విశాఖ ఉక్కును కాపాడుకుందాం!

ABN , First Publish Date - 2021-03-06T06:35:26+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి అవినీతికి విశాఖ ఉక్కు కూడా బలైపోతుందని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమైన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

విశాఖ ఉక్కును కాపాడుకుందాం!

మాజీ మంత్రి దేవినేని ఉమా

నందిగామ, మార్చి 5: సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి అవినీతికి విశాఖ ఉక్కు కూడా బలైపోతుందని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమైన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రాష్ట్ర బంద్‌లో భాగంగా నందిగామ వచ్చిన ఆయన మాట్లాడుతూ సీఎం అయిన వెంటనే పోస్కో ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు పరిశ్రమను దోచుకొనేందుకు సిద్ధపడ్డాడన్నారు. రూ.2లక్షల కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్‌ ఆస్తులపై జగన్‌ కన్నేశాడని ఆరోపించారు. ఒకవైపు పోస్కోతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ప్రజలను తప్పు దారి పట్టించేందుకు ఉద్యమంలో కలుస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారన్నా రు. 92మంది ఆత్మబలిదానాలతో ఏర్పాటైన స్టీల్‌ ప్లాంట్‌ కేవలం జగన్‌ ధనదాహానికి బలైపోతుందన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందే తెలుసని ప్రకటించారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన 7వేల ఎకరాలు అమ్మకానికి పెడతామంటూ ముఖ్యమంత్రి మాట్లాడడం హేయమన్నారు. రైతులు, ప్రజలిచ్చిన భూములమ్మే హక్కు జగన్‌కు ఎక్కడిదన్నారు. ఒక్క అవకాశం అంటూ రాష్ట్రాన్ని కబళించి వేస్తున్నారన్నారు. ప్రజలంతా సంఘటితమై రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. చంద్రబాబు చొరవతో అప్పటి ప్రధాని వాజ్‌పేయి విశాఖ ఉక్కుకు సహకారం అందించారన్నారు. పట్టణంలో నిర్వహించిన స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య బంద్‌కు సంఘీభావం తెలిపారు. వామపక్ష పార్టీలు ఉదయం నుంచి పట్టణంలో ర్యాలీలు నిర్వహించాయి. బంద్‌కు సహకరించాలని వ్యాపార, విద్యాసంస్థలను వారు కోరారు. 

Updated Date - 2021-03-06T06:35:26+05:30 IST