అంతా హడావుడే..!

ABN , First Publish Date - 2022-05-19T05:11:42+05:30 IST

నైరుతి రుతుపనాలు మొదలే కాలేదు. కుంటలు, చెరువులు నిండేంతగా వర్షాలు పడలేదు.

అంతా  హడావుడే..!

  1. వర్షాలు వస్తేనే నీటి లభ్యతపై స్పష్టత
  2. ఇదేం తెలియకుండానే సాగునీరిచ్చేలా సన్నాహాలు
  3. నీటి విడుదల లక్ష్యాలను నిర్దేశించాలంటున్న ప్రభుత్వం
  4.  నేడు ఐఏబీ సమావేశం


(కర్నూలు - ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపనాలు మొదలే కాలేదు. కుంటలు, చెరువులు నిండేంతగా వర్షాలు పడలేదు. జలాశయాల్లో నీళ్లు లేవు. అయితే.. ఈ ఖరీఫ్‌లో పూర్తి ఆయకట్టుకు సాగు నీరు ఇస్తామని ప్రభుత్వం ముందే చెబుతోంది. ఈ నెల 19వ తేదీలోగా సాగునీటి సలహా మండలి (ఏఐబీ) సమావేశాలు నిర్వహించి ఎంత ఆయకట్టుకు సాగునీరు ఇస్తారో తేల్చాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో హడావిడిగా గురువారం కలెక్టరు కోటేశ్వరరావు అధ్యక్షతన కలెక్టరు సమావేశ భవనంలో ఐఏబీ సమావేశం నిర్వహిస్తున్నారు. వాస్తవంగా జలాశయాల్లో వరద నీరు చేరికను బట్టి ఎంత ఆయకట్టుకు సాగునీటి విడుదల ఇవ్వాలనేదానిపై జూన చివర్లో లేదా జూలైలో ఐఏబీ నిర్వహిస్తారు. ఈ ఏడాది ముందే నిర్వహించడంపై ఇంజనీర్లలో చర్చగా మారింది. 

  లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యం: 

శ్రీశైలం, తుంగభద్ర, గాజుదిన్నె జలాశయాల్లో వరద చేరలేదు. శ్రీశైలం జలాశయం సామర్థ్యం 215 టీఎంసీలకు గాను తాజాగా డెడ్‌ స్టోరేజీలో 35 టీఎంసీలు ఉన్నాయి. తుంగభద్ర జలాశయం సామర్థ్యం 100.85 టీఎంసీలకు గానూ 12.88 టీఎంసీలు ఉన్నాయి. గాజులదిన్నె జలాశయంలో 4.5 టీఎంసీలకు గాను 1.82 టీఎంసీల నీరే నిల్వ ఉంది. అన్ని జలాశయాలది ఇదే పరిస్థితి. ఖరీఫీ సీజన ప్రారంభం కాకముందే సాగునీరు ఇచ్చేలా ఐఏబీ సమావేశాలు నిర్వహించి ఆయకట్టు నీటి విడుదల లక్ష్యాలను నిర్దేశించమని ప్రభుత్వ ఆదేశించడం విడ్డూరంగా ఉంది. దీంతో కేసీ కాలువ, తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), జీడీపీ, హంద్రీనీనా కాలువల కింద 4.05 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే.. 2.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిపై గురువారం జరిగే సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) పరిధిలో 14,255 ఎకరాల ఆయకట్టు ఉన్నా.. కాలువ గుంతకల్లు సబ్‌ డివిజన పరిధిలోకి వస్తుండడంతో సాగునీటి లక్ష్యాలపై అనంతపురం జిల్లా ఐఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. గాజులదిన్నె కింద రబీకి నీరు ఇస్తారు. శివభాస్యం జలాశయంలో తాజాగా నీళ్లు లేవు.. నీటి లభ్యతను బట్టి సాగునీటి విడదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


Updated Date - 2022-05-19T05:11:42+05:30 IST