మహానాడులో మహోత్సాహం

ABN , First Publish Date - 2022-05-28T07:44:55+05:30 IST

మహానాడులో మహోత్సాహం

మహానాడులో మహోత్సాహం

అంచనాలకు మించి మహానాడుకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు

20వేల మందికి ఏర్పాట్లు...

50వేల మంది హాజరు

ఎవరికి వారుగా వాహనాల్లో ఒంగోలుకు

ఏర్పాట్లు సరిపోకున్నా తగ్గని ఉత్సాహం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం మహానాడు! ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానం అందుతుంది. సాధారణంగా... అలా ఆహ్వానం ఉన్న వారే హాజరవుతారు. ఈసారి 12వేల మంది ప్రతినిధులకు ‘మహానాడు’ పిలుపు అందింది. పార్టీమీద అభిమానంతో అంతకుమించే హాజరవుతారన్న అంచనాతో... 20వేల మందికోసం ఏర్పాట్లు చేశారు. కానీ... అంచనాలకు మించి అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. ‘పసుపు దండు’ వెల్లువలా కదిలి వచ్చింది. ఎవరూ ఎవరినీ తీసుకురాలేదు. ఎవరికి వారే కదిలారు. మోటార్‌ సైకిళ్లు, కార్లు, బస్సుల్లో తరలివచ్చారు. 50 వేల మందికిపైగా కార్యకర్తలు తరలి వచ్చారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో ఆహ్వానాలు ఉన్నవారు, మండల, నియోజకవర్గా స్థాయి నేతలు లోపలికి వెళ్లేందుకు కష్టపడాల్సి వచ్చింది. మీడియా గ్యాలరీ మొత్తం టీడీపీ శ్రేణులతో నిండిపోయింది. 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు వయసున్న మహిళలు సైతం ఉత్సాహంగా మహానాడుకు తరలి వచ్చారు. 12వేల మందిని ఆహ్వానించి, 20 వేల మందికి ఏర్పాట్లు చేసినప్పటికీ... అవి ఏమాత్రం సరిపోలేదు. వేదిక మీద ఉన్న ముఖ్య నేతలకు కూడా సరిగా భోజనాలు అందలేదు. వారు సాయంత్రం 4 గంటలకు తమకు అందించిన సమోసాలు, పకోడీలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భోజనాలు అందకున్నా, మంచినీళ్లు కూడా సరిపోని పరిస్థితి ఉన్నా... వచ్చిన కార్యకర్తలు, అభిమానులెవరూ నిరుత్సాహ పడలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఉత్సాహంతో ఉన్నారు. ఉన్నది తిని, లేకుంటే బయటకు వెళ్లి ఏదో ఒకటి తిని... మళ్లీ ప్రాంగణానికి వచ్చేశారు. ప్రాంగణం మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు కిక్కిరిసిపోయింది. ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరం, ఐ-టీడీపీ శిబిరం, ఇతర గ్యాలరీలన్నీ నిండిపోయాయి. ఈసారి  ఏర్పాట్లన్నీ యువ నేతల ఆధ్వర్యంలో జరగడం మరో విశేషం.


ఆత్మీయ పలకరింపులు

‘మహానాడు’కు హాజరైన నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ నియోజకవర్గాల్లో పరిస్థితిపై చర్చించుకున్నారు. ‘ఈసారి జయం మనదే’ అనే ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వ పాలనపై చేసిన తీర్మానాలు అరగంట ఆలస్యంగా ప్రారంభమైనా... ఆ తర్వాత కార్యక్రమమంతా సమయం ప్రకారం జరిగింది. ఏపీ, తెలంగాణలవి కలిసి 16 తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత చివరగా... రాజకీయ తీర్మానం ఆమోదించారు.


మండువారిపాలెం రైతుల్ని కలిసిన బాబు 

మహానాడు ఏర్పాటుకు తమ భూములు ఇచ్చిన మండువారిపాలెం రైతులను చంద్రబాబు కలిశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. మహానాడును తొలుత ఒంగోలులోని మినీ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. కానీ... ప్రభుత్వం అంగీకరించలేదు. ఆ తర్వాత ఒంగోలు సమీపంలో మరో ప్రాంతాన్ని కూడా టీడీపీ నేతలు పరిశీలించారు. అక్కడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమయంలో... మండువారిపాలెం రైతులు ముందుకొచ్చి తమ భూముల్లో మహానాడు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దీంతో... దాదాపు 175 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు.


గతానికి భిన్నంగా... 

సాధారణంగా తెలుగుదేశం పార్టీ మహానాడు మొత్తం ఒక పద్ధతిలో జరుగుతుంది. ప్రసంగాలు, తీర్మానాలతో కార్యక్రమం సాగుతుంది. ఈసారి మాత్రం... గతంలో ఎప్పుడూలేని, భిన్నమైన జోష్‌ కనిపించింది. చంద్రబాబు ప్రసంగం మొదలు పెట్టగానే... ప్రాంగణంలో ఉన్నవారంతా లేచి నిలబడ్డారు. రెండువేళ్లు ఊపుతూ, విక్టరీ సంకేతం చూపిస్తూ... ‘జై చంద్రబాబు, కాబోయే సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించారు.


నేడు భారీ బహిరంగసభ

ఒంగోలు: ‘మహానాడు’ రెండో రోజు, ముగింపు సందర్భంగా శనివారం భారీ బహిరంగ సభ జరగనుంది. మహానాడు జరుపుతున్న మండువవారిపాలెం పొలాల్లోనే... మధ్యాహ్నం 3 గంటలకు సభ మొదలవుతుంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ సభ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఒంగోలులోని అద్దంకి బస్టాండు సెంటర్‌లోని ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహానికి చంద్రబాబుతోపాటు టీడీపీ ముఖ్యనేతలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.



Updated Date - 2022-05-28T07:44:55+05:30 IST