మా పాలనపై విచారణకు సిద్ధం

ABN , First Publish Date - 2022-07-16T16:51:24+05:30 IST

కాంగ్రెస్‌ పాలనలో సాగిన అక్రమాలపై విచారణ జరిపించాలంటూ రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ ముఖ్యమంత్రి బొమ్మైకు లేఖ

మా పాలనపై విచారణకు సిద్ధం

                  - మంత్రి అశ్వత్థనారాయణ లేఖను స్వాగతిస్తాం: సిద్దరామయ్య


బెంగళూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పాలనలో సాగిన అక్రమాలపై విచారణ జరిపించాలంటూ రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి అశ్వత్థనారాయణ ముఖ్యమంత్రి బొమ్మైకు లేఖ రాయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రతిపక్షనేత సిద్దరామయ్య వెల్లడించారు. బాగల్కోటె జిల్లా బాదామి పర్యటనలో ఉన్న సిద్దరామయ్య శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో అక్రమాలపై విచారణ జరిపిస్తే స్వాగతిస్తానని పేర్కొన్నారు. అదే తరహాలోనే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల నియామకాల విషయంలోను విచారణ జరిపించాలని లేఖ రాయాలని అశ్వత్థనారాయణను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. మీ ప్రభుత్వంలో అవినీతిపై విచారణకు విధానసౌధను పూర్తిగా దర్యాప్తు సంస్థలకు విడిచిపెట్టాల్సి ఉంటుందని, మంత్రులు ఇతర పనులు లేకుండానే నిత్యం విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. అంతకంటే అందరూ రాజీనామాలు చేసి ఇళ్ళకు వెళ్ళడం మంచిదన్నారు. అవినీతి, అక్రమాలు మీ మెడకు చుట్టుకోవడంతో మా పాలన గురించి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. ఇలాంటి బ్లాక్‌మెయిల్‌ కుతంత్రాలతో మా నోళ్లు కట్టిపడేయాలనుకుంటే మీ భ్రమ మాత్రమే అంటూ ట్వీట్‌ చేశారు. 


సిద్దూ అవినీతి పితామహుడు: మంత్రి అశ్వత్థనారాయణ 

ప్రతిపక్షనేత సిద్దరామయ్య అవినీతి పితామహుడని, సబ్‌ఇన్‌స్పెక్టర్ల నియామకాల్లో అవినీతి ఆరంభమయ్యిందే సిద్దరామయ్య సీఎంగా ఉన్నప్పుడేనని మంత్రి అశ్వత్థనారాయణ ఆరోపించారు. శుక్రవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్య సీఎంగా ఉన్నప్పుడు విచారణలు ఏవిధంగా సాగాయనేది అందరికీ తెలిసిందే అన్నారు. ఆయన ఐదేళ్ల పాలనకు సంబంధించి అన్ని అక్రమాలపైనా సమగ్ర విచారణలు జరిపించాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తానన్నారు. అర్కావతి లే అవుట్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నియామకాలతో పాటు మరిన్ని ఉన్నాయన్నారు. సిద్దరామయ్య అవినీతి ఎంత లోతు, వెడల్పు ఉందనేది తెలుసని, సమగ్ర విచారణ జరిపించాలని లేఖలో కోరతానన్నారు. కాగా మంత్రి అశ్వత్థనారాయణ లేఖ రాసే ముందుగానే మీడియాకు వివరించిన మేరకు సిద్దరామయ్య ట్వీట్ల ద్వారా స్పందించారు.



Updated Date - 2022-07-16T16:51:24+05:30 IST