నిండా నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2020-07-05T10:30:48+05:30 IST

స్పెషల్‌ డీఎస్సీ-2019 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.

నిండా నిర్లక్ష్యం!

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన గందరగోళం

కొవిడ్‌-19 జాగ్రత్తలు శూన్యం

46 మందికిగాను 44 మంది హాజరు

కుర్చీలు లేక ఇలా కింద కూర్చున్న డీఎస్సీ అభ్యర్థులు.. సర్టిఫికెట్లు పరిశీలిస్తున్న సిబ్బంది


అనంతపురం విద్య, జూలై 4: స్పెషల్‌ డీఎస్సీ-2019 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. వచ్చిందే 44 మంది అభ్యర్థులు. అయితే వారికీ సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. కరో నా భయపెడుతున్న వేళ అభ్యర్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. అందరినీ ఓకే గదిలోకి తోసేశారు. ఎలాంటి కొవిడ్‌-19 జాగ్రత్తలు పా టించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. శనివా రం స్పెషల్‌ డీఎస్సీ అభ్యర్థులకు నగరంలోని గిల్డ్‌ ఆఫ్‌ సర్వీసు స్కూల్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. 55 పోస్టులకు గాను 9 పోస్టులకు అభ్యర్థులు లేక 46 మందిని పిలిచారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన వెరిఫికేషన్‌మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రారంభించారు. 


ఒకే గదిలోకి కుక్కి..

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 44 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. అయితే వెరిఫికేషన్‌ కేంద్రంలో 10కి పైగా గదులు అందుబాటులో ఉన్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా అందరినీ ఓకే గదిలో కూర్చోబెట్టి చెక్‌ లిస్టులు అందించారు. అవసరమైన కుర్చీలు లేక కొందరు నేల పై కూర్చోవాల్సి వచ్చింది. ఒకరిద్దరు మహిళలు చంటి బిడ్డలతో హాజరయ్యారు. థర్మల్‌ స్కానింగ్‌ చేయకుండా, ఇతర కొవిడ్‌ ప్రొటొకాల్‌ పాటించకుండా అందరినీ ఓకే చోట కూర్చోబెట్టి వెరిఫికేషన్‌ నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది.


ఒకరి తిరస్కరణ 

వెరిఫికేషన్‌కు 44 మంది రాగా ఒక అభ్యర్థిని తిరస్కరించారు. డీఎడ్‌ కోర్సు పూర్తి చేయకుండా వెరిఫికేషన్‌కు రావడంతో గుర్తించిన అధికారులు  వెనక్కుపంపారు. అదేవిధంగా మరో 14 మంది అభ్యర్థులు స్టడీ, ఇతర సర్టిఫికెట్ల కాపీలు నఖలు సమర్పించకపోవడంతో సోమవారం మళ్లీ రమ్మని ఆదేశించారు. కాగా మరో ఇద్దరు అభ్యర్థుల సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ సందర్భంగా సమస్య తలెత్తింది. ఏడీ రవూఫ్‌, సూపరింటెండెంట్లు రంగస్వామి, జగదీష్‌, ఇతర అధికారులు సురేష్‌, అమర్‌ వెరిఫికేషన్‌ చేశారు.

Updated Date - 2020-07-05T10:30:48+05:30 IST