ACB attacks: మాజీ ఎమ్మెల్యేపై ఏసీబీ పంజా

ABN , First Publish Date - 2022-08-13T13:02:46+05:30 IST

అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే కేపీపీ భాస్కర్‌(Former MLA KPP Bhaskar) ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారనే ఆరోపణలపై చేపట్టిన

ACB attacks: మాజీ ఎమ్మెల్యేపై ఏసీబీ పంజా

                       - కేపీపీ భాస్కర్‌, ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు


చెన్నై, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే  కేపీపీ భాస్కర్‌(Former MLA KPP Bhaskar) ఆదాయానికి మించి అక్రమాస్తులు సంపాదించారనే ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆయన నివాసగృహాలు, బంధువులు, కుటుంబీకుల నివాసగృహాల్లో అవినీతి నిరోధక విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కేపీపీ భాస్కర్‌ నామక్కల్‌ నియోజకవర్గం నుంచి 2011, 2016 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గత శాసనసభ ఎన్నికల్లో మూడోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నామక్కల్‌ సంతపేట పుదూరు కొండిశెట్టి పేటరోడ్‌ సబ్‌లేన్‌ ప్రాంతంలో ఆయన భార్య ఉమ, కుటుంబీకులతో కలిసి నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ నగరశాఖ కార్యదర్శిగా ఉన్నారు. రెండుసార్లు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు భాస్కర్‌ ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపణలు రావటంతో నామక్కల్‌ జిల్లా ఏసీబీ అధికారులు కేసు దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో భాస్కర్‌ తన పేరిట, భార్య ఉమ పేరిట, పలు సంస్థల పేరిట సుమారు రూ.4.72 కోట్ల మేరకు ఆస్తులు కూడబెట్టారని వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు భాస్కర్‌(Bhaskar) నివాసగృహం, బంధువులు, స్నేహితుల నివాసగృహాలు సహా 26 చోట్ల ఒకే సమయంలో తనిఖీలు జరిపారు. నామక్కల్‌, తిరుప్పూరు, మదురై జిల్లాల్లోని భాస్కర్‌ బంధువులు, స్నేహితుల నివాసగృహాలు, కార్యాలయాలు, కంపెనీల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇక నామక్కల్‌ కొండిశెట్టిపేట రోడ్డులో భాస్కర్‌ నివసిస్తున్న బంగళాలోనూ శుక్రవారం వేకువజాము 5.45 గంటల నుంచి తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఆ బంగళాలోని పూజగది, హాలు, వంటగది, వీఐపీల మీటింగ్‌ హాలు తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించి కీలకమైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఆ బంగళాలో ఉన్న విలువైన విలాస వస్తువుల వివరాలను కూడా సేకరించి వాటి విలువ గురించి భాస్కర్‌ వద్ద అడిగి తెలుసుకున్నారు. ఇదే రీతిలో భాస్కర్‌(Bhaskar) బంధువులు, స్నేహితుల నివాసగృహాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలకమైన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.



Updated Date - 2022-08-13T13:02:46+05:30 IST