High Court: మాజీ మంత్రి అవినీతి కేసు.. స్టే పొడిగించిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-09-10T13:11:23+05:30 IST

అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి వేలుమణికి వ్యతిరేకంగా టెండర్ల అవినీతి కేసులో, ఏసీబీ తుది నివేదిక దాఖలుపై విధించిన స్టే మద్రాసు

High Court: మాజీ మంత్రి అవినీతి కేసు.. స్టే పొడిగించిన హైకోర్టు

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 9: అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి వేలుమణికి వ్యతిరేకంగా టెండర్ల అవినీతి కేసులో, ఏసీబీ తుది నివేదిక దాఖలుపై విధించిన స్టే మద్రాసు హైకోర్టు(Madras High Court) పొడిగించింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో చెన్నై, కోవై కార్పొరేషన్లలో పలు పనులకు సంబంధించిన టెండర్లలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి వేలుమణి సహా పలువురిపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ వేలుమణి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ(The Chief Justice of the High Court is Munishwaranadh Bhandari) నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆ సమయంలో, క్రిమినల్‌ చట్టం కింద దాఖలైన ఈ కేసును ప్రత్యేక న్యాయమూర్తి విచారించాలని, వేలుమణికి మద్దతుగా కేంద్రప్రభుత్వ న్యాయవాది రాజా హాజరుకాకూడదని రాష్ట్రప్రభుత్వం తరఫున అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వాదన తోసిపుచ్చిన ధర్మాసనం, కేసు విచారణ కొనసాగించాలంటూ, వేలుమణి పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వుల విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో, తమ అభ్యంతరాలను నిరాకరించే ఉత్తర్వులను న్యాయస్థానం వ్యతిరేకించడంపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌ శుక్రవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వకుండా విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదావేసింది. ఈ నేపథ్యంలో, వేలుమణి  పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ, న్యాయమూర్తి మాలతో కూడిన ధర్మాసనం మధ్యాహ్నం విచారించింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వకపోవడంతో కేసు విచారణ కొనసాగించాలని వేలుమణి తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది రాజా వాదించారు. కానీ, రాష్ట్రప్రభుత్వం తరఫున హాజరైన ప్రధాన న్యాయవాది షణ్ముగసుందరం(Shanmugasundaram), సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న తరుణంలో ఈ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు విచారించడం సరికాదని, వాయిదావేయాలని కోరారు. దీంతో, ఈ కేసు విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదావేసిన ధర్మాసనం, వేలుమణికి వ్యతిరేకమైన కేసులో తుది నివేదిక దాఖలుకు ఇప్పటికే విధించిన స్టే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2022-09-10T13:11:23+05:30 IST