రాలుతున్న చరిత్ర

ABN , First Publish Date - 2020-10-27T09:58:22+05:30 IST

దుర్భేద్యమైన కోటగోడలు... ఎనిమిది ద్వారాలు... 87 బురుజులు... లోపల భవంతులు, ఉద్యానవనాలు, కందకాలు, నీటి చెలమలు, ప్రార్థనా మందిరాలు..

రాలుతున్న చరిత్ర

‘‘భాగ్యనగర ఘనతకు సాక్ష్యాలు చారిత్రక కట్టడాలు


భావితరాలకు ఈ నేల సంస్కృతిని ప్రస్ఫుటించే జ్ఞాపకాలు. వాటికి ఇప్పుడు వర్షం ముప్పు వాటిల్లింది. అందులో శతాబ్దాల నాటి గురుతులు కొన్ని నేలరాలాయి. మొన్న వందేళ్ల గౌలీగూడ బస్టాండ్‌... నిన్న 154ఏళ్ల సుల్తాన్‌బజార్‌ స్కూలు... ఇవాళ చార్‌సౌ సాల్‌ చరిత కలిగిన గోల్కొండ కోటలోని బురుజులు... ఇంకెన్ని కోల్పోవాలి..?‘‘ప్రకృతి విపత్తుల నుంచి వారతస్వ భవనాలను పరిరక్షించాలని’’ నిపుణులు కోరుతున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ (ఆంధ్రజ్యోతి): దుర్భేద్యమైన కోటగోడలు... ఎనిమిది ద్వారాలు... 87 బురుజులు... లోపల భవంతులు, ఉద్యానవనాలు, కందకాలు, నీటి చెలమలు, ప్రార్థనా మందిరాలు... మరెన్నో నిర్మాణాల సమూహం 400 అడుగుల ఎత్తులో కొలువైన గోల్కొండ కోట. ఆ కోటలోనికి అడుగుపెట్టేందుకు లక్షమంది సైన్యంతో కొన్ని నెలలపాటు పోరాడాడు ఔరంగజేబు. అయినా, వీలుకాలేదు. చివరికి కుతుబ్‌షాహీల సైన్యాధ్యక్షుడికి లంచం ఎరజూపి దుర్గంలోకి చొరపడినట్లు చరిత్రకారులు చెబుతారు. అంతటి కట్టుదిట్టమైన కోట గోల్కొండ. వెయ్యేళ్ల చరిత్రకు సాక్ష్యం. 1518లో గోల్కొండ సుబేదార్‌ హోదాలో కొలువుదీరిన తొలి కులీ కుతుబ్‌షా సుల్తాన్‌ ఉల్‌ముల్క్‌ ఏలికలో కోట పటిష్టతకు అడుగులు పడ్డాయి. ప్రపంచంలోనే అరుదైన ప్రాసాదంలో మేటిగా ఈ కోట ఖ్యాతికెక్కింది. ఆ అందమైన కట్టడాల సమూహంలో కటోరా హౌస్‌ ఒకటి. కోటలోని నిత్యావసరాల కోసం నెలవైన నీటి నిల్వ ప్రదేశాన్ని కటోరా హౌస్‌ అంటారు. దుర్గం చెరువు నుంచి దర్గా చెరువుతో కలగలిసిన పైప్‌లైన్‌ ద్వారా కోటలోకి నీటి సరఫరా అయ్యేది. ఆ కటోరా హౌస్‌ ప్రహరీలోని కొంతభాగం కొద్ది రోజుల కిందట నేలకూలింది. కోటలో 13వ శతాబ్దం నాటి జగదాంబికాలయం ప్రసిద్ధి. ఆలయ పరిసరాల్లోని మరో బురుజు కూడా కుప్పకూలింది. అబ్దుల్లా హయాంలో నిర్మితమైన నయాఖిల్లా పరిసరాల్లోని మజ్ను బురుజు 15 రోజుల కిందట కాలగర్భంలో కలిసిపోయింది. 


నిర్లక్ష్యమే...

వర్షాలకు చారిత్రక నిర్మాణాలను కోల్పోవడం భాగ్యనగరానికి కొత్తేమీ కాదు. 1908, మూసీ వరదలతో అఫ్జల్‌గంజ్‌, చాదర్‌ఘాట్‌, ముస్లింజంగ్‌ వంతెనలు కొట్టుకుపోయాయి. అఫ్జల్‌గంజ్‌ ఆస్పత్రి భవనం వంటి మరెన్నో నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధికాని రోజులవి. ఇప్పుడు వం దల ఏళ్ల నిర్మాణాలను పరిరక్షించేందుకు అధునాతన టెక్నాలజీ ఇంగ్లండ్‌ తదితర దేశాల్లో అందుబాటులో ఉందంటారు నిపుణులు. ప్రకృతి విపత్తుల సమయంలో వారసత్వ కట్టడాలను పరిరక్షించడం కన్సర్వేషన్‌ అండ్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ పాలసీలో భాగం. అందుకు ప్రత్యేకంగా డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌నూ రూపొందించారు. అయితే, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌లో అందుబాటులో లేదని ఆర్కిటెక్ట్‌ నిపుణురాలు తురగా వసంతశోభ చెబుతున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన మిసిసిప్పీ హ్యాంగర్‌(గౌలీగూడ బస్టాండ్‌) రెండేళ్ల కిందట వర్షాల ధాటికి కూలింది. ఆ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే నేలమట్టమైందని, విమర్శిస్తున్న వారూ లేకపోలేదు. కొద్దినెలల కిందట సుల్తాన్‌బజార్‌లోని 154ఏళ్ల నాటి పాఠశాల భవనం చరిత్రలో కలిసింది.


అదీ వర్షానికి గోడలు నానడంతో, పైకప్పు కూలిందని నిపుణులు చెబుతున్నారు. మాల్యాల ప్యాలెస్‌, ఆదిల్‌ ఆలంమెన్షన్‌, అలీజా కోట్లా, మెహిది నవాజ్‌జంగ్‌ దేవిడి వంటి చారిత్రక కట్టడాలను ఉమ్మడి రాష్ట్రంలో కోల్పోయాం. ‘‘వారం రోజులుగా నగరంలో వారం నుంచి కురుస్తున్న వర్షాలకు మరెన్నో చారిత్రక నిర్మాణాలకు ప్రమాదం లేకపోలేదు. అసలు నష్టాన్ని ఈ వర్షాల తర్వాతే గుర్తించగలం’’ అని చరిత్ర అధ్యయనకారుడు సఫీవుల్లా చెబుతున్నారు. చారిత్రక కట్టడాలను నిపుణులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అప్పుడే, ప్రమాదాన్ని ముం దుగా గుర్తించగలం. తద్వారా భవిష్యత్తు తరాలకు ఈ నేల అస్తిత్వాన్ని చాటగలం. 


విదేశాల్లో...

ప్యారి్‌సలో 850ఏళ్ల నాటి నాట్రడామ్‌ కేథట్రల్‌ చర్చిలో నిరుడు అగ్నిప్రమాదం సంభవించింది. అత్యంత పురాతనమైన ప్రార్థనామందిరంలో విలువైన వస్తువులెన్నో అగ్నికి ఆహుతయ్యాయి. ఆ విపత్తు జరిగిన ఒక గంటలోపే స్థానిక ప్రభుత్వం స్పందించింది. ఆ చారిత్రక కట్టడం వన్నె తగ్గకుండా పూర్తి మరమ్మతులు చేయించనున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సాయమందించేందుకు కొన్ని స్థానిక ప్రైవేటు సంస్థలు, బాధ్యతగల పౌరులూ ముందుకొచ్చారు. వారసత్వ కట్టడాల పట్ల ఇతర దేశాల్లో నెలకొన్న ఆదరణకు ఇదొక ఉదాహరణ.


భావితరాలు మనల్ని మన్నించవు...

ఇంగ్లాండు తదితర దేశాల్లో వర్షాకాలం ముందు తప్పనిసరిగా వారసత్వ కట్టడాలను నిపుణులు పర్యవేక్షిస్తారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు చారిత్రక కట్టడాలను కాపాడుకునేందుకు యూరోపియన్‌ దేశాల్లో ప్రత్యేక పద్ధతులు, విధానాలున్నాయి. వాటిని మనమూ స్వీకరించాలి. ఏ కట్టడం ఒకేసారి కూలిపోదు. కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి లోనైన తర్వాతే నీటికి నాని నేలమట్టమవుతాయి. ముందే గమనిస్తే, తగిన చర్యల ద్వారా వాటిని కాపాడుకోవచ్చు. అందుకు మరెన్నో పద్ధతులు మనకు ఉన్నాయి. కోఠి ఉమెన్స్‌ కాలేజీలోని కొంత భాగం శిథిలావస్థలో ఉంది. అలా మరెన్నో చారిత్రక నిర్మాణాలు క్షుప్తావస్థలో బిక్కుబిక్కుమంటున్నాయి. వాటిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోకుంటే చరిత్ర జ్ఞాపకాలను మనమే చేతులారా కూల్చినవాళ్లుగా మిగులుతాం. భావితరాలూ మనల్ని క్షమించవు. 

- తురగా వసంతశోభ, సీనియర్‌ కన్సర్వేటీవ్‌ ఆర్కిటెక్ట్‌


చారిత్రక కట్టడాలపై పర్యవేక్షణ అవసరం...

గోల్కొండకోటలో రెండు బురుజులు కూలాయి. వాస్తవానికి ప్రతియేటా చారిత్రక కట్టడాలను నిపుణులు పర్యవేక్షించాలి. వాతావరణ మార్పులకు అనుగుణంగా వాటిని కట్టుదిట్టం చేయాలి. కానీ అవేవీ తెలంగాణలో జరగడం లేదనిపిస్తోంది. గోల్కొండ ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(ఏఎ్‌సఐ)పరిధిలోని కట్టడం. ప్రతియేటా కేంద్రం చారిత్రక కట్టడాల పరిరక్షణకు కేటాయించే నిధుల్లో ఈ ఏడాది దాదాపు డెభ్భై శాతం తగ్గించినట్లు సమాచారం. దానికి తోడు సిబ్బంది కొరత ఉంది. కేంద్ర, రాష్ట్ర పురావస్తుశాఖల మధ్య సమన్వయం లోపంకూడా ఉంది. ఒక పర్యాటక స్థలంపై కొన్ని వందల కుటుంబాల జీవనం ఆధారపడుంది. పైగా మన నేల కీర్తిని చారిత్రక కట్టడాలు మరింత ఇనుమడింపచేస్తాయి. కనుక చారిత్రక నిర్మాణాలపై నిర్లక్ష్యాన్ని వీడాలి. 

- అనూరాధారెడ్డి, కన్వీనర్‌, ఇన్‌ట్యాక్‌ హైదరాబాద్‌

Updated Date - 2020-10-27T09:58:22+05:30 IST