దైవచింతనతోనే ఉన్నతి

Published: Fri, 17 Dec 2021 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దైవచింతనతోనే ఉన్నతి

మమతా మోహాలు జైలు సంకెళ్ళ కన్నా ఎక్కువ కఠినమైనవి. అవి మనసును బంధిస్తాయి. వివేకాన్ని పోగొట్టుకొనేవారు మోహం నుంచి బయటపడలేరు. ఈ లక్షణాలను వదిలినవారే స్వతంత్రులు. ఆ స్థితిని పొందాలంటే.... బుద్ధిని సర్వశక్తిమంతుడైన భగవంతుడితో జోడించాలి. 


పరచింతనను విడిచిపెట్టేవారే ఆత్మచింతనలో, దైవచింతనలో మనసును లగ్నం చేయగలరు. పరచింతనను... అంటే అనవసరమైన వాటి గురించి, వ్యర్థమైన వాటి గురించీ ఆలోచనను విడనాడాలి. అప్పుడే మనిషిని చింత నుంచి దూరం అవుతాడు. సంతోషం అనే ఆసననాన్ని అధిరోహిస్తాడు.  శ్రద్ధగా పరిశీలిస్తే... మనిషి కళ్ళను, చెవులను, హృదయాన్నీ, మనసును... ఇలా అన్నిటినీ రోగగ్రస్తం చేసే జాడ్యమే పరచింతన. దీనికి ఆత్మచింతనే ఔషధం. ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడనివన్నీ వ్యర్థ చింతనలే. గుర్రాన్ని కళ్ళెం లేకుండా వదిలేసినట్టు... ఆలోచనలను దేశదిమ్మరిగా చేయడం, మనసును చంచలమైన పక్షిలా ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగరనీయడం, ‘భవిష్యత్‌ భయం’ అనే భూతాన్ని చూస్తూ, గతాన్ని తవ్వుకోవడం... ఇవన్నీ వ్యర్థ చింతన తాలూకు వేర్వేరు రూపాలు. ఇవి మనసును అలసిపోయేలా చేస్తాయి. మనిషిని శక్తిహీనుణ్ణి చేస్తాయి. జీవితంలో అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తాయి. దీనికి బదులు లక్ష్యంపై దృష్టి పెట్టి, ఆలోచనలన్నీ దానిమీదే కేంద్రీకరిస్తే... అతని లక్షణాలన్నీ ఆ లక్ష్యానికి అనుకూలంగా మారుతాయి. పనికిరాని ఆలోచనలతో దారితప్పకుండా ఉండేవారే... దారి తప్పినవారికి మార్గం చూపించగలుగుతారు. తన సంకల్పాలను అమూల్యంగా భావించి, వాటిని పదిలపరచుకొన్న వ్యక్తి ఎంతో శక్తిమంతుడవుతాడు. అతని సత్సంకల్పాల వల్ల కార్యాలు సిద్ధిస్తాయి కాబట్టి... వ్యర్థ సంకల్పాలు చేయడు. అతని ఆలోచనలు, మాటలు వృథా కావు. అతని ప్రతి సంకల్పం... లక్ష్యాన్ని ఛేదించే బాణం అవుతుంది. మనుషుల పురోగతికి అవరోధమైన వ్యర్థచింతనలు రాకుండా దైవ చింతన తోడ్పడుతుంది. మానవుల ఉన్నతికి బాటలు వేస్తుంది.


 బ్రహ్మ కుమారీస్‌ 

7032410931


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.