బాగన్నకు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-02-28T05:26:28+05:30 IST

రెండేళ్లుగా అనారోగ్యంతో అలసిన జహీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చెంగల్‌ బాగన్న జీవన ప్రయాణానికి ఇక సెలవు ప్రకటించారు. పేదల పెన్నిదిగా.. ప్రజాసేవే పరమావధిగా సాగిన బాగన్న ప్రస్థానం ముగిసింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిన బాగన్న అంత్యక్రియలను శనివారం జహీరాబాద్‌ పట్టణంలో నిర్వహించారు.

బాగన్నకు కన్నీటి వీడ్కోలు
అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు తదితరులు

సందర్శనార్థం జహీరాబాద్‌ ఆర్‌అండ్‌బీ అథితి గృహానికి భౌతికకాయం తరలింపు

కడసారి చూసేందుకు తరలివచ్చిన ప్రజలు

అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు


జహీరాబాద్‌, ఫిబ్రవరి 27 : రెండేళ్లుగా అనారోగ్యంతో అలసిన జహీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే చెంగల్‌ బాగన్న జీవన ప్రయాణానికి ఇక సెలవు ప్రకటించారు. పేదల పెన్నిదిగా.. ప్రజాసేవే పరమావధిగా సాగిన బాగన్న ప్రస్థానం ముగిసింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిన బాగన్న అంత్యక్రియలను శనివారం జహీరాబాద్‌ పట్టణంలో నిర్వహించారు. అభిమానులు, నేతలు, కుటుంబీకులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం ఆయన పార్థీవదేహాన్ని రాంనగర్‌లోని కూతురు ఇంట్లో ఉంచి అక్కడి నుంచి ప్రజల సందర్శనార్థం 10 గంటలకు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అథితి గృహానికి తరలించారు. కడసారి చూపు కోసం బాగన్న అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జంగం గోపి ఆర్‌అండ్‌బీ అథితి గృహానికి చేరుకొని బాగన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపాటిల్‌ తదితరులు బాగన్న కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అథితి గృహం నుంచే అంతిమయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా అంతిమయాత్ర కొనసాగింది. ఈద్గా వెనుక భాగంలోని శ్మశానవాటికలో భౌతికకాయాన్ని ఖననం చేశారు. 


జహీరాబాద్‌లో బాగన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం : హరీశ్‌రావు

1994 నుంచి 99 వరకు జహీరాబాద్‌ ఎమ్మెల్యేగా కొనసాగిన చెంగల్‌ బాగన్న పేదల పక్షపాతని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా తనదైన ముద్రను వేసుకున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ బాగన్న నిరుపేదల హృదయాల్లో నిలిచిపోయారని, పేదలపెన్నిదిగా పేరొందారన్నారు. ఎమ్మెల్యేగా ఉండి సొంత ఇల్లు కూడా సంపాదించుకోకుండా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేశాడరని కొనియాడారు. ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని చెప్పారు. ఆయన సొంతింటి కలను టీఆర్‌ఎస్‌ పార్టీ నేరవేరస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. జహీరాబాద్‌ పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా బాగన్న ప్రజలకు చేసిన సేవలు వారి గుండెల్లో నిలిచిపొయాయన్నారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జంగం గోపి తదితరులు ఆయన సేవలను గుర్తుచేశారు. సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌పాటిల్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ విజయకుమార్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


బాగన్న మృతికి చంద్రబాబు సంతాపం

సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 27 : మాజీ ఎమ్మెల్యే చెంగల్‌ బాగన్న మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. బాగన్న మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని  చంద్రబాబుతో పాటు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, పొలిట్‌ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌ తెలిపారు.




Updated Date - 2021-02-28T05:26:28+05:30 IST