ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేసులా..?

ABN , First Publish Date - 2022-08-10T06:08:01+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, అదేమిటని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడతారా.. అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే కేసులా..?
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

మాజీ ఎమ్మెల్యే యరపతినేని 

పిడుగురాళ్ల, ఆగస్టు 9: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని, అదేమిటని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడతారా.. అంటూ గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం పిడుగురాళ్ల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత మూడేళ్లుగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పత్తి, మిరప పంటలు  తెగుళ్లతో నష్టపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవటం సిగ్గుచేటన్నారు.  టీడీపీ హయాంలో పత్తి, మిరప పంటలు నష్టపోయిన రైతులకు క్వింటాకు రూ.3వేలు అందించిన విషయాన్ని గుర్తుచే శారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఒక్కసారైనా పాడైన పంటల వివరాలను తెలుసుకున్నారా అని  ప్రశ్నించారు.  రైతు భరోసా కేంద్రాలు రైతులకు  ఉపయోగకరంగా లేవని అన్నారు. గడపగడపకు వెళ్తున్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు చుక్కెదురవుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు తెరచి నెలరోజులవుతున్నా20శాతం మంది విద్యార్థులకే యూనిఫాం అందిస్తే చదువు ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాల నిర్వాహకులు ప్రభుత్వానికి పాఠ్యపుస్తకాల కోసం డబ్బులు చెల్లించి నెలరోజులవుతున్నా వారికి ఎందుకు పుస్తకాలు అందించలేదని ప్రశ్నించారు. పిడుగురాళ్ల బస్టాండ్‌ వెనుక ఉన్న చెరువు కూడా ఆక్రమణకు గురవుతున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పట్టణంలో టీడీపీ సభ్యత్వాన్ని నమోదు చేస్తున్న కార్యకర్తలపై కమిషనర్‌ ఫిర్యాదులు చేయటమేమిటన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై చర్యలు తీసుకోవటానికి ముఖ్యమంత్రి ఎందుకు జాప్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ చంద్రబాబుతో మాట్లాడితే రాష్ట్రంలో వైసీపీ నేతలకు ఉలికిపాటు ఎందుకో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో షేక్‌ బాబావలి, తురక వీరాస్వామి, పణితి రవి, సయ్యద్‌ అమీర్‌ఆలి,జొన్నలగడ్డ శ్రీను, వడ్డవల్లి సాంబశివరావు, ఎల్‌వీఆర్‌, నెకరికంటి శివ, చల్లగుండ్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T06:08:01+05:30 IST