అడుగడుగునా ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-06-27T04:50:36+05:30 IST

కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య బహిరంగ చర్చ అంశం అడుగడుగునా ఉత్కంఠకు దారీ తీసింది.

అడుగడుగునా ఉత్కంఠ
ఎమ్మెల్యే బీరంను అరెస్టు చేసి వాహనంలో తీసుకెళ్తుంటే ర్యాలీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం, జూపల్లి సవాళ్ల నేపథ్యంలో టెన్షన్‌ టెన్షన్‌..

శనివారం రాత్రే పట్టణానికి చేరుకున్న ఇద్దరు నాయకులు.. కార్యకర్తలు

ఉదయం ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా గుమిగూడిన నాయకులు, అభిమానులు

చర్చకు అంబేడ్కర్‌ చౌరస్తాను ఎంచుకున్న జూపల్లి

నీ ఇంటికే వస్తానన్న ఎమ్మెల్యే

కార్యకర్తలతో కలిసి జూపల్లి ఇంటికి ర్యాలీగా వెళ్తుండగా ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు


నాగర్‌కర్నూల్‌/కొల్లాపూర్‌/కొల్లాపూర్‌ రూరల్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య బహిరంగ చర్చ అంశం అడుగడుగునా ఉత్కంఠకు దారీ తీసింది. బహిరంగ చర్చకు సిద్ధపడ్డ ఇరువురు నాయకులు శనివారం రాత్రే కొల్లాపూర్‌కు చేరుకొని తమ అనుచరులతో మంతనాలు జరిపారు. బహిరంగ చర్చ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గినా అభాసుపాలవుతామనే అభిప్రాయాలు ఇరు వర్గాలకు చెందిన నాయకులకు కార్యకర్తలు బోధపరిచారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదేలేదంటూ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బీరం, జూపల్లి విశదపరిచారు. ఈ క్రమంలో వారి అభిమానులు, కార్యకర్తలను రంగంలోకి దించారు. బహిరంగ చర్చా వేదికకు అంబేడ్కర్‌ చౌరస్తాను జూపల్లి ఎంచుకోగా, అక్కడే ఎందుకు నీ ఇంటికే వస్తానంటూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఛాలెంజ్‌ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు టీఆర్‌ఎస్‌ నాయకులే కావడం కారణంగా వారిని సముదాయించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. అడిషనల్‌ ఎస్పీ రామేశ్వర్‌తో సహా ఇద్దరు డీఎస్పీలు, జిల్లాలోని సీఐలు ఎస్‌ఐలను కలుపుకొని దాదాపు 200 మంది పోలీస్‌ బలగాలు కొల్లాపూర్‌కు తరలివచ్చాయి. బీరం హర్షవర్ధన్‌రెడ్డిని అరెస్టు చేసి, పోలీస్‌ స్టేషన్‌కు తరలించే క్రమంలో కూడా పోలీస్‌ ఉన్నతాధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అరెస్టు చేసిన తర్వాత ఆయన్ను పెంట్లవెల్లి లేదా నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని తాడూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు చెప్పి అనూహ్యంగా పెబ్బేరుకు తీసుకెళ్లారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఎలక్ర్టానిక్‌ మీడియాతో మాట్లాడిన జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే రాక కోసం 12 గంటల వరకు వేచి చూస్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ప్రొడెన్షియల్‌ బ్యాంక్‌, కేఎల్‌ఐ కాల్వల సామర్థ్యం తగ్గింపు, తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి తాను చేసిన రాజీనామా వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఇదే నేపథ్యంలో బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా జూపల్లి కృష్ణారావుపై విమర్శల దాడిని పెంచారు. ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో నక్సలైట్ల చేతిలో గన్‌మెన్లు ఎలా హత్య చేయబడ్డారో ప్రజలందరికీ తెలిసిన అంశమేనన్నారు. జూపల్లి చేతిలో మోసపోయిన వాళ్ల ఆత్మలు ఘోషిస్తున్నాయని విమర్శించారు. 


తోపులాట.. లాఠీచార్జీ

కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో కొల్లాపూర్‌ ఆదివారం అట్టుడి కింది. తెల్లవారుజామున నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. కార్యకర్తల తాకిడి పెరగడంతో ఎమ్మెల్యే ఇంటికి కార్యకర్తలను పంపించకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


జూపల్లి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం..

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి ఇంటి పరిసరాల్లో ఉన్న కార్యకర్తలు, అభిమానులతో ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ఇంటికి భారీ ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎన్టీఆర్‌ సర్కిల్‌లో అతికష్టం మీద కార్యకర్తలను చెదరగొట్టారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసి, పెబ్బేరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం మళ్లీ ఎమ్మెల్యే వర్గీయులు జూపల్లి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులు కొన్ని చోట్ల లాఠీలకు పని చెప్పారు.


బ్యాంకులను మోసం చేసిన ఘనత నీది: బీరం

పెబ్బేరు: బ్యాంకులను మోసం చేసిన ఘనత నీదని, కొల్లాపూర్‌ అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదని కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాజీ మంత్రి జూపల్లిపై ఫైర్‌ అయ్యారు. ఆదివారం కొల్లాపూర్‌ పట్టణంలో బహిరంగ చర్చకు ఎమ్మెల్యే, జూపల్లి సిద్ధపడడంతో కొల్లాపూర్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసి, పెబ్బేరుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పెబ్బేరు సింగిల్‌ విండో కార్యాలయంలో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి పనులు చేస్తుంటే మాజీ మంత్రి ఆటంకం కలిగిస్తున్నాడని ఆరోపించారు. గతంలో మీరు చేసిన అభివృద్ధి పనులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. పనులు చేయకుండా కోట్ల రూపాయలు దండుకున్నావని అన్నారు. ప్రజల ఆస్తులను, బ్యాంకులను మోసం చేసిన ఘనత నీదని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని హితవు పలికారు. బహిరంగ చర్చకు సవాల్‌ విసిరి తలదాచుకున్నావని ఆరోపించారు. ఇక నుంచి నీ ఆటలు నీ మాటలు సాగనివ్వమని, పిచ్చి చేష్టలు మానుకొని నియోజక వర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయన వెంట జడ్పీటీసీ వెంకటరమణమ్మ, ఎంపీపీ సోమేశ్వరమ్మ, వీపనగండ్ల ఎంపీపీ కమలేశ్వర్‌రావు, పాన్‌గల్‌ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, పెబ్బేరు మార్కెట్‌ విండో చైర్మన్‌ కోదండరాంరెడ్డి, కొల్లాపూర్‌ మార్కెట్‌ యార్డు చైర్మన్‌, నాయకులు వెంకటయ్య నాయుడు, రఘువర్ధన్‌రెడ్డి, పెబ్బేరు టీఆర్‌ఎస్‌ ఉన్నారు.







Updated Date - 2022-06-27T04:50:36+05:30 IST