Badvel by election : ఏకగ్రీవం కోసం YSRCP కసరత్తు..!

ABN , First Publish Date - 2021-10-05T08:34:17+05:30 IST

జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో బద్వేలు ఒకటి. బద్వేలు 1955లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009 నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా జనరల్‌ నుంచి ఎస్సీ రిజర్వడ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌గా చేశారు.

Badvel by election : ఏకగ్రీవం కోసం YSRCP కసరత్తు..!

  • దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్యకే వైసీపీ టికెట్‌
  • రాజకీయ సంప్రదాయాన్ని గౌరవించి..
  • పోటీ చేయమని టీడీపీ, జనసేన ప్రకటన
  • బీజేపీ, కాంగ్రె్‌సలను ఒప్పించే దిశగా అధికార పార్టీ ఎత్తులు
  • బీజేపీ ఒప్పుకుంటుందా..? ఒంటరి పోరుకు సై అంటుందా..?
  • ఆసక్తిగా మారుతున్న రాజకీయ పరిణామాలు


బద్వేలు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. మొన్నటి వరకు గట్టి పోటీ తప్పదని అందరూ భావించారు. అయితే.. దివంగత ఎమ్మెల్యే సతీమణికే వైసీపీ టికెట్‌ ఇవ్వడం.. రాజకీయ సంప్రదాయాన్ని గౌరవించాలని ఆ పార్టీ నుంచి సంకేతాలు.. విన్నపాలు వెల్లడంతో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికే జనసేన కూడా పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఇక బరిలో నిలిచే పార్టీలు బీజేపీ, కాంగ్రె్‌. ఆ రెండు పార్టీలను ఒప్పించి ఏకగ్రీవం దిశగా అధికార పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒప్పుకుంటాయా..? పోటీకే మొగ్గు చూపుతాయా..? జిల్లాలో ఇదే హాట్‌ టాపిక్‌. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో బద్వేలు ఒకటి.  బద్వేలు 1955లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. 2009 నియోజకవర్గాల పునర్వీభజనలో భాగంగా జనరల్‌ నుంచి ఎస్సీ రిజర్వడ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌గా చేశారు. ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగితే అత్యధిక పర్యాయాలు టీడీపీ, కాంగ్రెస్‌ శాసనసభ్యులే ప్రాతినిథ్యం వహించారు. దివంగత ఎమ్మెల్యే, మాజీ మంత్రి బిజువేముల వీరారెడ్డి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఎస్సీ రిజర్వ్‌గా అయిన తరువాత జరిగిన ఎన్నికల్లో పీఏం కమలమ్మ కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచారు. 1999లో గెలిచిన బిజివేముల వీరారెడ్డి రెండేళ్లు గడవకనే మృతి చెందడంతో 2001లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కుమార్తె కొనిరెడ్డి విజయమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే జి.వెంకటసుబ్బయ్య మరణంతో ఇక్కడ రెండవ పర్యాయం ఉప ఎన్నిక అనివార్యమైంది. జూలై 9న సీఎం జగన బద్వేలు పర్యటనలో దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టరు దాసరి సుధాను వైసీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని వైసీపీ కార్యకర్తలు ఆశించారు. అయితే.. సుధా పేరును సీఎం జగన ప్రకటించలేదు. దీంతో ఆ కుటుంబం నుంచి కాకుండా మరో వ్యక్తిని వైసీపీ బరిలో దింపేందుకు అవకాశం ఉందని రాజకీయ ఊహాగానాలు వెల్లువెత్తాయి. అదే సమయంలో టీడీపీ తమ అభ్యర్థిగా డాక్టర్‌ రాజశేఖర్‌ను అధికారికంగా ప్రకటించింది. జనసేన విజయజ్యోతిని బరిలోకి దింపుంతుందని రాజకీయ ప్రచారం జోరుగా సాగింది. ఈ తరుణంలో వైసీపీ దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టరు సుధాను అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా.. మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబం నుంచి పోటీ చేస్తే.. ప్రత్యర్థి పార్టీ పోటీ చేయకుండా రాజకీయ సంప్రదాయం ఉందంటూ గుర్తు చేసింది. ఈ సంప్రదాయానికి బీజం వేసిన టీడీపీ దానికే కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.


బీజేపీ, కాంగ్రె్‌సను ఒప్పించే దిశగా పావులు

దివంగత దళిత ఎమ్మెల్యే సతీమణి పోటీ చేస్తుండడంతో తాము పోటీ చేయడం లేదని జనసేన అధినేత పవన ప్రకటించారు. దీంతో ఒంటరిగానైనా పోటీ చేసేందుకు బీజేపీ సై అంటోంది. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కడప జిల్లా నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై 8వ తేదీలోగా అభ్యర్థిని ఎంపిక చేస్తామని ప్రకటించారు. అభ్యర్థి ఎంపికకు కాంగ్రెస్‌ అధిష్టానం పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కన్వీనర్‌ షేక్‌మస్తానవలి కన్వీనర్‌గా ఇప్పటికే కమిటీ వేసింది. మాజీ ఎమెల్యే కమలమ్మ, జిల్లా యూత కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోటపాటి లక్షుమయ్య కాంగ్రెస్‌ టికెట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో రాజకీయ సంప్రదాయాన్ని గౌరవించి టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించడంతో బీజేపీ, కాంగ్రె్‌సలు పోటీలో ఉంటాయా..? ఇదే అంతటా చర్చగా మారింది. అయితే.. ఈ రెండు పార్టీల్ని ఒప్పించి డాక్టరు సుధాను ఏకగ్రీవంగా ఎంపికయ్యేలా చేసేందుకు వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఓ పక్క రాష్ట్ర నేతలు, మరో పక్క బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రాఘురామిరెడ్డి ఆ పార్టీలకు చెందిన జిల్లా నాయకులతో చర్చలు జరుతున్నారని విశ్వసనీయ సమాచారం. పోటీ నుంచి తప్పుకోవాలంటూ వైసీపీ నాయకులు బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళితే సానుకూలంగా స్పందించారని తెలిసింది. అయితే.. జిల్లాకు చెందిన బీజేపీ కీలక నాయకుడు ఒకరు ససేమిరా అంటూ పోటీకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లి.. పార్టీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని కాంగ్రెస్‌ నాయకులు అన్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా..? బీజేపీ, కాంగ్రె్‌సలు పోటీ నుంచి తప్పుకుంటాయా..? వేచి చూడాల్సిందే.

ఒకవేళ ఆ పార్టీలు ఒప్పుకుంటే ఇప్పటికే నామినేషన దాఖలు చేసిన నవతరం పార్టీ అభ్యర్థిని ఉపసంహరింప చేయాల్సి ఉంటుంది. వైసీపీ వ్యూహాలు ఫలించి అన్నీ సవ్యంగా జరిగితే రాష్ట్ర విభజన తరువాత ఏకగ్రీవంగా అసెంబ్లీలో అడుగు పెట్టే తొలి ఎమ్మెల్యేగా డాక్టరు సధాకు అరుదైన అవకాశం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. 2015లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ మృతి చెందితే.. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి మన్నూరు సుగుణకు టీడీపీ టికెట్‌ ఇచ్చింది. రాజకీయ సంప్రదాయాన్ని గౌరవించి నాడు వైసీపీ పోటీ చేయలేదు. అయితే.. కాంగ్రెస్‌ ఆర్‌.శ్రీదేవిని బరిలో దింపడంతో పోటీ అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణ 1.16 లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-10-05T08:34:17+05:30 IST