రక్తపాతాన్ని ఆపండి : ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-03-09T02:12:20+05:30 IST

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీకి ఆ దేశ మాజీ అధ్యక్షుడు

రక్తపాతాన్ని ఆపండి : ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు

కీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీకి  ఆ దేశ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకొవిచ్ ఓ విజ్ఞప్తి చేశారు. యుద్ధం వల్ల జరుగుతున్న రక్తపాతాన్ని ఆపాలని కోరారు. ప్రెసిడెన్షియల్ కెపాసిటీలో తాను జెలెన్‌స్కీతో మాట్లాడాలనుకుంటున్నానని, మరీ ముఖ్యంగా కాస్త తండ్రి మాదిరిగా మాట్లాడాలనుకుంటున్నానని తెలిపారు. 


2014లో జరిగిన నిరసనల కారణంగా విక్టర్ పదవీచ్యుతుడయ్యారు. ప్రస్తుతం ఆయన రష్యాలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. రష్యన్ వార్తా సంస్థను ఉటంకిస్తూ ఉక్రెయిన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, జెలెన్‌స్కీకి విక్టర్ ఓ విజ్ఞప్తి చేశారు. తాను జెలెన్‌స్కీతో ప్రెసిడెన్షియల్ కెపాసిటీలో, కాస్త తండ్రి మాదిరిగా మాట్లాడాలని అనుకుంటున్నానని చెప్పారు. జెలెన్‌‌స్కీకి చాలా మంది సలహాదారులు ఉన్నారని, అయితే రక్తపాతాన్ని ఆపవలసిన బాధ్యత వ్యక్తిగతంగా ఆయనపైనే ఉందని తెలిపారు. శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవలసిన బాధ్యత ఆయనదేనని చెప్పారు. దీని కోసం ఉక్రెయిన్, రష్యా, డోన్‌బాస్ ఎదురు చూస్తున్నాయన్నారు. శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే జెలెన్‌స్కీకి ఉక్రెయిన్ ప్రజలు, పాశ్చాత్య దేశాల్లోని మిత్రులు కృతజ్ఞులుగా ఉంటారన్నారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఓలెక్సీ రెజ్నికోవ్ విడుదల చేసిన ప్రకటనలో, రష్యా యుద్ధం వల్ల దాదాపు 400 మంది సాధారణ ప్రజలు మరణించినట్లు, సుమారు 800 మంది గాయపడినట్లు తెలిపారు. ఇది ఓ అంచనా మాత్రమేనని, పూర్తి వివరాలు తెలియవలసి ఉందని చెప్పారు. రష్యా దళాల బాంబు దాడుల్లో సుమారు 200 పాఠశాలలు, 34 ఆసుపత్రులు, 1,500 నివాస భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలను విధిస్తున్నాయి. 

 


Updated Date - 2022-03-09T02:12:20+05:30 IST