బహిరంగ చర్చకు సిద్ధం

ABN , First Publish Date - 2021-12-06T05:54:40+05:30 IST

టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయు డుకి సవాల్‌ విసిరారు.

బహిరంగ చర్చకు సిద్ధం
మాట్లాడుతున్న శేషారావు

ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడుకు మాజీ ఎమ్మెల్యే శేషారావు సవాల్‌

నిడదవోలు, డిసెంబరు 5:  టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయు డుకి సవాల్‌ విసిరారు. నిడదవోలు పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో  మాట్లాడుతూ ఇటీవల ఉండ్రాజవరం మండలం దమ్మెన్నులో ప్రజలు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే బాగా పని చేశారని ఇప్పటి ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడిని నిలదీయడంతో ఆయన అవాకులు చవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. గోదావరి తీర ప్రాంతంలో అవినీతి జరిగిందని  ఆరోపిస్తున్నారని ఎక్కడ జరిగిందో చూపిస్తే పేదలకు ఆ సొమ్ము పంచేందుకు తాను సిద్ధమన్నారు. వరదలు, తుపాన్ల సమయంలో మీరు ఎప్పుడైనా పేద వారికి పట్టెడన్నం పెట్టారా అని ప్రశ్నించారు. అలా పెట్టినట్టు రుజువైతే  మీ కాళ్ళ మధ్య నుంచి దూరి వెళతానన్నారు. ఆర్వోబీ మంజూరు చేయించి టెండర్లు కూడా అంగీకరిస్తే రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో దానిని ఆపేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, కొండా నిర్మల, తిరుపతి సత్యనారాయణ, కారింకి నాగేశ్వరరావు, బుగ్గే శివ రామకృష్ణ శాస్ర్తి, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నాయకులు పాల్గొన్నారు.



అధోగతిలో రాష్ట్రం : ఆరిమిల్లి

అత్తిలి, డిసెంబరు 5: వైసీపీ అధికారంలోకి వచ్చాక  రాష్ట్రం అధోగతి  పాలై  ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు.  అత్తిలి  మండలం బల్లిపాడులో గౌరవ సభ నిర్వహించారు. రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి అప్పులు ఎక్కువయ్యారన్నారు. రైతు ప్రభుత్వం అని  చెప్పుకోవడం తప్ప రైతులను ఆదుకోవడం లేదన్నారు. రోడ్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందన్నారు.  అనాల ఆదినారాయణ, కేతా సత్యనారాయణ, కృష్ణకుమారి, గారపాటి బాబ్జి, ముత్యాల నాగేశ్వరరావు, తామరపు రమణమ్మ, కాకిలేటి సత్యవేణి, దూలం చిట్టిపాప, గోపిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-06T05:54:40+05:30 IST