చెరబట్టారు

ABN , First Publish Date - 2022-07-16T05:22:59+05:30 IST

చెరువుల్లో ఫుష్కలంగా నీరు నిండి వాటి ద్వారా ఆయకట్టు కింద భూములలో పంటలు పండి రైతుల బతుకులు బాగుపడతాయని పెద్దలు చెరువులు తవ్వించారు. ఆ చెరువులను నేడు బడాబాబులు ఆక్రమించి పంటలు సాగు చేసుకుంటూ దర్జాగా అనుభవిస్తున్నారు. అసలు ఇక్కడ చెరువు ఉందా అనేలా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో వర్షం నీరు చెరువుల్లో నిలవకపోవడంతో ఆయకట్టు కింద భూములన్నీ బీళ్లుగా పెట్టుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని, కబ్జాదారులపై చర్యలు తీసుకుని ఆయకట్టును కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు.

చెరబట్టారు
రామస్వామి చెరువులో సాగు చేసిన అరటి తోట

దర్జాగా మూడు చెరువులు కబ్జా  

రామస్వామి చెరువు కనిపించకుండా పంటల సాగు

కోడూరు పెద్దచెరువులో బోర్లు, విద్యుత్‌ కనెక్షన్లు   

చాకిరేవుకోన చెరువులో 80 ఎకరాల్లో పంటల సాగు

చెరువుల కట్టలను సైతం కనిపించకుండా చేసిన వైనం   

కబ్జాలకు నేతల అండదండలు


చెరువుల్లో ఫుష్కలంగా నీరు నిండి వాటి ద్వారా ఆయకట్టు కింద భూములలో పంటలు పండి రైతుల బతుకులు బాగుపడతాయని పెద్దలు చెరువులు తవ్వించారు. ఆ చెరువులను నేడు బడాబాబులు ఆక్రమించి పంటలు సాగు చేసుకుంటూ దర్జాగా అనుభవిస్తున్నారు. అసలు ఇక్కడ చెరువు ఉందా అనేలా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో వర్షం నీరు చెరువుల్లో నిలవకపోవడంతో ఆయకట్టు కింద భూములన్నీ బీళ్లుగా పెట్టుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఎకరాలకు ఎకరాలు కబ్జా చేస్తున్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని, కబ్జాదారులపై చర్యలు తీసుకుని ఆయకట్టును కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు.


రైల్వేకోడూరు, జూలై 15: నియోజకవర్గ కేంద్రంలోని మూడు చెరువులను కబ్జాదారులు ఆక్రమించుకుని దర్జాగా పంటలు సాగు చేస్తున్నారు. ఈ కబ్జాల వెనుక ఖద్దరు బాబులు ఉన్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. చెరువుల అలుగులు సైతం పగులగొట్టి ఆక్రమించుకుని వేసిన తోటలకు వెళ్లేందుకు రోడ్డు కూడా ఏర్పాటు చేసుకున్నారు. చెరువుల కట్టలు కనిపించకుండా చేస్తున్నారు. బోర్లు, విద్యుత్‌ కనెక్షన్లు తదితర వాటిని ఏర్పాటు చేశారు. కబ్జాలు జరుగుతున్నా ఇటు పాలకులు, అటు అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 


- రైల్వేకోడూరు మండలంలోని చాకిరేవుకోన చెరువు ఆయకట్టు 787.93 ఉండగా 80 శాతం చెరువును ఆక్రమించి దర్జాగా మామిడి తదితర పంటలు సాగు చేస్తున్నారు. అలుగును సైతం పగులగొట్టి దారి ఏర్పాటు చేశారు. బడా బాబులు బోర్లు వేసి విద్యుత్‌ కనెక్షన్లు సైతం ఏర్పాటు చేసుకున్నారు. చెరువు పక్కలోనే రైతుల పొలాలు ఉన్నాయి. చెరువు నిండినా చుక్క నీరు పారుదల కావడం లేదని రైతులు వాపోతున్నారు. పలుసార్లు రైతులు సంబంధిత శాఖల అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. చాకిరేవుకోన చెరువుకు చెక్‌డ్యాం కూడా నిర్మించి ఉన్నారు. ఈ చెరువు పనులకు పలుసార్లు రూ.కోట్లు ఖర్చు చేశారు. ఈ చెరువు కాంట్రాక్లర్లకు కల్పతరువుగా మారింది. వెలుగొండ అడవిని ఆనుకుని పంటలు సాగు చేస్తున్నారు. వాటికి చెరువులోని మట్టిని అక్రమంగా తరలిస్తుండంతో నీరు నిలువ ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. 


- మండలంలోని వీవీ కండ్రిక పంచాయతీలోని రామస్వామి చెరువు మొత్తం ఆయకట్టు 208.10 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 3 ఎకరాలు మాత్రమే మిగిలింది. అది కూడా కబ్జా చేసేందుకు ఇటీవల కొందరు ఎక్స్‌కవేటర్‌తో మొక్కలు తొలగించారు. దీంతో చెరువు కట్ట కూడా కనిపించకుండా పోయింది. చెరువులో మొత్తం బొప్పాయి, అరటి, మామిడి తోటలు వేసి సాగు చేస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్లు, బోర్లు వేసి ఉన్నారు. అలుగు అసలు ఎక్కడ ఉందో కూడా అంతుపట్టకుండా ఉంది. ఇక్కడ కొందరు నాయకుల అండతో బడాబాబులు దర్జాగా పంటలు సాగు చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఈ తంతు సాగుతోంది. 


- కోడూరు పెద్ద చెరువు ఆయకట్టు 206.01 ఎకరాలు ఉంది. ఇందులో బోర్లు వేసి దర్జాగా విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చుకుని 25 శాతం మేరకు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. అలుగు ఎక్కడ ఉందో కూడా అంతుపట్టడం లేదు. అధికారులు కూడా పరిశీలించినా కనిపెట్టలేని విధంగా మాయమైంది. జానెడు స్థలం కనిపిస్తే చాలు వెంటనే ఆక్రణదారులు ఆక్రమించేస్తున్నారు. కొన్నేళ్లుగా పంటలు సాగు చేసి బడాబాబులు లక్షలాది రూపాయలు పంటల ద్వారా సంపాదించుకున్నారు. 


చెరువుల ఆక్రమణలను తొలగించాలి..

చెరువుల ఆక్రమణలను తొలగించాలి. లేకపోతే భవిష్యత్తులో చెరువులు అనేవి ఉండవు. అధికారులు, పాలకులు తగు చర్యలు తీసుకుంటే చెరువులు బాగుపడతాయి. మూగ జీవాలను మేపుకునేందుకు కూడా చోటు లేకుండా ఆక్రమించి పంటలు సాగు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు.

- ఎం.సుబ్రహ్మణ్యం, వీవీ కండ్రిక, రైతు


స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టి చర్యలు తీసుకుంటాం..

స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టి ఆక్రమణలు తొలగిస్తాము. చెరువులన్నీ పరిశీలించి నోటీసు లు జారీ చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే బైండోవర్‌ కేసులు నమోదు చేస్తాము. మార్పు రాకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాము. రెండు నెలల్లో చెరువుల ఆక్రమణలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటాం.

- బి.రామమోహన్‌, తహసీల్దార్‌, రైల్వేకోడూరు


ఆక్రమణలు తొలగిస్తాం..

చెరువుల ఆక్రమణలు తొలగిస్తాము. ఇది వరకే పరిశీలించాము. చెరువులను ఆక్రమించరాదని చెప్పి ఉన్నాము. రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలతో కలిసి చెరు వులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాము.

- చంగల్రాయుడు, డీఈ, ఇరిగేషన్‌, రైల్వేకోడూరు

Updated Date - 2022-07-16T05:22:59+05:30 IST