ఆదివాసీలకు లబ్ధి చేకూర్చబోతున్నదో తెలియాలంటే, 61,416 పోడు భూమి దరఖాస్తుల తిరస్కరణకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం పేర్కొన్న కారణాల హేతుబద్ధతను నిశితంగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. తిరస్కరణ దరఖాస్తులు ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం (21,952), మహబూబాబాద్ (12,720), అదిలాబాద్ జిల్లా (8,426)లలో ఉన్నాయి. మొత్తం తిరస్కరణ దరఖాస్తులలో 50 శాతం (30,601) దరఖాస్తుదారుల అటవీభూమి, చట్టం పేర్కొన్న తేదీ (2005 మే 13) తర్వాత ఆధీనంలో ఉన్నట్లుగా పేర్కొంటూ ప్రభుత్వం తిరస్కరించింది. నిజమే, అటవీహక్కుల గుర్తింపు చట్టం ప్రకారం 2005 మే 13 నాటికి పోడుభూమి వారి ఆధీనంలో ఉండాలి. అయితే ఆ తేదీ తర్వాతనే పోడుభూమి వారి ఆధీనంలో ఉన్నట్లుగా నిర్ధారిస్తూ తీసుకున్న నిర్ణయానికి చూపుతున్న ఉపగ్రహ ఛాయా చిత్రాల సాక్ష్యం ప్రశ్నించదగినది. అటవీ భూమి ఆధీనాన్ని గుర్తించే విషయంలో ఉపగ్రహ ఛాయా చిత్రాలు, ఇతర సాంకేతిక సాక్ష్యాలను కేవలం ఇతర సాక్ష్యాలను బలపరచడానికి మాత్రమే వినియోగించాలి. అవి ప్రాధమిక సాక్ష్యాలు కావని అటవీహక్కుల గుర్తింపు చట్ట నియమం 11(2) పేర్కొంది. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ 2013లో గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అందువల్ల క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా హక్కులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రభుత్వం పేర్కొన్నట్లు సుమారు 30,601 మంది దరఖాస్తుదారులు 2005 మే 13 తేదీ తర్వాతనే పోడుభూమి కొట్టి ఉంటే వారిపై వెంటనే అటవీ చట్టం -1967 కింద కేసులు బనాయించి చట్టపరమైన చర్యలు తీసుకుని ఉండి ఉండాలి. అటవీ సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించిన సంబంధిత అటవీ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుని ఉండి ఉండాలి. అటువంటి ఆధారాలు ఏవీ లేకుండా ఉపగ్రహ ఛాయాచిత్రాల సాక్ష్యం ఆధారంగా ఏకపక్షంగా ఆదివాసీల అటవీహక్కు తిరస్కరించడం సరైనది కాదు.


హక్కు కోరిన పోడు భూమి 12,819 దరఖాస్తుదారుల సాగులో లేదని మరొక కారణం చూపి ప్రభుత్వం తిరస్కరించింది. వాస్తవానికి, పడావు భూమి (సాగు చేయకుండా విడచిపెట్టిన పోడుభూమి), వ్యవసాయ అనుబంధ అవసరాలకు వాడే పోడుభూమిపై కూడా అటవీ భూమి హక్కు కోరవచ్చని కేంద్ర గిరిజనసంక్షేమ శాఖ ‘స్వీయసాగు’కు వివరణ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్ల సాగుభూమి కాదని తిరస్కరించడం సహేతుకం కాదు. సరైన సాక్ష్యాలు లేవని సుమారు 6,641 (11 శాతం) దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించింది. అటవీహక్కుల గుర్తింపు చట్ట నియమాలు(11) కింద రెండు సాక్ష్యాలు ఉంటే చాలు. 13 రకాల సాక్ష్యాలను చట్టం(రూల్ 13) గుర్తించింది, అందులో ఊరి పెద్దల సాక్ష్యం కూడా ఒకటి. రాతపూర్వక సాక్ష్యాలు లేకపోతే క్షేత్ర స్థాయి భౌతికసాక్ష్యాలను కూడా సాక్ష్యంగా పరిగణించవచ్చు. అటవీహక్కు నిర్ధారణ ప్రక్రియలో సాక్ష్యం చూపాల్సిన బాధ్యత దరఖాస్తుదారునితో పాటు సబ్‌కలెక్టర్ అధ్యక్షతన ఉండే సబ్‌డివిజన్ స్థాయి కమిటీకి కూడా ఉంది. విచారణకు అవసరమయ్యే అటవీ మ్యాపులు, అటవీ రికార్డులు తదితర ఆధారాలను గ్రామసభ విచారణ సమయంలో నివేదించాలి. ఈ బాధ్యత సబ్‌డివిజన్ స్థాయి కమిటీది కాగా పని తీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత అటవీ హక్కుల నిబంధన 8 కింద జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే జిల్లా స్థాయి కమిటీకి ఉంటుంది. అందువల్ల సరైన సాక్ష్యాలు దరఖాస్తుదారుల వద్ద లేవని తిరస్కరించడంలో చట్టబద్ధత లేదు. 


ప్రభుత్వం పోడుభూమి దరఖాస్తుల స్వీకరణకు ఒక నిర్ణీత కాల వ్యవధి పెట్టి ఆ భూమిపై హక్కులు గుర్తించేందుకు పూనుకోవడమూ ఆక్షేపణీయమే. అటవీహక్కుల గుర్తింపు చట్టం కింద గ్రామసభ దరఖాస్తుల స్వీకరణకు ప్రకటించిన మూడునెలల లోగా దరఖాస్తుదారులు రూల్ 11(1) కింద సాక్ష్యాలు అందజేయాల్సి ఉంది. చట్టం అమలుకు ఎటువంటి కాలపరిమితి లేదు. ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇది వన్‌టైమ్ హక్కుల నిర్ధారణ కాదు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో గ్రామసభ నిర్వహణ, అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు షెడ్యూల్డ్ ప్రాంత పంచాయితీరాజ్ విస్తరణ చట్టం ప్రకారం గ్రామస్థాయిలో జరగాలి. హక్కుల నిర్ధారణ ప్రక్రియలో సబ్‌డివిజన్, జిల్లాస్థాయి కమిటీలలో ఎంపిక జేసిన మండల, జిల్లాపరిషత్ సభ్యులు ఉండేలా, వారు పాల్గొనేలా ప్రభుత్వం చూడాలి. హక్కుల విచారణ ప్రజాస్వామికంగా న్యాయబద్ధంగా ఉండాలి.


తెలంగాణలో 2,641 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 37.04 లక్షల ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. రెవెన్యూ గ్రామ పరిధి లోపల, బయట అటవీప్రాంతాల్లో సాముదాయక అటవీహక్కులు (అడవులలో చిన్నతరహా అటవీ ఉత్పత్తులు, పశువుల మేతస్థలాలు, నీటి వనరులలో చేపల వేట మున్నగునవి), అటవీ వనరుల నిర్వహణ హక్కులను కూడా చట్టం కింద గుర్తించాల్సి ఉంది. అటవీ శాఖతో పాటు గ్రామసభకు కూడా అడవుల నిర్వహణ అధికారం ఉందని గ్రహించాలి. అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచుల ఆవాస హక్కులను అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద గుర్తించాలి. గతంలో వనసంరక్షణ సమితి పేరిట ఇచ్చిన సాముదాయక అటవీపట్టాలు రద్దు చేసి గ్రామసభలకు ఇవ్వాల్సిందిగా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి 2013లో ఉత్తర్వులు పంపింది. అటువంటి అటవీ భూములు తెలంగాణలో సుమారు 5 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి. ఇప్పటికీ కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నది. ఆదివాసీలకు పోడుభూమి హక్కులు, పోడు సాగు హక్కులతో పాటు అనేక హక్కులను తెలంగాణ ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. అందువల్ల అనుసరించే విధానంలో మార్పు, అమలులో చిత్తశుద్ధి అత్యంత అవసరం. లేనిపక్షంలో ఆదివాసీల అటవీభూమి హక్కుల సమస్యకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైనట్లే.

డా. పల్లా త్రినాధరావు

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
[email protected]ndhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.