సచివాలయ ఉద్యోగుల్లో ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-06-19T07:03:41+05:30 IST

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. జూన్‌లోనే ప్రొబేషన్‌ ఇస్తారని ఎదురుచూస్తున్న వారికి నిరాశే ఎదురైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టింది.

సచివాలయ ఉద్యోగుల్లో ఉత్కంఠ

రకరకాల నిర్ణయాలతో ప్రభుత్వం కాలయాపన 

 ప్రొబేషన్‌ ఇస్తే కొత్త పేస్కేలు అమలు

ఒంగోలు(కలెక్టరేట్‌), జూన్‌ 18 : సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. జూన్‌లోనే ప్రొబేషన్‌ ఇస్తారని ఎదురుచూస్తున్న వారికి  నిరాశే ఎదురైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఆ నియామకాల సమయంలోనే రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో వివిధ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కూడా పెద్దఎత్తున ఈ సచివాలయ ఉద్యోగాలకు రాతపరీక్ష రాసి ఎంపికయ్యారు. అలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలను 1058 ఏర్పాటు చేశారు. వాటిల్లో 16 రకాల పోస్టులను నోటిఫికేషన్‌లో ప్రకటించారు. అలా 9,219 పోస్టులను మంజూరుచేయగా ప్రస్తుతం 7,386 మంది పనిచేస్తున్నారు. అయితే రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులను ప్రొబేషన్‌ ప్రకటించేందుకు ప్రభుత్వం రకరకాల నిబంధనలు విధించింది. ప్రొబేషన్‌ ఇవ్వాలంటే తప్పనిసరిగా డిపార్ట్‌మెంట్‌ టెస్టు ఉత్తీర్ణులు కావాలని మెలికపెట్టింది. దీంతో వందలాది మంది ఉద్యోగులు ఆ టెస్టులో ఉత్తీర్ణులు కాలేదు. అలా కాలం గడుపుకుంటూ వస్తున్న ప్రభుత్వం  జూన్‌లో ప్రొబేషన్‌ ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగులు కొంత ఉపశమనం పొందారు. అయితే జూన్‌ మూడో వారం ముగింపులోకి వచ్చినా ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేకుండా పోయింది.


6200 మంది ఉద్యోగులకే ప్రొబేషన్‌

డిపార్ట్‌మెంట్‌ టెస్టులు పూర్తిచేసుకున్న ఉద్యోగుల జాబితాను కలెక్టర్‌ ఆమోదించి ప్రభుత్వానికి పంపారు. ఆ జాబితాలో జిల్లావ్యాప్తంగా 7,386 మంది పనిచేస్తుండగా 6200మంది ఉద్యోగుల పేర్లే  ఉన్నాయి. మరో 1,186 మంది ఉద్యోగులకు అర్హత లేకపోవడంతో పంపలేదు. అయితే మిగిలిన వారు తప్పనిసరిగా డిపార్ట్‌మెంట్‌ టెస్టు పాసైన తర్వాతనే పంపుతారని ప్రకటించడంతో ఉద్యోగుల్లో మరింత ఆందోళన నెలకొంది. ప్రధానంగా సచివాలయాల్లోని ఎనర్జీ విభాగంలో 641మంది పనిచేస్తుండగా ప్రొబేషన్‌కు పంపలేదని సమాచారం. మహిళా పోలీస్‌ విభాగంలో 869మంది పనిచేస్తుండగా వారిలో ఎక్కువ మందికి ప్రొబేషన్‌ అర్హతకు పంపలేదని తెలుస్తోంది. ఇలా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. అయితే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తే పేస్కేలు అమలు చేయాల్సి వస్తోందన్న కారణంతోనే జాప్యం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


Updated Date - 2022-06-19T07:03:41+05:30 IST