లోకేష్ పర్యటనకు మాజీ మంత్రి దూరం.. అసంతృప్తి!

ABN , First Publish Date - 2020-10-26T20:13:41+05:30 IST

లోకేష్ పర్యటనకు కొంత మంది కీలక నేతలు, మాజీ మంత్రులు, దూరంగా ఉంటూ వస్తున్నారు.

లోకేష్ పర్యటనకు మాజీ మంత్రి దూరం.. అసంతృప్తి!

ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో గత పదిరోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. ఈ భారీ వర్షాలకు ఏపీలోని లోతట్టు ప్రాంతంలో నివాసముండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పంటపొలాలు నీట మునిగి రైతన్నలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ తరుణంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, పంటలు మునిగిన రైతన్నలను పరామర్శించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. అదే విధంగా వరద బాధితులను బాధలను అడిగి తెలుసుకున్నారు. అయితే.. లోకేష్ పర్యటనకు కొంత మంది కీలక నేతలు, మాజీ మంత్రులు, దూరంగా ఉంటూ వస్తున్నారు. తమకు టీడీపీలో తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


అసంతృప్తే కారణమా..!?

సోమవారం నాడు.. పశ్చిమ గోదావరి జిల్లాలో లోకేష్ పర్యటించారు. ఆకివీడు‌ జడ్‌పీ హై స్కూలులో వరద బాధితుల సహాయ పునరావాస కేంద్రాన్ని లోకేష్ సందర్శించి.. బాధితులను పరామర్శించారు. అయితే.. ఈ పర్యటనకు ఆయన వెంట పలువురు నేతలు రాగా.. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, మహిళా నేత పీతల సుజాత గైర్హాజరయ్యారు. గత కొంతకాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకే ఇవాళ లోకేష్ జిల్లాకు వచ్చినా ఆమె పర్యటనకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. ఇందుకు కారణం.. పార్టీలో తనకు కీలక పదవి ఇవ్వలేదనే అసంతృప్తేనని తెలియవచ్చింది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన కమిటీలను అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. జిల్లాల వారీగా కాకుండా 25 పార్లమెంటు సెగ్మెంట్లకు 25 మంది అధ్యక్షులను ప్రకటించింది. అయితే ఈ కమిటీల్లో పీతల సుజాతకు చోటు దక్కలేదు.


ఎన్నికల నాటి నుంచి..!?

కాగా.. 2014 ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుంచి 15,164 మెజార్టీతో గెలిచిన పీతల సుజాత.. బాబు కెబినెట్‌లో చోటు సంపాదించుకుంది. ఆమెకు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం సుజాతకు టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. పీతలకు బదులుగా కర్రా రాజారావుకు ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ అభ్యరథి రాజారావుపై వైసీపీ తరఫున పోటీ చేసిన వీఆర్ ఎలీజా 36,175 మెజార్టీతో గెలుపొందారు. టికెట్ దక్కకపోవడం.. ఇప్పుడు కనీసం పార్టీలో ఎలాంటి పదవులు రాకపోవడంతో పీతల సుజాత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. టీడీపీ అధిష్టానం తనను పట్టించుకోవట్లేదని అసంతృప్తితో ఉన్న సుజాత పార్టీ మారతారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ మొత్తం వ్యవహారంపై పీతల మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చుకుంటారో లేకుంటే మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-10-26T20:13:41+05:30 IST