Ex Minister కామరాజ్‌పై ఏసీబీ పంజా

ABN , First Publish Date - 2022-07-09T12:50:39+05:30 IST

ఆదాయానికి మించి అక్రమార్జనకు పాల్పడ్డారనే నేరారోపణలపై అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్‌.కామరాజ్‌ నివాసగృహాలు, కార్యాలయాలు, ఆయన అనుచరులు,

Ex Minister కామరాజ్‌పై ఏసీబీ పంజా

- 49 చోట్ల తనిఖీలు 

- రూ.58.44 కోట్ల అక్రమార్జన కేసు


చెన్నై, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించి అక్రమార్జనకు పాల్పడ్డారనే నేరారోపణలపై అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్‌.కామరాజ్‌ నివాసగృహాలు, కార్యాలయాలు, ఆయన అనుచరులు, మద్దతుదారులకు చెందిన నివాసగృహాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీ జరిపారు. చెన్నై, తిరువారూరు, కోయంబత్తూరు, తిరుచ్చి, తంజావూరు, తిరువారూ జిల్లాల్లో కామరాజ్‌ అనుచరులు, బంధువులకు చెందిన నివాసగృహాలు, కార్యాలయాలు సహా 49 చోట్ల ఈ తనిఖీలు జరిగాయి. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కామరాజ్‌ ఆహారశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నన్నిలం శాసనసభ్యుడిగా, అన్నాడీఎంకే తిరువారూరు జిల్లా శాఖ కార్యదర్శిగా ఉన్నారు. తిరువారూరు జిల్లా మన్నార్‌గుడి ఉత్తరవీధిలోని కామరాజ్‌ నివాసగృహంలో శుక్రవారం వేకువజామున ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో కామరాజ్‌ ఇంట్లో లేరు. ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయని తెలుసుకున్న కామరాజ్‌ తరఫు న్యాయవాదులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఆ చోట గుమికూడారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి కామరాజ్‌, ఆయన పెద్దకుమారుడు ఇనియన్‌, చిన్న కుమారుడు ఇన్బన్‌, బంధువు, న్యాయవాది ఉదయకుమార్‌, మన్నార్‌గుడికి చెందిన కృష్ణమూర్తి, తిరుత్తురైపూండికి చెందిన చంద్రశేఖరన్‌ సహా ఆరుగురిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. కామరాజ్‌ మంత్రిగా ఉంటూ 2015 నుంచి 2021 వరకు అక్రమార్జనలకు పాల్పడ్డారని, ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని, ఆయన పేరుతో బంధువులు, అనుచరుల పేరుతో రూ.58.44 కోట్ల మేరకు చర, స్థిరాస్తులు కొనుగోలు చేశారని తిరువారూరు జిల్లా ఏసీబీ అధికారులు గురువారం కేసులు నమోదు చేశారు. ఆ కేసుల విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు కామరాజ్‌, బంధువులు, మద్దతుదారుల నివాసగృహాలు, కార్యాలయాలు, సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా కీలకమైన దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


చెన్నైలో ఆరుచోట్ల...

 చెన్నైలో ఆరు చోట్ల కామరాజ్‌ అనుచరుల నివాసగృహాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. మైలాపూరు - రాయపేట రహదారిలోని జీపీఏ కట్టడ నిర్మాణ సంస్థలో,  పోయె్‌సగార్డెన్‌ ప్రాంతం జయా టీవీ కార్యాలయం సమీపంలోని పీఎస్కే కట్టడ నిర్మాణ సంస్థ యజమాని అరుణ్‌కుమార్‌ నివాసగృహంలో, స్థానిక నీలాంగరై సరస్వతినగర్‌ పాండియన్‌ రోడ్డులోని ఆర్కే ఇండస్ట్రీస్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలోనూ సోదాలు జరిగాయి. ఇదే విధంగా అన్నానగర్‌ వెస్ట్‌ హెచ్‌ బ్లాక్‌లోని ఎనర్జీ సొల్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ దేశబంధు ఇల్లమ్‌లో, పనయూరు మాడ్రన్‌ బిల్డర్స్‌ లేఅవుట్‌లోని ముత్తులక్ష్మి నివాసగృహంలో తనిఖీలు జరిగాయి. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నాడీఎంకే మాజీమంత్రులపై అక్రమార్జన కేసులు నమోదు చేసి ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రులు ఎంఆర్‌ విజయభాస్కర్‌, కేసీ వీరమణి, సి. విజయభాస్కర్‌, వేలుమణి, తంగమణి, కేపీ అన్బళగన్‌ అక్రమార్జనల కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి కామరాజ్‌ రూ.58.44 కోట్ల మేరకు అక్రమార్జనకు పాల్పడ్డారంటూ కేసులు నమోదు చేసి ఏసీబీ తనిఖీలు నిర్వహించటం తీవ్ర కలకలం రేపింది.


ఎడప్పాడి ఖండన...

డీఎంకే ప్రభుత్వం అన్నాడీఎంకేని రాజకీయపరంగా ఎదుర్కొనే సత్తాలేకనే మాజీ మంత్రులపై ఏసీబీ చేత తప్పుడు కేసులు నమోదు చేయించి తనిఖీలు జరుపుతోందని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి కామరాజ్‌, మద్దతుదారుల నివాసగృహాల్లో తనిఖీలు చేయించడం డీఎంకే రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్‌ పేజీలో ఓ సందేశం పోస్ట్‌ చేశారు.


ఒకేసారి వచ్చిన ఏసీబీ, ఐటీ అధికారులు

స్థానిక మైలాపూర్‌లోని కామరాజ్‌ సన్నిహితుడైన ఆడిటర్‌ సెయ్యాదురై నివాసానికి శుక్రవారం ఒకేసారి ఏసీబీ అధికారులు, ఐటీ అధికారులు రావడం ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ఆ తరువాత అసలు విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సెయ్యాదురై కామరాజ్‌సంస్థలకు, ప్రభుత్వ కాంట్రాక్టు సంస్థలకు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కామరాజ్‌కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు తనిఖీల కోసం రాగా, ఐటీ అధికారులు మాత్రం ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన రికార్డుల కోసం వచ్చారు. ఇరువర్గాలు యాదృచ్చికంగా ఒకేసారి వచ్చినప్పటికీ కామరాజ్‌ బృందంలో మాత్రం కొద్దిసేపు ముచ్చెమటలు పోయించింది.

Updated Date - 2022-07-09T12:50:39+05:30 IST