పార్టీలో సభ్యత్వమే లేదు.. ఇక ప్రధాన కార్యదర్శి ఎలా అవుతారు?

ABN , First Publish Date - 2022-06-11T12:49:38+05:30 IST

పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేని వీకే శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎలా అవుతారని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త

పార్టీలో సభ్యత్వమే లేదు.. ఇక ప్రధాన కార్యదర్శి ఎలా అవుతారు?

                          - Shashikalaపై ఎడప్పాడి ఆగ్రహం


అడయార్‌(చెన్నై), జూన్‌ 10: పార్టీలో ప్రాథమిక సభ్యత్వమే లేని వీకే శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎలా అవుతారని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ఉప సమన్వయకర్త ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రశ్నించారు. మైలాడుదురై జిల్లా తిరుక్కడైయూరులో జరిగిన ఒక వివాహ శుభకార్యంలో ఆయన పాల్గొన్న ఆయన.. విలేకరులతో మాట్లాడుతూ... డెల్టా ప్రాంత ప్రజలకు కావేరీ నదీజలాలే జీవనాధారమన్నారు. అందుకే దివంగత జయలలిత సుప్రీంకోర్టుకు వెళ్ళి వారికి న్యాయం జరిగేలా పోరాటం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేనని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకేకు, డీఎంకేకు కేవలం మూడు శాతం మాత్రమే ఓట్ల తేడా అని అన్నారు. వీకే శశికళ అన్నాడీఎంకేలోనే లేరని, ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకుంటామని టీటీవీ దినకరన్‌ పదేపదే ప్రకటనలుచేస్తున్నారని, నిజానికి ఆయనకంటూ సొంతపార్టీ ఉందన్నారు. అలాంటప్పుడు అన్నాడీఎంకేను ఎలా స్వాధీనం చేసుకుంటారని ఎడప్పాడి ప్రశ్నించారు. 


ధర్మపురం ఆధీనంతో భేటీ 

ధర్మపురం ఆధీనంతో ఎడప్పాడి కె.పళనిస్వామి శుక్రవారం సమావేశమయ్యారు. మైలాడుదురై జిల్లా తిరుక్కడైయూరులో వున్న ధర్మపురం ఆధీనానికి వచ్చిన ఎడప్పాడికి సిబ్బంది సాదరస్వాగతం పలికారు. ఆ తర్వాత గోపూజ, గజపూజ, వినాయక, అమృత్‌కడేశ్వర్‌, అభిరామి, మురుగన్‌ తదితర దేవతామూర్తుల సన్నిధులకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ధర్మపురం ఆధీనంను కలుసుకుని ఆశీస్సులు పొందారు. 

Updated Date - 2022-06-11T12:49:38+05:30 IST