బీజేపీని ఎవరూ వీడరు..

Sep 21 2021 @ 12:44PM

- డీకే శివకుమార్‌వి వ్యర్థ ప్రయత్నాలే 

- మాజీ సీఎం యడియూరప్ప 


బెంగళూరు: రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ పా ర్టీని వీడబోరని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ వల వేస్తోందని అయితే ఎన్నటికీ ఈ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఈ వ్యర్థ ప్రయత్నాలు మానుకుంటే మంచిదన్నారు. ఆపరేషన్‌ కమలకు ధీటుగా బదులిచ్చేందుకు ఆపరేషన్‌ హస్త చేపట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. మంత్రి పదవి లభించక తీవ్ర ఆక్రోశంతో రగిలిపోతున్న బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామి సోమవారం ఒక ప్రకటన చేస్తూ పార్టీ నేతలపై తాను అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని అయితే పార్టీ వీడే ఆలోచన ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. కాంగ్రె్‌సలో చేరాల్సిందిగా తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కొందరు బీజేపీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నారంటూ దావణగెరెలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం చివరిరోజు ప్రత్యేకంగా ప్రస్తావన వచ్చింది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ కూడా ధ్రువీకరించారు. మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో రగిలిపోతున్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ టార్గెట్‌ చేస్తోందని అప్రమ్తతంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి పేరు బలంగా వినిపించింది. ఆయనే స్వయంగా సోమవారం ఈ వదంతులను ఖండించడం గమనార్హం. కాంగ్రెస్‌ మిత్రులు ఎడ్లబండ్లు, సైకిళ్లపై వస్తున్నారని వారికంటే ముందే తాము ద్విచక్రవాహనాలు, కార్లలో 150 మందికి పైగా ఎమ్మెల్యేలు 2023లో విధానసౌధకు చేరుకుని అధికార పగ్గాలు చేపడతామని మాజీ సీఎం యడియూరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.