కేసీఆర్‌కు తప్ప ఎవరికి అధికారమిచ్చినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే

ABN , First Publish Date - 2022-05-26T06:39:52+05:30 IST

తెలంగాణ ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అవ్వడం వల్లే ఇంత అభివృద్ధి చెందిదని, కాదని ఏ పార్టీ అధికారంలో వచ్చినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అయ్యేదని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌కు తప్ప ఎవరికి అధికారమిచ్చినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే

శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి 

నల్లగొండ, మే 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ అవ్వడం వల్లే ఇంత అభివృద్ధి చెందిదని, కాదని ఏ పార్టీ అధికారంలో వచ్చినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరే అయ్యేదని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయని, అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు కులాల మీద మాట్లాడుతున్నారని, వారికి అధికార యావ తప్ప వేరే పనిలేదన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల విద్యుత్‌తో లబ్దిపొందేది రెడ్లే అని, కేసీఆర్‌ నాయకత్వంలోనే రెడ్లకు న్యాయం జరుగుతోందన్నారు. కొన్ని దుష్టశక్తులు కులాల పేరు చెప్పి అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మరని అన్నారు. ఈనెల 26న ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారని, ఆయన గతంలో ఇచ్చిన హామీలు, తీర్చినవి, విభజన చట్టంలోని అంశాలను అమలు చేసేందుకు ఆయన ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే రాష్ట్రంపై కుట్రలు చేస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక వనరులను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని, దీని ద్వారా అస్థిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తోందన్నారు. రాష్ట్రానికి నిధులు రాకుండా కుట్రలు చేస్తోందని, తెలంగాణ పరువు పోయేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాబట్టే దేశానికి తెలంగాణ రోల్‌మోడల్‌గా మారిందన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పార్థసారథిరెడ్డి హెటిరో ఫార్మాతో దేశ విదేశాల్లో కంపెనీలు పెట్టి దేశాభివృద్ధికి పాటుపడ్డారని, ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడం హర్షనీయమన్నారు.

Updated Date - 2022-05-26T06:39:52+05:30 IST