రాజ్యసభ బరి నుంచి వైదొలిగేది లేదు

ABN , First Publish Date - 2022-06-09T17:56:20+05:30 IST

రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తమ పార్టీ అభ్యర్థి కుపేంద్రరెడ్డి వైదొలిగే ప్రశ్నేలేదని జేడిఎస్‌ అగ్రనేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తేల్చి

రాజ్యసభ బరి నుంచి వైదొలిగేది లేదు

                             - తేల్చిచెప్పిన జేడీఎస్‌ నేత Kumaraswami


బెంగళూరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ ఎన్నికల బరి నుంచి తమ పార్టీ అభ్యర్థి కుపేంద్రరెడ్డి వైదొలిగే ప్రశ్నేలేదని జేడిఎస్‌ అగ్రనేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తేల్చి చెప్పారు. బెంగళూరు జేపీ నగర్‌లో తన మనవడి నామకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ చెప్పినట్లు ఆడేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు బొమ్మలు కారన్నారు. తమకు శాసనసభలో ప్రస్తుతం 32 మంది సభ్యులున్నారని, నాల్గొ రాజ్యసభ స్ధానం కోసం పోటీపడుతున్న అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కంటే తమ వద్దే అత్యధిక ఓట్లు ఉన్నాయన్నారు. బీజేపీ వద్ద 30 మిగులు ఓట్లు, కాంగ్రెస్‌ వద్ద 25 మిగులు ఓట్లు ఉన్న సంగతిని ఆయన గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్‌ అవగాహన కుదర్చుకున్నాయంటూ సోషల్‌ మీడియాలో వెలువడుతున్న కథనాలు పూర్తిగా నిరాధారమని కుమారస్వామి పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌లో ఒక భాగమన్నారు. ఈ విషయంలో రాజీ చర్చలు జరిపేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నాయకుడి పేరును బయటపెట్టాలని ఆయన సవాల్‌ విసిరారు. తామే తొలుత అభ్యర్థిని బరిలోకి దించామని, ఈ లెక్కన కాంగ్రెస్‌ రెండో అభ్యర్థిని బరిలోకి దించకుండా తమకు మద్దతు ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పుడు నాల్గో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ మైనార్టీ కార్డును తెరపైకి తెచ్చిందన్నారు. సీఎంగా ఉన్న సమయంలో మైనార్టీల ప్రయోజనాలు దెబ్బతినేలా సిద్ధరామయ్య వ్యవహరించారని, ఇక్బాల్‌ అన్సారీని మంత్రివర్గంలో తీసుకునేందుకు అంగీకరించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర జేడీఎస్‌ అధ్యక్షుడిగా ఉన్న సీఎం ఇబ్రహీం డమ్మీ కాదని, 2023 శాసనసభ ఎన్నికల్లో మైనార్టీలకు అత్యధిక టికెట్లు ఇస్తామని ఆయన ప్రకటించారు.

Updated Date - 2022-06-09T17:56:20+05:30 IST