రెండు నెలల్లో రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తా..

ABN , First Publish Date - 2022-07-05T17:20:55+05:30 IST

మరో రెండు నెలల్లో రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని మైసూరు జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయనేత, మాజీ మంత్రి జీటీ దేవేగౌడ వెల్లడించారు.

రెండు నెలల్లో రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తా..

బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): మరో రెండు నెలల్లో రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని మైసూరు జిల్లాకు చెందిన సీనియర్‌ రాజకీయనేత, మాజీ మంత్రి జీటీ దేవేగౌడ వెల్లడించారు. 2018 ఎన్నికల్లో ప్రస్తుత ప్రతిపక్ష నేత సిద్దరామయ్యపై జేడీఎస్‌ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. సంకీర్ణ ప్రభు త్వంలో ఉన్నతవిద్యాశాఖ మంత్రిగాను వ్యవహరించారు. తదనంతర రాజకీయ పరిణామాలతో జేడీఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జేడీఎస్‌ను వీడుతారనే ప్రచారం కూడా దాదాపు ఏడాదికాలంగా సాగుతోంది. మరికొన్ని నెలల్లోనే శాసనసభ ఎన్నికలు వస్తుండడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదే విషయమై ఆయన సోమవారం మైసూరులో మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు. వారి అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానన్నారు. ప్రస్తుతానికి జేడీఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్నానన్నారు. ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉండేలా ప్రజలు ఓటు వేశారన్నారు. వారి తీర్పుకు అనుగుణంగా పార్టీ విప్‌ జారీ చేసినా, లేకున్నా ఎటువంటి సం దర్భం లోనైనా జేడీఎస్‌ తరపున ఓటు వేస్తానన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే మద్దతు ఇస్తానన్నారు. ఆత్మసాక్షికి ద్రోహం చేయదలచు కోలేదన్నారు. గడిచిన మూడేళ్లుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉన్నానన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ పట్ల కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే రాజణ్ణ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెబితేనే సముచితమన్నారు. రాజణ్ణలాంటి నాయకులు ఇలా మాట్లాడడం సరికాదన్నారు. కన్నడిగులకు దేవేగౌడ పట్ల అపారమైన గౌరవం ఉందన్నారు. కన్నడిగుల మనసుకు బాధ కలిగించేలాంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటేనే మంచిదన్నారు. 

Updated Date - 2022-07-05T17:20:55+05:30 IST