పదో తరగతి ఎఫ్‌ఏ-1 మార్కుల పరిశీలన

ABN , First Publish Date - 2021-04-23T04:30:46+05:30 IST

పదో తరగతి ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ మార్కుల పరిశీలన మూడు రోజులుగా కొనసాగుతోంది.

పదో తరగతి ఎఫ్‌ఏ-1 మార్కుల పరిశీలన
అయిజలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రికార్డులను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందం

- ప్రత్యేక బృందాల పర్యవేక్షణ

    అయిజ, ఏప్రిల్‌ 22 : పదో తరగతి ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ మార్కుల పరిశీలన మూడు రోజులుగా కొనసాగుతోంది. పదో తరగతి పరీక్షలు రద్దు కావటంతో అందరి చూపు ఫార్మెటివ్‌అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 మార్కులపై పడింది. ఈ మార్కుల ఆధారంగానే స్టూడెంట్లకు గ్రేడ్లు కేటాయించనుండడంతో ప్రాధాన్యం పెరిగింది. కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు మార్కులు వేస్తున్నట్లు విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఉన్నత స్థాయి విద్యాధికారులు విద్యార్థుల మాస్కులను పరిశీలిం చేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మండల విద్యాధికారుల పర్యవేక్షణలో సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడు, లాంగ్వేజీ ఉపాద్యాయుడు, మరో నాన్‌లాంగ్వేజీ సెబ్జెక్టు టీచర్‌ బృందంలో ఉంటారు. ఈ నేపథ్యంలో అయిజ మండలంలో మూడు బృందాలు ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల మార్కులను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఉత్తనూరు, యాపదిన్నె, అయిజ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తిమ్మారెడ్డి, శివశంకర్‌రెడ్డి, మల్లేశ్‌ ఆధ్వర్యంలో మార్కులను పరిశీలిస్తున్నారు. అయిజ మండల పరిధిలో 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 10 ప్రైవేట్‌ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు వేసిన మార్కులు సరైనవా, కావా అనే పరిశీలన సాగుతోంది. ఈ నెల 19న ప్రారంభమైన ఈ ప్రక్రియ 23న ముగుస్తుందని మండల విద్యాధికారి నర్సింహులు తెలిపారు.

Updated Date - 2021-04-23T04:30:46+05:30 IST