రైతులను నట్టేట ముంచిన పాలకులు

ABN , First Publish Date - 2022-01-20T05:29:32+05:30 IST

సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను నట్టేట ముంచిన పాలకులు
పాడైన ధాన్యాన్ని పరిశీలిస్తున్న ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

మొలకెత్తిన ధాన్యం చూసి ప్రభుత్వంపై ధూళిపాళ్ల ధ్వజం

పొన్నూరుటౌన్‌, జవనరి 19: సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని నండూరులో బుధవారం పర్యటించిన ఆయనకు రైతులు మొలకెత్తి పాడైన ధాన్యం చూపి కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల ఆవేదన చూసి చలించిన ఆయన ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. అకాల వర్షాలకు పంటలను కోల్పోయి రైతులు కన్నీటితో కాలం గడుపుతుంటే చోద్యం చూస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలు చేయించాల్సిన మంత్రి కాసినోలు నడుపుతూ పేదలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే  రైతు కన్నీరు ఎవ్వరికీ మంచిది కాదన్నారు. దెబ్బతిన్న ధాన్యంతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేయాలని లేకుంటే   రైతు తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Updated Date - 2022-01-20T05:29:32+05:30 IST