Ex ministerకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2022-05-21T13:15:19+05:30 IST

గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో టెండర్ల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై తనపై జరుగున్న విచారణ నిలుపుదల చేస్తూ స్టే విధించాలని కోరుతూ మాజీ మంత్రి

Ex ministerకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

                        - విచారణపై ‘స్టే’కు నిరాకరణ

 

అడయార్‌(చెన్నై): గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో టెండర్ల కేటాయింపుల్లో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై తనపై జరుగున్న విచారణ నిలుపుదల చేస్తూ స్టే విధించాలని కోరుతూ మాజీ మంత్రి వేలుమణి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. గత ప్రభుత్వంలో స్థానిక పరిపాలనా శాఖామంత్రిగా వ్యవహరించిన ఎస్‌.పి.వేలుమణి చెన్నై, కోవై నగర పాలక సంస్థల్లో పలు అభివృద్ధి పనులకు టెండర్ల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి  తన బినామీలకు కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. వీటిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో డీఎంకే ఎంపీ ఆర్‌.ఎస్. భారతి సహా మరికొంత మంది పిటిషన్లు వేశారు. వీటన్నింటినీ విచారణకు స్వీకరించిన కోర్టు... టెండర్ల కేటాయింపు వ్యవహారంలో ఎస్‌.పి.వేలుమణిపై వచ్చిన ఆరోపణలపై కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టి, విచారణను త్వరితగతిన పూర్తి చేసి పదిరోజుల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. హై కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి వేలుమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేలుమణిపై విచారణ ఊపందుకుంది. గత ఆగస్టులో మాజీ మంత్రిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసిన వేలుమణి కాగ్‌ నివేదికను సాకుగా చూపి ప్రాథమి క విచారణ నివేదిక కాపీని తన కు ఇవ్వడం లేదని, అందువల్ల ప్రాథమిక విచారణ నివేదిక కాపీ ఇచ్చేలా ఏసీబీని ఆదేశించాలని కోరారు. చెన్నై కార్పొరేషన్‌లో రోడ్ల అభివృద్ధి పనుల కోసం  రూ.114 కోట్లకు టెండర్లను ఆహ్వానించడంతో ప్రభు త్వానికి దాదాపు రూ.29 కోట్ల మేర నష్టం వాటిల్లింద ని, అందువల్ల ఈ కేసులో మాజీ మంత్రికి ఎలాంటి వెసులుబాటును కల్పించరాదని ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ వాదించారు. అదేవిధంగా 2014-19 మధ్యకాలంలో కోయంబత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, చెత్త సేకరణ పనులకు కేటాయించిన టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.25 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, 2016 నుంచి 2020 మధ్య కాలంలో వేలుమణి ఆదాయానికి మించి రూ.58 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడ్డారని కూడా ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మాజీ మంత్రిపై కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వ న్యాయ వాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ఆలకించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ నాయకత్వంలోని ప్రథమ ధర్మాసనం ఈ విచారణపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. అదేసమయంలో ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు నివేదికను వేలుమణికి ఏసీబీ అధికారులు అందజేయాలని, ఈ కేసు విచారణ మద్రాసు హైకోర్టు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది.

Updated Date - 2022-05-21T13:15:19+05:30 IST