‘ధరణి’కి అంతా సిద్ధం

ABN , First Publish Date - 2020-10-27T11:07:49+05:30 IST

మరో రెండురోజుల్లో ప్రారంభించనున్న ధరణి పోర్టల్‌కు ఎలాంటి ఆటంకాలు రాకుండా అధికారులు మండలస్థాయిలో సిద్ధం చేస్తున్నారు

‘ధరణి’కి అంతా సిద్ధం

కార్యాలయాలకు చేరుకున్న మెటీరియల్‌

నేడు తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లకు శిక్షణ

పలు మండలాల్లో పూర్తయిన ట్రయల్స్‌


తాండూరు : మరో రెండురోజుల్లో ప్రారంభించనున్న ధరణి పోర్టల్‌కు ఎలాంటి ఆటంకాలు రాకుండా అధికారులు మండలస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు ఇప్పటికే పలు మండలాల్లో ట్రయల్స్‌ పూర్తయ్యాయి. మంగళవారం తహసీల్దార్లు, నాయబ్‌ తహసీల్దార్లకు ధరణి పోర్టల్‌పై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వను న్నారు. హైదరాబాద్‌ నగర శివారులోని ఘట్‌కేసర్‌లో నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమానికి తహసీల్దార్‌, నాయబ్‌ తహసీల్దార్లు హాజరు కావాలంటూ ఆదేశాలు వచ్చాయి. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి క్రయ-విక్రయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అవసరమైన శిక్షణను ఇవ్వనున్నారు. కొత్తరెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ బాధ్యతలను తహసీల్దార్లకు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను సబ్‌ రిజిస్ట్రార్‌లకు అప్పగించిన విషయం విధితమే.


పోర్టల్‌ సంబంధించి తాండూరు డివిజన్‌లోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌, కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌ మండలాలకు ప్రభుత్వం మెటీరియల్‌ను సరఫరా చేసింది. డాక్యుమెంట్‌ స్కానర్‌, మూడు కంప్యూటర్లు, ఇన్వ ర్టర్‌, మండల రెవెన్యూ కార్యాలయాల్లో ఇందుకు సంబంధించి మెటీరియల్‌ను ఇప్పటికే బిగించారు. ప్రింటింగ్‌ తదితర మెటీరియల్‌ వచ్చాయి. ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ ప్రారంభించగానే రిజిస్ట్రేషన్లు షురూ కానున్నాయి.ఒకేరోజులో రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ పూర్తి కానున్నాయి. ఇప్పటికే ధరణి ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి. 

Updated Date - 2020-10-27T11:07:49+05:30 IST