వారికి న్యాయం చేయలేకపోయా: Ex Cm

ABN , First Publish Date - 2022-05-14T17:07:28+05:30 IST

తుదిశ్వాసదాకా ప్రజాసేవకే అంకితమవుతానని జేడీఎస్‌ నేత, మాజీ ము ఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. రాష్ట్రంలో జలవనరులు పెంచాలని, తద్వారానే సాగు మరింత

వారికి న్యాయం చేయలేకపోయా: Ex Cm

- తుదిశ్వాస దాకా ప్రజాసేవకే అంకితం

- పంచరత్నాలతో సమగ్రాభివృద్ధి 

 - జనతా జలధార ముగింపు సభలో Kumaraswami


బెంగళూరు: తుదిశ్వాసదాకా ప్రజాసేవకే అంకితమవుతానని జేడీఎస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. రాష్ట్రంలో జలవనరులు పెంచాలని, తద్వారానే సాగు మరింత సాధ్యమని, అన్ని నదుల నుంచి నీటిని సేకరించి జిల్లాలవారీగా ప్రత్యేక రథాలలో సాగిన జనతా జలధార ముగింపు సభ శుక్రవారం నెలమంగలలో నిర్వహించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీంతోపాటు పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి జేడీఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సభలో కుమారస్వామి మాట్లాడుతూ ఆస్తులు, భూములు సంపాదించుకోవాలనే ఆశ లేదని, మీ హృదయంలో ఇచ్చే అభిమానమే తనకు ఆస్తి అన్నారు. 25 ఏళ్లక్రితం ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన దేవెగౌడ అప్పటి నుంచి రైతు సంక్షేమమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారన్నారు. నిరంతరం అన్నదాతల కోసం జేడీఎస్‌ పనిచేసిందన్నారు. రెండున్నరేళ్లక్రితం ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించినా సంకీర్ణం కారణంగా అన్నదాతలకు న్యాయం చేయలేకపోయాననే బాధ వెంటాడుతోందన్నారు. కొవిడ్‌ తర్వాత అన్నివర్గాలు కష్టాలు అనుభవించాయన్నారు. ఉపాధి, వ్యాపారం కోసం బెంగళూరులో స్థిరపడినవారంతా స్వగ్రామాలకు వెనుతిరిగి కూలీలుగా మారారన్నారు. విద్యాభ్యాసం కష్టమవుతోందన్నారు. రాష్ట్రప్రజలకు సమగ్ర అభివృద్ధి అందించాలనే ఉద్దేశ్యంతోనే జేడీఎస్‌ పంచరత్నాలు పేరిట సంక్షేమాలు తీసుకురాదలిచిందన్నారు. జలవనరులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, రైతుల ఆ దాయం పెంపు వంటి పథకాలను తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు, ప్రతి కుటుంబానికి శాశ్వతమైన నివాసం కల్పిస్తామన్నారు. జనతా జలధార ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా తమ వెంట నడిచారన్నారు. ముగింపు సభకు లక్షలాదిమంది తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. నాలుగైదు రోజులుగా వర్షం వెంటాడిందని, సభ జరుగుతున్న సమయానికే తెరిపి ఇచ్చిందని, ఇది దేవుడి ఆశీస్సులన్నారు. దేవెగౌడ హామీ ఇచ్చినట్టుగా మరోసారి లేచి వస్తానని, ప్రజల ఆశీస్సులతో 2023లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా సహకరించాలన్నారు. 123 లక్ష్యానికి రాష్ట్ర ప్రజల సహకారం అవసరమన్నారు. ముగింపు సందర్భంగా జలహారతి ఇచ్చారు. కార్యక్రమంలో మాజీమంత్రి బండెప్ప కాశంపూర్‌, హెచ్‌ఎడీ రేవణ్ణ, టీఏ శరవణ తదితరులు పాల్గొన్నారు. 



Read more