ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయను: Ex Cm

ABN , First Publish Date - 2022-07-19T17:44:58+05:30 IST

రానున్న శాసనసభ ఎన్నికల్లో మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ప్రతిపక్షనేత సిద్దరామయ్య

ఆ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయను: Ex Cm

- రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ సైద్ధాంతిక పోరులో భాగం 

- ప్రతిపక్ష నేత సిద్దరామయ్య 


బెంగళూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రానున్న శాసనసభ ఎన్నికల్లో మైసూరు జిల్లా చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన లేదని ప్రతిపక్షనేత సిద్దరామయ్య స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2023 శాసనసభ ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పార్టీ అధిష్టానం ఎవరి పేరును ఖరారు చేసినా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఈసారి జరిగే శాసనసభ ఎన్నికలే తనకు చిట్టచివరివని స్పష్టం చేసిన ఆయన అనంతరం రాజకీయాల నుంచి రిటైర్డ్‌ కావాలన్న ఆలోచన ఉందన్నారు. కోలారు, కొప్పళ, వరుణ, హు ణసూరు, చామరాజపేట నుంచి పోటీ చేయాల్సిందిగా కార్యకర్తలు పెద్దపెట్టున ఆహ్వానాలు పలుకుతున్నారని అయితే పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. 2028 అనంతరం ఎలాంటి పదవులు స్వీకరించబోనని సమాజసేవకే అంకితమవుతానని చెప్పారు. 


ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ సాధారణం

రాష్ట్రపతి ఎన్నికను రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరుగానే చూడాలని సిద్దరామయ్య అన్నారు. ఆదివాసీ గిరిజన మహిళను రాష్ట్రపతిగా వ్యతిరేకిస్తున్నామన్న వాదన సరికాదన్నారు. బీజేపీ ఇలాం టి నీచ రాజకీయాలకు దిగుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోటీ సర్వసాధారణమన్నారు. ఎన్నికల వరకే పోటీ, ఆపై రాష్ట్రపతిగా ఎవరు గెలిచినా గౌరవించడం భారత ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవులకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా అధికార పార్టీయే చొరవ తీసుకుని ఉండాల్సిందన్నారు. అయితే చిత్తశుద్ధితో కాకుండా మొక్కుబడిగా మాత్రమే ప్రయత్నాలు జరిగాయన్నారు. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముపై తమకు అపార గౌరవం ఉందన్నారు. 

Updated Date - 2022-07-19T17:44:58+05:30 IST