Ex Minister వేలుమణికి హైకోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2022-07-02T13:43:58+05:30 IST

అవినీతి నిరోధక శాఖ కేసు విచారణకు స్టే విధించాలని కోరుతూ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి దాఖలుచేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది.

Ex Minister వేలుమణికి హైకోర్టులో చుక్కెదురు

ప్యారీస్‌(చెన్నై), జూలై 1: అవినీతి నిరోధక శాఖ కేసు విచారణకు స్టే విధించాలని కోరుతూ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి దాఖలుచేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. అన్నాడీఎంకే పాలనలో చెన్నై, కోయంబత్తూర్‌ కార్పొరేషన్‌లలో పలు పనులకు సంబంధించిన టెండర్ల ప్రకియ్రలో అవినీతి జరిగిందని, ఈ వ్యవహారంలో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణిపై కేసు నమోదుచేయాలని కోరుతూ అర్పోర్‌ ఇయక్కం, డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి తరఫున మద్రాసు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ ప్రకారం, అవినీతి నిరోధక శాఖ ఎస్పీ వేలుమణిపై కేసు నమోదుచేసింది. అలాగే, ఆదాయానికి మించి అధికంగా రూ.58 కోట్ల ఆస్తులు కూడబెట్టారంటూ మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల విచారణకు తాత్కాలిక స్టే విధించాలని, కేసులు రద్దుచేయాలని వేలుమణి దాఖలుచేసిన పిటిషన్లు విచారణకు అనువైనదా అని నిర్ణయించేందుకు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాధ్‌ భండారీ, న్యాయమూర్తి ఎన్‌.మాలలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. వేలుమణి తరఫున కేంద్ర ప్రభుత్వ అడిషినల్‌ సొలిటరీ జనరల్‌ ఎస్వీ రాజా హాజరయ్యారు. ఈ కేసు విచారణకు అనువైనదా అనే విషయమై ఈ నెల 18వ తేదీలోపు బదులు పిటిషన్‌ దాఖలుచేయాలని అర్పోర్‌ ఇయక్కం, అవినీతి నిరోధక శాఖకు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటివరకు కేసు విచారణకు స్టే విధించాలని వేలుమణి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

Updated Date - 2022-07-02T13:43:58+05:30 IST