మాజీ జవానుకు Bangaloreలో స్థలమిచ్చారు... తీరా వెళ్ళి చూస్తే...

ABN , First Publish Date - 2021-11-11T00:52:24+05:30 IST

సొంతింటి కల నెరవేరుతుందని ఆశించిన బెంగళూరుకు చెందిన ఓ మాజీ జవానుకు..

మాజీ జవానుకు Bangaloreలో స్థలమిచ్చారు... తీరా వెళ్ళి చూస్తే...

బెంగళూరు: సొంతింటి కల నెరవేరుతుందని ఆశించిన బెంగళూరుకు చెందిన ఓ మాజీ జవానుకు భంగపాటు ఎదురైంది. దీంతో తన సమస్యను పరిష్కరించాలంటూ బెంగళూరు డవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ)కి ఆయన వరుస విన్నపాలు చేసుకుంటున్నారు. తుంకూరుకు చెందిన ఎంఎన్ కెంపన్న మిలటరీ పోలీస్ యూనిట్‌‌‌ మాజీ జవాను. ఆయనకు 2018 నవంబర్‌లో నాదప్రభు కెంపెగౌడ్ లేఅవుట్ (ఎన్‌పీకేఎల్)లో 30x40 చదరపుటడుగులు స్థలం కేటాయించారు. మాజీ సర్వీస్‌మెన్‌గా 10 శాతం కోటా ఉండటంతో తొలి ప్రయత్నంలోనే ఆయనకు స్థలం దక్కింది. స్థలం కోసం మొత్తం పేమెంట్ రూ.23,25,000 కూడా ఆయన చెల్లించారు. ఆ తర్వాత తనకు కేటాయించిన స్థలం చూడ్డానికి వెళ్లి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. స్థలం మధ్యలో పాడయిన ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. దీనిపై కెంపెన్న మీడియాతో మాట్లాడుతూ, ట్రాన్స్‌ఫార్మర్ తొలగించాలని బీడీఏ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌కు లేఖ రాశానని, త్వరలోనే ఆ పని చేస్తామని అధికారులు హామీ ఇచ్చి కూడా నెలరోజులు కూడా దాటిపోయిందని వాపోయారు.


''బాంకుల్లో ఉన్న సేవింగ్స్ అన్నీ ఖాళీ అయ్యాయి. పెద్దమొత్తంలో రుణం కూడా తీసుకున్నాను. ఆ మొత్తం స్థలం కోసం చెల్లించాను. స్థలమే ఇప్పుడు నాకున్న జీవనాధారం. ఇక్కడ సొంత ఇల్లు కట్టుకోవాలన్నదే నా కల. నిర్మాణ పని ఇప్పుడే మొదలుపెట్టాలనుకుంటున్నాను. కానీ, ట్రాన్స్‌ఫార్మర్ తొలగించకుండా నేను ఏమీ చేయలేను'' అని కెంపన్న తెలిపారు. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి లేఔట్‌లోని అద్దె ఇంట్లో భార్య, 11 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల కొడుకుతో నివాసం ఉంటున్నారు. కాగా, ఈ పరిణమంపై ఫ్రంట్ కన్వీనర్ డాక్టర్ పద్మా ప్రసాద్ మాట్లాడుతూ, బీడీఏకు కెంపన్న పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పాడైపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించడం లేదనీ, ఇక సామాన్య ప్రజానీకం గోడు వినేదెవరని ప్రశ్నించారు.

Updated Date - 2021-11-11T00:52:24+05:30 IST