కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-05-09T19:29:32+05:30 IST

కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ: కరోనా బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకోడానికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బాధితుల వద్ద కరోనా పాజిటీవ్ ధృవపత్రం లేకున్నా ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందించాలని నిర్దేశించింది. ధృవీకరణ లేకున్నా.. లక్షణాలు కనిపించేవారిని కరోనా అనుమానిత కేసులుగా పరిగణించి రోగి తీవ్రతను బట్టి కోవిడ్ కేర్ సెంటర్, డెడికేటెడ్ కోవిడ్ హెల్త్ సెంటర్, డెడికేటెడ్ కోవిడ్ ఆస్పత్రులలో చేర్చుకుని చికిత్స అందించాలని సూచించింది.


ఏదో ఒక కారణం చెప్పి రోగికి వైద్యసేవలు నిరాకరించడానికి ఇకపై వీల్లేదని, వేరే నగరానికి చెందిన రోగైనా ఆక్సిజన్, అత్యవసర మందులు అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. రోగి స్థానిక గుర్తింపు కార్డు చూపించలేదన్న కారణంతో ఆస్పత్రిలో చేర్చుకోకుండా నిరాకరించడానికి వీల్లేదంది. అవసరం, ప్రాతిపదికన ఆస్పత్రిలో ప్రవేశం కల్పించాలంది. మరోవైపు అవసరం లేనివారితో పడకలు నిండిపోకుండా చూసుకోవాలని, కొత్త పాలసీకి అనుగుణంగా రోగులను డిశ్చార్జ్ చేయాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మూడు రోజులలోపు స్థానిక ఆస్పత్రులకు ఉత్తర్వులు జారీచేయాలని సూచించింది.

Updated Date - 2021-05-09T19:29:32+05:30 IST