దస్తగిరి సాక్ష్యమే కీలకం

ABN , First Publish Date - 2022-02-17T07:34:23+05:30 IST

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో నాలుగో నిందితుడు, వివేకా మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని

దస్తగిరి సాక్ష్యమే కీలకం

అప్రూవర్‌గా అనుమతించడం సరైనదే: హైకోర్టు

దర్యాప్తులో ప్రత్యక్ష ఆధారాలు లభించలేదు

గదిలో ఏం జరిగిందో వాచ్‌మ్యాన్‌కు తెలీదు

తెలిసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చవచ్చు

దోషులు తప్పించుకోవద్దనే సీబీఐ నిర్ణయం

వివేకాను ఎందుకు, ఎలా చంపిందీ

దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు

పరిశీలించాకే కడప కోర్టు తీర్పు

దానిని సమర్థిస్తున్నాం: హైకోర్టు


అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో నాలుగో నిందితుడు, వివేకా మాజీ డ్రైవర్‌ షేక్‌ దస్తగిరిని అప్రూవర్‌గా పరిగణించడాన్ని హైకోర్టు ఆమోదించింది. దీనిపై గతంలో కడప చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు ఎర్ర గంగిరెడ్డి, జి.ఉమాశంకర్‌ రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే రిజర్వు చేసిన తీర్పును న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం వెలువరించారు. వివేకాను ఎవరు, ఎందుకు చంపారు, ఎలా చంపారనే విషయాన్ని దస్తగిరి ఇప్పటికే ప్రొద్దుటూరు లో మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసులో ఆయన అప్రూవర్‌గా మారేందుకు హైకోర్టు అంగీకరించడంతో అసలు దోషులకు శిక్ష పడటం ఖాయమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. 


మరో ‘సాక్ష్యం’ లేనందునే... 

‘‘నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన ఆధారాలేవీ లభించలేదు. అందుకే... ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న దస్తగిరి అప్రూవర్‌గా మారేందుకు కడప కోర్టు అనుమతించింది’’ అని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. ‘‘2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత వివేకా హత్య జరిగింది. తొలుత స్థానిక  పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేశారు. తదనంతరం ఏర్పాటైన సిట్‌,  సీబీఐ దర్యాప్తులో కూడా హత్యకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యాలు సేకరించలేకపోయారు. హత్య జరిగిన రోజున నిందితుడు గంగిరెడ్డి... వివేకాతోపాటు ఆయన ఇంట్లోనే ఉన్నారు. మిగిలిన నిందితులు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి వెళ్లడం... ఇంట్లోంచి శబ్దాలు రావడం, కొద్ది సేపటికి నలుగురు నిందితులు బయటకు వెళ్లడం మాత్రమే వాచ్‌మ్యాన్‌ రంగన్న చూశాడు. అంతేతప్ప... వివేకా బెడ్‌ రూమ్‌, బాత్‌రూమ్‌లో ఏం జరిగిందో ఆయన చూడలేదు. రంగన్న సాక్ష్యం సీబీఐ వాదనను బలపరిచే సాక్ష్యంగా (సర్కమ్‌స్టాన్షియల్‌ ఎవిడెన్స్‌) మాత్రం ఉపయోగపడుతుంది. అయితే... నిందితుడు దస్తగిరి ఈ నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు.  ప్రాథమిక చార్జిషీట్‌లో, దర్యాప్తు సంస్థ సేకరించిన వివరాల ఆధారంగా ఆ రోజు రాత్రి, అక్కడ ఏమి జరిగిందనే విషయాన్ని ప్రాసిక్యూషన్‌ రుజువు చేయలేదు.  ఈ నేపథ్యంలో దోషులు తప్పించుకోకుండా చూసేందుకు... ప్రత్యక్ష సాక్షి ద్వారా  నేరాన్ని నిరూపించేందుకు దస్తగిరికి క్షమాభిక్ష పెట్టడం సీబీఐకి అనివార్యమైంది. తీవ్రమైన నేరాల్లో సాక్ష్యాలు లేనప్పుడు నేరంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తిని సాక్షిగా పెట్టుకోవచ్చు’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.


దస్తగిరికి ముందస్తు బెయిల్‌ వ్యతిరేకించకుండా సీబీఐ దురుద్దేశంతో వ్యవహరించిందన్న పిటిషనర్ల వాదన సరికాదని తెలిపింది. ‘‘2021 ఆగస్టులోనే దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. అన్ని వివరాలు వెల్లడించాడు. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా అప్రూవర్‌గా మారతానని 2021 సెప్టెంబరులో సీబీఐకి లేఖ రాశాడు. దస్తగిరి సాక్ష్యం నిందితుల నేరాన్ని నిరూపించేందుకు ఉపయోగపడుతుందని సీబీఐ భావించి ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించి ఉండకపోవచ్చు. దస్తగిరి వాంగ్మూలాలతోపాటు అన్ని వివరాలు పరిశీలించిన తరువాతే మేజిస్ట్రేట్‌ ఆయనకు క్షమాభిక్ష ప్రసాదించారు’’ అని హైకోర్టు తెలిపింది. ఇతర నిందితుల నేరాన్ని నిరూపించేందుకు దస్తగిరి సాక్ష్యం తప్పనిసరి’ అని స్పష్టం చేసింది. 

Updated Date - 2022-02-17T07:34:23+05:30 IST