ఎత్తిపోతల పరిశీలన

ABN , First Publish Date - 2021-10-25T05:30:00+05:30 IST

జిల్లా పర్యటనకు వచ్చిన కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సభ్యులు సోమవారం మల్యాల వద్ద గల హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు.

ఎత్తిపోతల పరిశీలన
మల్యాల హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలిస్తున్న కృష్ణా నది బోర్డు బృందం

  1. ఇది సాధారణ పర్యటన
  2.  కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ స్పష్టం


నందికొట్కూరు రూరల్‌/జూపాడుబంగ్లా, అక్టోబరు 25: జిల్లా పర్యటనకు వచ్చిన కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సభ్యులు సోమవారం మల్యాల వద్ద గల హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కర్నూలు జలమండలి, హంద్రీనీవా ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో నందికొట్కూరు మండలంలోని మల్యాల వద్దకు కేఆర్‌ఎంబీ బృందంలోని చీఫ్‌ ఇంజనీర్‌ శివరాజన్‌, దివాకర్‌ రాయపూరి, రాజకుమార్‌ పిళ్లై వచ్చారు. ఇది సాధారణ పరిశీలన మాత్రమేనని, దీనికి ఎలాంటి ప్రాధాన్యం లేదని కేఆర్‌ఎంబీ బృందం తెలిపింది. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుకున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఎత్తిపోతల పంపింగ్‌ విధానాన్ని పరిశీలించారు. హంద్రీనీవా కాలువపై కొంత దూరం పర్యటించారు. నదీ జలాల మట్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముచ్చుమర్రి ఎత్తిపోతల వద్దకు వెళ్లారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం, అప్రోచ్‌ కాల్వ, ఎస్‌ఆర్‌ఎంసీ పొడవు, నీటి విడుదల సామర్థ్యం తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఈ మురళీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణానదిలో ఉమ్మడి నీటివాటా విషయంలో ఏడున్నర ఏళ్లుగా ఎలాంటి సమస్య రాలేదని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు నీటి వాటా విషయంలో కోర్డులకు వెళ్లడంతో కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవాలని కేంద్రం గెజిట్‌ విడుదల చేసిందని తెలిపారు. ఇందులో భాగంగానే ఏఏ ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ బృందం వచ్చిందని తెలిపారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వపై ఏర్పాటు చేసిన టెలిమెట్రి యంత్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంతర్రాష్ట్ర జలవనరుల సీఈ శ్రీనివాసరెడ్డి, హంద్రీనీవా ఎస్‌ఈ నాగరాజు, డీఈ రాజన్‌బాబు, ఈఈలు సుధాకర్‌రెడ్డి, రెడ్డిశేఖరెడ్డి, మనోహార్‌, ఏఈలు వేణుగోపాల్‌, మహీంద్రారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, డీఈ రమేష్‌ బాపూజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:30:00+05:30 IST