కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2021-01-17T05:25:32+05:30 IST

బనగానపల్లె పట్టణ శివార్లలో వంకలు, వాగులను ఆక్రమించారని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కబ్జాదారులపై చర్యలు తీసుకోండి
నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ, టీడీపీ నాయకులు

  1. నేషనల్‌ హైవేపై మాజీ ఎమ్మెల్యే బీసీ నిరసన 
  2. ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
  3. భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు 
  4. బీసీతో పాటు 24 మందిపై కేసు


బనగానపల్లె , జనవరి 16: బనగానపల్లె పట్టణ శివార్లలో వంకలు, వాగులను ఆక్రమించారని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలు దేరి గుత్తి-గాజులపల్లె నేషనల్‌హైవేపై వంతెన, యనకండ్ల వాగు కబ్జా అయిన ప్రాంతంలో గంటకు పైగా బీసీ టీడీపీ శ్రేణులతో కలిసి బైఠాయించారు. దీంతో హైవేపై వాహనాలు గంటకు పైగా నిలిచిపోయాయి. బనగానపల్లె ఎస్‌ఐ మహేశ్‌కుమార్‌, పోలీస్‌ సిబ్బంది అక్కడి వచ్చారు. ధర్నాను విరమించాలని ఎస్‌ఐ బీసీని, టీడీపీ నాయకులను కోరారు. తహసీల్దారు వచ్చి తమకు ఆక్రమణలపై సమాధానం చెప్పే వరకు నిరసనను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత తహసీల్దార్‌ ఆల్‌ఫ్రెడ్‌ అక్కడికి రావడంతో బీసీ జనార్దన్‌రెడ్డి ఆయనతో మాట్లాడారు. పట్టణంలోని యనకండ్ల వాగు రాత్రికి రాత్రి అన్యాక్రాంతమైందని, అధికారులు ఏంచేస్తున్నారన్నారని ప్రశ్నించారు. యనకండ్ల వాగును కాపాడాలని తహసీల్దారును కోరారు. పూర్వస్థితికి తీసుకువస్తే తాను ధర్నాను విరమిస్తామని తెలిపారు. శివనందినగర్‌, బత్తులూరుపాడు, ఎస్సీకాలనీ, పంటపొలాలు మునిగి పోయే ప్రమాదం ఉందన్నారు. వీఆర్వోలకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ల్యాండ్‌ కన్వర్షన్‌లు లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తహసీల్దారును నిలదీశారు. కబ్జాకు గురైన యనకండ్ల వాగును, వంతెనను తహసీల్దారు పరిశీలించారు. వారం రోజుల్లో నేషనల్‌హైవే అధికారులతో, మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఆక్రమణలు తొలగిస్తామని తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో టీడీపీ శ్రీణులు ధర్నా విరమించారు. కబ్జా చేసిన స్థలాన్ని ఎక్స్‌కవేటర్‌తో తహసీల్దారు సమక్షంలో తొలగించారు. పూర్తి స్థాయిలో తొలగించాలని తహసీల్దారును మాజీ ఎమ్మెల్యే కోరారు. 


‘అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే’

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బనగానపల్లె పట్టణంలోను, నియోజకవర్గంలోను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులను బినామీలుగా చేసుకొని ఎమ్మెల్యే కాటసాని అక్రమంగా సంపాదించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీ, ధర్నా వద్ద ఆయన మాట్లాడారు. వంకలు, వాగులు, రహదారులు కనబడకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సర్వే నెంబరులో ఎకరా ఉంటే 2 ఎకరాలుగా రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. కేసులు పెట్టి భయభ్రాంతులను గురిచేస్తున్నారన్నారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేస్తున్నారని, అక్రమాల గురించి ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బీసీ ఆరోపించారు. నూకల సుబ్బయ్య, నూకల విజయకుమార్‌, ఆరోగ్య శాఖలో పనిచేసే నల్లగట్ల వెంకటేశ్వర్లు మరికొంత మంది ఎమ్మెల్యేకి బినామీగా ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారన్నారు. అనుమతులు లేకుండా లే ఔట్లు వేస్తున్నారన్నారు. అక్రమంగా వేసిన లే అవుట్లలో ప్లాట్టు కొంటే ప్రజలు నష్టపోతారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీడీపీ అఽధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అక్రమ లే అవుట్లపై విచారిస్తామన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఆ శాఖ అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలను అణచివేయాలని పోలీసు లను కోరారు. తాను జుర్రేరును అక్రమించుకున్నట్లు ఎమ్మెల్యే ఆరోపిస్తు న్నారని, జిల్లా మెజిస్ట్రేట్‌తో విచారణ చేయించుకోవాలని సవాల్‌ విసిరారు. కప్పెట నాగేశ్వరరెడ్డి, టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జాహిద్‌ హుస్సేన్‌, జిల్లెళ్ల రాజశేఖర్‌రెడ్డి, కైప రామ్మోహన్‌రెడ్డి, టంగుటూరు లక్ష్మీ కాంతరెడ్డి, భీముడు, మాజీ సర్పంచ్‌లు ఉమామహేశ్వరరావు, వెంకట సుబ్బా రెడ్డి, రామిరెడ్డి, బురానుద్దీన్‌, పాతపాడు మహేశ్వరరెడ్డి, వెంగన్న, వెంకట య్య, గడ్డం నాగేశ్వరరెడ్డి, బండి వెంకటరామిరెడ్డి, దస్తగిరి, సుదర్శన్‌రెడ్డి, కలాం, సలాం, భూషన్న, శ్రీనివాసులు, బాలరాజు, గౌండాబాబు  పాల్గొన్నా రు.


కేసు నమోదు

నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు మరో 24 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేశ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్నా చేసినందుకు 188, 341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మరికొందరిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-01-17T05:25:32+05:30 IST