జేడీఎస్‌ను ఎవరూ నిర్వీర్యం చేయలేరు

Sep 28 2021 @ 10:51AM

                   - మాజీ ప్రధాని దేవేగౌడ


బెంగళూరు: జేడీఎస్‌ పార్టీని ఎవరూ నిర్వీర్యం చేయలేరని మాజీ ప్రధాని, జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవేగౌడ పేర్కొన్నారు. రామనగర్‌లోని బిడది ఫాం హౌస్‌లో జనతా పర్వ పేరిట నాలుగు రోజుల పార్టీ ప్రత్యేక కార్యక్రమాలకు సోమవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దేవేగౌడ మాట్లాడుతూ జేడీఎస్‌ను ముగించడం సిద్దరామయ్యతోనే కాదు ఎవరితోనే అసాధ్యమన్నారు. విమర్శలకు పరిమితి ఉండాలని, ఆయన రాజకీయంగా ఎదిగింది ఎక్కడనేది మరచిపోరాదన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి ఇంటికి ఏ పార్టీ వచ్చిందో... రాష్ట్రానికే కాదు దేశానికి తెలుసని సిద్దరామయ్యపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, కార్యకర్తలతో అన్ని బాధలను మింగామని, జేడీఎస్‌ను చూసి అపహాస్యం చేసిన వారికి 2023 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని సవాల్‌ విసిరారు. మాజీ సీఎం కుమారస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయ పార్టీల పాలనా విధానాలు, నాయకుల తీరుతో ప్రజలు విసుగు చెందారని, ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారన్నారు. ఈ తరుణంలో ప్రతి కార్యకర్త శక్తికి మించి పనిచేయాలని పిలుపునిచ్చారు. మిషన్‌ 123 లక్ష్యంతో ముందుకెళదామన్నారు. జేడీఎస్‌ పట్ల అనుచితంగా మాట్లాడేవారికి 30 సీట్ల పార్టీ అంటూ హేళన చేసేవారికి మరో ఏడాదిన్నరలో జరిగే ఎన్నికల ఫలితాలే సమాధానం కావాలన్నారు. అంతకుముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ పతాకాన్ని ఆవిష్కరించి చెట్టుకు నీరు పోయడం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌కే కుమారస్వామి, శాసనసభ్యులు, గత ఎన్నికల్లో ఓటమి చెందినవారు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దత్తా తన ప్రసంగంలో పార్టీ కొనసాగిన పరంపరను వివరించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.