ధూళిపాళ్ల నరేంద్రకుమార్
ధూళిపాళ్ల డిమాండ్
గుంటూరు(సంగడిగుంట), పొన్నూరు టౌన్, మార్చి 27: జీడీసీసీ బ్యాంక్ సహకార సంఘాలలో జరిగిన అవినీతికి భాధ్యతగా త్రీమెన్ కమిటీలను తక్షణమే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అసలు దోషులను వదిలిపెట్టి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే అవినీతి మరకలు మాసిపోతాయా అని ప్రశ్నించారు. రాష్ట్ర హోంశాఖకు అనదికార మంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి.. అత్యంత ఆప్తుడైన వ్యక్తి ఒక్క ఫోన్ కాల్‌తో సరిపోయేదానికి అపాయింట్మెంట్ తీసుకుని మరీ ఎస్పీని కలవడంతో ఆంతర్యం ఏంటన్నారు. ఒక మంత్రి, ఒక డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ సభ్యుడు, 17 మంది ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్నప్పటికీ కేవలం ఒక ఎమ్మెల్సీ మాత్రమే సెంట్రల్ బ్యాంక్ సమీక్షలో పాల్గొనడంలో మర్మమేంటన్నారు. మాచర్ల, రెంటచింతల సొసైటీల్లో అక్రమాలపై, కాకుమాను సొసైటీలో నకిలీ ఆధార్‌కార్డులు, నకిలీ పాసుపుస్తకాలపై తగిన ఆధారాలు ఇచ్చామన్నారు. డ్వాక్రా గ్రూపుల రుణాల విషయంలో జరిగిన అక్రమాలపై 44 గ్రూపుల వివరాలను అందించామన్నారు. కాకుమాను సొసైటీ కార్యదర్శి ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కారుమూరి అశోక్‌రెడ్డి అనే వ్యక్తి సతీమణి సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోందన్నారు. సదరు అశోక్‌రెడ్డి పెద్దపరిమి, నెక్కల్లు, సొసైటీలలో రుణాలు ఇప్పించారని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ఆరోపించారన్నారు. అశోక్‌రెడ్డితో అప్పిరెడ్డికి బంధుత్వం ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 167 సొసైటీలలో జరిగిన విచారణ నివేదికలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని నరేంద్రకుమార్ డిమాండ్ చేశారు.