బొమ్మై బడ్జెట్‌పై సిద్దూ ఏమన్నారో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-03-08T17:57:21+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శాసనసభకు సమర్పించిన 2022-23 వార్షిక బడ్జెట్‌ దిశానిర్దేశం లేకుండా సాగిందని, ఇదొక నిరాశాదాయక బడ్జెట్‌ అని ప్రతిపక్షనేత సిద్దరామయ్య ఆరోపించారు. శాసనసభ లో

బొమ్మై బడ్జెట్‌పై సిద్దూ ఏమన్నారో తెలిస్తే...

బెంగళూరు: ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై శాసనసభకు సమర్పించిన 2022-23 వార్షిక బడ్జెట్‌ దిశానిర్దేశం లేకుండా సాగిందని, ఇదొక నిరాశాదాయక బడ్జెట్‌ అని ప్రతిపక్షనేత సిద్దరామయ్య ఆరోపించారు. శాసనసభలో సోమవారం బడ్జెట్‌పై ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అంటూ పదే పదే డాంబికాలు చెప్పుకుంటున్నారని చురకలంటించారు. బీజేపీ నేతలు చెప్పే ప్రగల్బాలకు, బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు పొంతన లేదన్నారు. ఈ బడ్జెట్‌ మొత్తానికి అప్పు చేసి పప్పుకూడు చందాన ఉందన్నారు. ఈనెల చివరినాటికి మూడు ఆర్థిక సంవత్సరాలు ముగుస్తాయి. ప్రస్తుతం నాల్గవ ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. 2023 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుతాయో ఇట్టే ఊహించుకోవచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై ఆర్‌ఎస్ఎస్‌ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు సాధించిన ప్రగతి, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఇత్యాది అంశాలపై శ్వేతపత్రం ప్రకటిస్తే బాగుండేదన్నారు. తాను ముఖ్యమంత్రి హోదాలో ఆరుసార్లు, ఆర్థికశాఖ మంత్రి హోదాలో 13సార్లు బడ్జెట్‌ ను సమర్పించానని, చెప్పినవన్నీ అమలులోకి తెచ్చి చూపామని సిద్దరామయ్య పేర్కొన్నారు. బడ్జెట్‌ గాత్ర రూ.2.65 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో రూ.14,699 కోట్ల రెవెన్యూ కొరత ఉందని దీన్ని ఎలా సమీకరించుకుంటారో ప్రభుత్వం స్పష్టం చేయలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం బ డ్జెట్‌ తనకు కావాల్సిన వారికి మిఠాయిలు పంచుకున్న చందాన ఉందన్నారు. ఎన్నికల భయంతోనే పన్నుపోటు వేయలేదని వ్యంగ్యంగా అన్నారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య ప్రసంగిస్తున్న సమయంలో ముఖ్యమంత్రితో ఆసక్తికరమైన చర్చ జరిగింది. సోషలిస్టు భావాలు కలిగిన బొమ్మై వ్యక్తిగతంగా తనకు మంచి స్నేహితుడని, బీజేపీలో చేరి దారి తప్పాడని చురకలంటించారు. రాజకీయాలలో స్నేహం వేరు, సిద్ధాంతాలు వేరు అన్నారు. దీనికి సీఎం బొమ్మై స్పందిస్తూ బీజేపీలో సోషలిస్టు నేతలు చేరుతున్నారంటే ఎక్కడ విశాలమైన వాతావరణం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఆర్‌ఎస్ఎస్‌ను పదేపదే విమర్శించడం మంచిది కాదన్నారు. 

Updated Date - 2022-03-08T17:57:21+05:30 IST