రుణమాఫీపై రైతుల్లో హర్షం

ABN , First Publish Date - 2021-08-03T06:21:15+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా రెండవ విడత రుణ మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి రైతుల్లో సంతోషాన్ని కలిగిస్తున్నది.

రుణమాఫీపై రైతుల్లో హర్షం

- రెండవ విడతలో 50వేల రూపాయల మాఫీ

- ఈనెల 15 నుంచి నెలాఖరులోగా పూర్తి 

- లబ్ధిదారులను గుర్తిస్తున్న వ్యవసాయశాఖ 

- జిల్లాలో 15,100 మందికి రూ. 52 కోట్ల ప్రయోజనం 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్రవ్యాప్తంగా రెండవ విడత రుణ మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద, మధ్య తరగతి రైతుల్లో సంతోషాన్ని కలిగిస్తున్నది. రుణమాఫీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 15 నుంచి రుణమాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టి నెలాఖరులోగా 50వేల రూపాయలలోపు రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్‌ 11 తేదీ వరకు కటాఫ్‌గా తీసుకొని రైతులు బకాయి పడ్డ మొత్తాన్ని గుర్తించారు. ఆ రుణాలను నాలుగు విడతలుగా నాలుగేళ్లలో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత సంవత్సరం ప్రభుత్వం 25వేల రూపాయలలోపు రుణ బకాయిలను మాఫీ చేసింది. దీనితో నాలుగు విడుతల్లో ఒక విడత పూర్తికాగా ప్రస్తుతం రెండవ విడతలో 25 నుంచి 50వేల రూపాయల మేరకు ఉన్న రైతుల పంట రుణాల బకాయిలను మాఫీ చేయనున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం రెండవ విడత రుణమాఫీకి నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్యతరగతి రైతులకు లబ్ధిచేకూరనున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 25వేల రూపాయలలోపు పంట రుణాలను రద్దు చేయడంతో మూడు లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. కరీంనగర్‌ జిల్లాలో 1,80,878 మంది రైతులు ఉండగా వారంతా లక్షా 4వేల కుటుంబాలకు చెందినవారని గుర్తించారు. ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు కుటుంబాల వారీగా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేస్తారు. మొదటివిడతలో 25వేల రూపాయలలోపు పంట రుణాలను మాఫీ చేయగా 6,538 మంది రైతులు 9కోట్ల 75 లక్షల రూపాయల రుణం మాఫీ పొందారు. అలాగే ప్రాథమికంగా వేసిన అంచనా మేరకు 25వేల నుంచి 50వేల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు 15,100 మందికిపైగా ఉన్నారని భావిస్తున్నారు. అయితే వీరికి 52 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరనున్నదని అంచనా వేశారు. అయితే రైతుల సంఖ్యలో అలాగే వారు పొందనున్న లబ్ధి మొత్తంలో తేడాలు ఉండవచ్చని భావిస్తున్నారు. నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్‌ సమన్వయంతో వ్యవసాయశాఖ లబ్ధిదారులను గుర్తించడానికి సోమవారం నుంచి కసరత్తు ప్రారంభించింది. రైతుల రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఆధార్‌కార్డుతో ఒక రైతుకు ఎన్ని బ్యాంకు ఖాతాలున్నాయో తెలుసుకొని రేషన్‌కార్డు సమగ్ర కుటుంబసర్వేలో ఉన్న వివరాల మేరకు కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యతో రైతులను గుర్తిస్తారు. దాని ఆధారంగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తారు. ఈ సర్వే అనంతరం లబ్ధిదారుల పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. యుద్ధప్రాతిపదికన లబ్ధిదారుల వివరాలను తెలుసుకొని ఈనెలాఖరులోగా రుణమాఫీని అమలు చేస్తారు. 

Updated Date - 2021-08-03T06:21:15+05:30 IST