ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. ప్రభుత్వానికి పట్టదా?: మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు

ABN , First Publish Date - 2021-05-09T05:40:02+05:30 IST

ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. ప్రభుత్వానికి పట్టదా?: మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు

ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే..   ప్రభుత్వానికి పట్టదా?: మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు

తిరువూరు: ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని, పద్దెనిమిదేళ్లు నిండినవారికి వ్యాక్సిన్‌ అందించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లగట్ల స్వామిదాసు డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపొతుంటే, ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఆయన విమర్శించారు. శనివారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు పద్దెనిమిదేళ్లు నిండినవారికి వ్యాక్సిన్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ నాయకులు వారి ఇళ్లలోనే నిరసన తెలిపారు. వైరస్‌ సోకిన వారికి సరైన చికిత్స అందడం లేదని రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోందన్నారు. శవాలు గుట్టలుగా పడుతున్నాయని, శవాలపై పాలన సాగిస్తారా అని పాలకుల్ని స్వామిదాసు ప్రశ్నించారు. 

ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం విఫలం

రాష్ట్రంలో 55,719 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని, వైరస్‌ సోకి బెడ్లు దొరక్క వైద్యశాల మెట్లపైన, అంబులెన్సుల్లో ప్రాణాలు విడుస్తున్నారని, ప్రజారోగ్యం పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని స్వామిదాసు విమర్శించారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు అద్దటానికి మూడువేల కోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం ఐదు కోట్ల జనాభాకు 13 లక్షల వ్యాక్సిన్‌లే కొనుగోలు చేస్తోందన్నారు. ప్రజల్ని వైరస్‌ బారి నుంచి కాపాడాలని సూచించిన ప్రతిపక్షాలపై కేసులు బనాయించటం తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజారక్షణపై చిత్తశుద్ధిలేదన్నారు, ప్రభుత్వ సలహాదారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వకుండా, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 

Updated Date - 2021-05-09T05:40:02+05:30 IST