కొన్నింటికి ‘పన్ను మినహాయింపు’

ABN , First Publish Date - 2022-06-29T02:26:06+05:30 IST

బంగారం, విలువైన రాళ్లకు సంబంధించి అంతర్రాష్ట్ర తరలింపునకు రాష్ట్రాలు ఈ-వే బిల్లును జారీ చేసేందుకు వీలుగా కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులను జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదించింది.

కొన్నింటికి ‘పన్ను మినహాయింపు’

* ఆర్ధిక మంత్రుల మధ్యంతర నివేదికలకు... 

- GST కౌన్సిల్ ఆమోదం

* రేపు మరిన్ని ముఖ్య నిర్ణయాలు..! 

చండీగఢ్ : బంగారం, విలువైన రాళ్లకు సంబంధించి అంతర్రాష్ట్ర తరలింపునకు రాష్ట్రాలు ఈ-వే బిల్లును జారీ చేసేందుకు వీలుగా కొన్ని వస్తువులు, సేవలపై పన్ను రేట్లలో మార్పులను జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంగళవారం ఇక్కడ ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం... GoM నివేదికతో పాటు GST నమోదిత వ్యాపారాల కోసం ఆయా సమ్మతి విధానాలను కూడా క్లియర్ చేసింది. జూన్ 2022 తర్వాత రాష్ట్రాలకు పరిహారం పొడిగింపు, క్యాసినోలు, ఆన్‌లైన్ గేమింగ్‌, గుర్రపు పందాలపై 28 శాతం GST విధింపు తదితర కీలక అంశాలపై రేపు(బుధవారం)  చర్చ జరగనుంది. జీఎస్‌టీ పరిహారం విధానాన్ని పొడిగించాలని, లేదా...  ఆదాయంలో రాష్ట్రాల వాటాను ప్రస్తుత 50 శాతం నుండి పెంచాలని ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు ఒత్తిడి చేస్తోన్న విషయం తెలిసిందే. 


కౌన్సిల్ సమావేశాల తొలిరోజైన మంగళవారం... కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై నేతృత్వంలోని రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం మధ్యంతర నివేదికకు ఆమోదం లభించింది. ఇందులో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిదిద్దడం సహా కొన్ని వస్తువులపై పన్ను మినహాయింపును తొలగించడం వంటివి ఉన్నాయి. రోజుకు రూ. వెయ్యి లోపు హోటల్ వసతి  సహా ఆయా సేవలపై GST మినహాయింపును ఉపసంహరించుకోవాలని, దాని స్థానంలో 12 శాతం పన్ను విధించాలని GoM సూచించింది. ఆసుపత్రిలో చేరిన రోగులకు రోజుకు రూ. 5 వేల కంటే ఎక్కువ వసూలు చేసే గది అద్దె(intensive care unit మినహా)పై 5 శాతం జీఎస్‌టీ విధించాలని సిఫారసు చేసింది. పోస్ట్‌కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్‌లు, బుక్ పోస్ట్, పది గ్రాముల కంటే తక్కువ బరువున్న ఎన్వలప్‌లు మినహా అన్ని పోస్టాఫీసు సేవలపై పన్ను విధించాలని కోరింది. అలాగే, చెక్కులు, విడిగా, లేదా... పుస్తక రూపంలో ఉన్న వాటిపై 18 శాతం పన్ను విధించాలని మంత్రుల బృందం సిఫార్సు చేసింది. కొన్ని పరిమతులకు లోబడి నివాస అవసరాల కోసం అద్దెకు తీసుకోవడానికి ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకోవడానికి GoM మొగ్గు చూపింది.


బంగారం, ఆభరణాలు, విలువైన రాళ్ల అంతర్రాష్ట్ర తరలింపుపై ఈ-వే బిల్లులకు సంబంధించి ఎగవేతలను తనిఖీ చేయడానికి, ఎలక్ట్రానిక్ బిల్లును తప్పనిసరి చేయాల్సిన థ్రెషోల్డ్‌పై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని కౌన్సిల్ సిఫార్సు చేసింది. రాష్ట్ర మంత్రుల బృందం పరిమితిని రూ. 2 లక్షలు, లేదా... అంతకంటే ఎక్కువ ఉండాలని సిఫార్సు చేసింది. అధిక-రిస్క్ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి... ధృవీకరణను సూచించింది, అంతేకాకుండా... అటువంటి పన్ను చెల్లింపుదారులను గుర్తించడానికి విద్యుత్తు బిల్లు వివరాలు,  బ్యాంక్ ఖాతాల ధృవీకరణను ఉపయోగించడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కాగా రెండవరోజైన బుధవారం(రేపు) జరగనున్న సమావేశంలో మరిన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకోనున్నట్లు వినవస్తోంది. 

Updated Date - 2022-06-29T02:26:06+05:30 IST