ఆశావహుల్లో ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-03-06T05:44:23+05:30 IST

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్‌ 16న పాలకవర్గం గడువు ముగుస్తున్న క్రమంలో ఆ దిశగా చర్యలు చేపట్టారు.

ఆశావహుల్లో ఉత్కంఠ
సిద్దిపేట పట్టణ వ్యూ

రేపు 43 వార్డుల విభజనపై ప్రకటన

ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ

ఈనెల 25న వార్డులపై పూర్తి స్పష్టత

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల దిశగా అడుగులు

ఏప్రిల్‌లో రిజర్వేషన్లు.. మేలో ఎన్నికలు?


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మార్చి5: సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఒక్కొక్కటిగా అడుగులు పడుతున్నాయి. ఏప్రిల్‌ 16న పాలకవర్గం గడువు ముగుస్తున్న క్రమంలో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ముందుగా పట్టణంలోని 34 వార్డులను 43వార్డులుగా పెంచడానికి సమాయత్తమయ్యారు. ఇప్పటికే వార్డుల విభజనకు సంబంధించిన జాబితాను సిద్ధం చేశారు. రేపు(ఆదివారం) ఈ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. 7 రోజుల పాటు ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిశీలించి ఈనెల 25న తుది వార్డుల జాబితాను విడుదల చేస్తారు. ప్రస్తుతం సిద్దిపేట పట్టణంలో 1,00,658 ఓట్లు ఉన్నాయి. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 50,767, పురుషుల ఓట్లు 49,880 ఉన్నాయి. 11 ఇతర ఓటర్లు ఉన్నారు. ఇటీవలే కొత్త ఓటర్ల నమోదు కూడా పూర్తి  కావడంతో ఎన్నికల వరకూ ఇవే ఓట్లు ఉండే అవకాశం ఉంది.


వార్డుల విభజనే కీలకంగా

సిద్దిపేట పట్టణంలో వార్డుల విభజనకు జనాభా పెరుగుదలతోపాటు లింగారెడ్డిపల్లి గ్రామాన్ని విలీనం చేయడమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే ఇప్పటిదాకా వార్డులకు ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిలర్లు, ఇతర ఆశావహులు తమ దృష్టిని ఎటువైపు మళ్లించాలో తేల్చుకోలేకపోతున్నారు. తమ ఓటర్లు ఏ వార్డులో ఉంటారో.. పాత వార్డుల భౌగోళిక ఏరియా ఎలా మార్పు చెందుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. ఇటీవల వార్డుల విభజనకు సంబంధించిన కొన్ని ఊహాగానాల జాబితాలు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. ఇవి కొందరికి అనుకూలంగా, మరికొందరికి ప్రతికూలంగా ఉండడంతో తర్జనభర్జన పడుతున్నారు. వార్డుల్లోని ఓటర్ల ఆధారంగానే గెలుపోటములు ప్రభావితమవుతాయి. అందుకే వార్డుల విభజన ఎలా ఉంటుందోనని ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. 


 రిజర్వేషన్ల ప్రకటనే తరువాయి

వార్డుల విభజన పూర్తికాగానే రిజర్వేషన్ల ప్రకటనను వెల్లడించాల్సి ఉంటుంది. ఆయా వార్డుల్లోని ఓటర్ల సామాజికవర్గాల ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. అంతేగాకుండా 43 వార్డుల్లో జనరల్‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలుగా విభజిస్తారు. ఇందులో సగం వార్డులకు మహిళలు ప్రాతినిథ్యం వహిస్తారు. ఇప్పటికే సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించారు. ఇక వార్డుల విభజన పూర్తికాగానే రిజర్వేషన్లను ఖరారు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. వార్డుల విభజన తమకు అనుకూలంగా ఉన్నా రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అని ఆశావహులంతా ఆసక్తితో ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా లేకుంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని భావిస్తున్నారు. 


మే నెలలో ఎన్నికలు?

వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ ముగియగానే మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏప్రిల్‌ నెలాఖరు లేదా మే నెలలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు ఉన్నాయి. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక తర్వాతనే మున్సిపల్‌ పోరు ఉండే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దిపేటలో మాత్రం ఎన్నికల కోలాహల వాతావరణం నెలకొన్నది. ఆశావహులంతా ఇప్పటి నుండే ప్రజలతో మమేకమవుతూ ప్రసన్నం చేసుకుంటున్నారు. 

Updated Date - 2021-03-06T05:44:23+05:30 IST