సొంత నియోజకవర్గంలో Ex Cmకు ఏం జరిగిందో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-07-16T16:23:33+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు సొంత నియోజకవర్గంలో పరాభవం ఎదురయింది. బాగల్కోటె జిల్లా సొంత నియోజకవర్గం బాదామి

సొంత నియోజకవర్గంలో Ex Cmకు ఏం జరిగిందో తెలిస్తే...

                     - ప్రతిపక్షనేత పరిహారాన్ని విసిరికొట్టిన మహిళ


బెంగళూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్దరామయ్యకు సొంత నియోజకవర్గంలో పరాభవం ఎదురయింది. బాగల్కోటె జిల్లా సొంత నియోజకవర్గం బాదామి పరిధిలోని కెరూరులో ఆయన ఊహించని సంఘటనతో ఖంగుతిన్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో జరిగిన గొడవల్లో గాయపడ్డ బాధిత కుటుంబానికి చెందిన రజ్మా అనే మహిళకు రూ. 2లక్షల నగదును సిద్దరామయ్య పరిహారంగా ఇచ్చారు. ఒక్కసారిగా ఆక్రోశానికి లోనైన ఆ మహిళ మీ పరిహారం మాకెందుకు అంటూ రూ. 2 లక్షల నగదును ఆయన కారు లోపలికే విసిరారు. దీంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, అధికారులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. తమకు నగదు పరిహారం వద్దని, శాంతి కావాలని ఆ మహిళ కోరారు. సదరు ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. సిద్దరామయ్య రెండు రోజుల నియోజకవర్గ పర్యటనకు శుక్రవారం బాదామికి వెళ్లారు. ఇటీవల కె రూరులో జరిగిన గొడవల్లో గాయపడ్డ వారిని పరామర్శించారు. ఇదే సమయంలోనే రజ్మాకు రూ.2 లక్షల నగదును పరిహారంగా ఉంచుకోవాలని కోరారు. గొడవల్లో గాయపడ్డ మహ్మద్‌, దావల్‌ మలీక్‌, రాజేసాబ్‌, రఫీక్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈనెల 6న కెరూరులో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ యువతిని వేధించారనే విషయమై తలెత్తిన వాగ్వాదం ఇరువర్గాల గొడవకు కారణమైంది. సంఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరువర్గాల గొడవల్లో పలువురి ఆస్తికి నష్టం కాగా వాహనాలు కాలిపోయాయి. నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన సిద్దరామయ్య కెరూరులో క్షతగాత్రులను పరామర్శించారు. నలుగురికి రూ.50 వేల చొప్పున రఫీక్‌ సోదరి రజ్మాకు రూ.2లక్షల నగదు ఇచ్చారు. కారులో సిద్దరామయ్య కాస్త ముందుకెళ్లగా పరుగెత్తిన ఆమె కారులోకి రూ.2లక్షల నగదు విసిరికొట్టారు. సిద్దరామయ్య ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. అనంతరం రజ్మా మీడియాతో మాట్లాడుతూ గొడవ జరిగిన పదిరోజుల తర్వాత పరామర్శించేందుకు ఎమ్మెల్యే రావడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. మేమంతా ఒకే తల్లిబిడ్డల్లా ఉన్నామన్నారు. ఒకరిద్దరి వల్ల గొడవలు వచ్చాయని అంతమాత్రాన బరితెగించడం సరికాదన్నారు. మా పిల్లలను చూసి వారం ముగిసిందని, నగదు ఇస్తే సరిపోతుందా..? అంటూ వ్యాఖ్యానించారు. గొడవ జరిగిన వెంటనే కారకులైనవారిపై చర్యలు తీసుకుని ఉంటే ఇంత వివాదం ఉండేది కాదన్నారు. సిద్దరామయ్య వెంట ఎమ్మెల్యే ఆనంద్‌ న్యామగౌడ, మాజీ మంత్రి హెచ్‌వై మేటి, మాజీ ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్‌ ఉన్నారు. 


మానవత్వంతో నగదు ఇచ్చా... 

కెరూరు గొడవల్లో గాయపడ్డ కుటుంబీకులకు మానవత్వంతో నగదు ఇచ్చానని సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. సంఘటన జరిగిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదాలు, గొడవలు జరిగినప్పుడు మానవత్వంతో నగదు ఇవ్వడం సాధారణమన్నారు. ప్రభుత్వం కూడా ఇదే విధానం పాటిస్తుందన్నారు. ఆమెకు నగదు ఇచ్చామని, ఆ తర్వాత ఎవరో రెచ్చగొట్టారన్నారు. దాడిలో గాయపడినవారు పేదలు ఉన్నారని, రెండు గ్రూపులకు చెందినవారిని పరామర్శించానన్నారు. 

Updated Date - 2022-07-16T16:23:33+05:30 IST