సినిమా కష్టాలు మళ్లీ తప్పవా?

Apr 18 2021 @ 00:00AM

క్యాలెండర్‌ మారింది. అయినా కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్‌ తెలుగు సినిమాను వణికిస్తోంది. 


వారానికి ఏడెనిమిది సినిమాల రిలీజులు, వందల  కోట్ల రూపాయల వసూళ్లు,  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లో సైతం మళ్లీ తెలుగు సినిమాలకు మంచి కలెక్షన్లు... ఇలా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న తెలుగు చిత్రపరిశ్రమను కరోనా సెకెండ్‌ వేవ్‌ కలవరపెడుతోంది. గత ఏడాది కంటే వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ దెబ్బకు తట్టుకోలేక  ఇప్పటికే కొన్ని భారీ చిత్రాలు విడుదలలు వాయిదా పడ్డాయి. షూటింగ్స్‌ మీద కూడా దీని ప్రభావం పడే సూచనలు కనిపిస్తుండడంతో నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. లాక్‌డౌన్‌ సమయంలో పడిన కష్టాలను గుర్తు చేసుకుని బెంబేలెత్తుతున్నారు సినీ జనం. 

సీన్‌ మళ్లీ రివర్స్‌ అవుతుందా? 

తొమ్మిది నెలల పాటు తన ప్రభావాన్ని చూపించిన కరోనా గత ఏడాది సెప్టెంబర్‌ నెల తర్వాత తగ్గుముఖం పట్టింది. అప్పటిదాకా మూసేసిన థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. మొదట్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్‌ చేయడానికి అనుమతి ఇచ్చినా, జనం వస్తారా రారా అనే అనుమానం అందరిలో ఉండేది. అయితే దాన్ని పటాపంచలు చేస్తూ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. బాగున్న సినిమాను మళ్లీ మళ్లీ చూసి సూపర్‌ హిట్‌ చేశారు. ప్రేక్షకుల నుంచి ఇటువంటి స్పందనను నిర్మాతలు ఊహించలేదు.


వారికే కాదు పొరుగున ఉన్న రాష్ర్టాలకు కూడా ఈ విజయం స్పూర్తినిచ్చింది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న తరుణంలో  కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలవడం, అదీ తీవ్ర స్థాయిలో ఉండడంతో నిర్మాతల్లో ఆలోచన మళ్లీ మొదలైంది. కరోనా ఉదృతి ఇంత తీవ్రంగా  ఉండడంతో ప్రేక్షకులు థియేటర్లకు రారని, ముందు జాగ్రత్త చర్యగా కొందరు నిర్మాతలు తమ సినిమా విడుదలను వాయిదా వేసుకొన్నారు. నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, కంగనా రనౌత్‌ ‘తలైవి’, రానా ‘విరాటపర్వం’, నాని ‘టక్‌ జగదీష్‌’ చిత్రాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేష్‌ ‘నారప్ప’ బాలకృష్ణ ‘అఖండ’, రవితేజ ‘ఖిలాడి’, అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌’ లాంటి మరికొన్ని సినిమాలు విడుదల తేదీలను ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారం మే, జూన్‌ నెలల్లో అవి విడుదల కావాలి. 


అనుకున్న ప్రకారం అవి విడుదలవుతాయా, లేక వాయిదా బాటను అనుసరిస్తాయా అన్నది వేచి చూడాలి. 


నైట్‌ కర్ఫ్యూ విధిస్తారా?

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నైట్‌ కర్ఫ్యు విధించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా నైట్‌ కర్ఫ్యూ విధించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే జరిగితే సెకండ్‌ షో ఆటల మీద ప్రభావం పడుతుంది. అలాగే థియేటర్లలో  నూరుశాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం మళ్లీ 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించే అవకాశం  ఉందంటున్నారు. అదీ కాకుండా కరోనా విలయ తాండవం చేస్తుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు వెళ్లడానికి జంకుతున్నారు. ఇదంతా కలెక్షన్ల మీద ప్రభావం చూపుతుంది కనుక  అందుకే భారీ చిత్రాల నిర్మాతలు సినిమా విడుదలలు  వాయిదా వేసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు చక్క పడవచ్చనే ఆశ ఆ నిర్మాతల్లో కనిపిస్తోంది. 


క్యూ కడుతున్న చిన్న నిర్మాతలు

పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో తమ సినిమాలు విడుదల చేసుకోవడానికి చిన్న చిత్రాల నిర్మాతలు క్యూ కడుతున్నారు. పెద్ద సినిమాలతో పోటీ పడలేక, థియేటర్ల దొరకక చాలా మంది లో బడ్జెట్‌ నిర్మాతలు ఈ మధ్య కాలంలో ఓటీటీ  వైపు అడుగులు వేస్తున్నారు. వారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి.  ఇలాంటి సమయంలోనే తమ  చిత్రాలకు మంచి థియేటర్లు దొరుకుతాయనీ, ఈ  ఛాన్స్‌ మిస్‌ చేసుకోకూడదనీ చాలా మంది సినిమాలు విడుదల చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీ పెట్టినా తమ చిత్రాలకు వచ్చే ప్రమాదం ఏదీ లేదనీ, తమ సినిమాలకు యాభై శాతం వసూళ్లు వచ్చినా చాలనే ధీమా చిన్న   నిర్మాతల్లో కనిపిస్తోంది.
జోరుగా షూటింగ్స్‌

కరోనా ఉదృతి  ఎలా ఉన్నా షూటింగ్స్‌కు మాత్రం బ్రేక్‌ పడడం లేదు. విడుదల సంగతి తర్వాత చూసుకుందామని, అగ్ర హీరోలు, దర్శకులు ప్రస్తుతం చిత్రాల షూటింగ్స్‌ మీదే దృష్టి పెట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్‌ చేస్తున్నారు.


 వెంటాడుతున్న వైరస్‌...

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా విజృంభణ సినిమాల షూటింగ్‌పై ప్రభావం చూపుతోంది. దాదాపు ప్రతి రోజూ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. దీంతో క్రమంగా పలు తెలుగు చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. షూటింగ్‌లోనే కాదు సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలోనూ నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు నటీనటులకు కరోనా సోకింది.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.