సబ్సిడీ గొర్రెల పంపిణీకి కసరత్తు

ABN , First Publish Date - 2022-08-10T05:36:10+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి జిల్లా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు.

సబ్సిడీ గొర్రెల పంపిణీకి కసరత్తు

- వచ్చే ఏప్రిల్‌లోగా పంపిణీ చేసేందుకు చర్యలు

- రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు పెరిగిన యూనిట్‌ అంచనా

- డీడీల ద్వారా గాకుండా డిజిటల్‌ చెల్లింపులతో లబ్ధిదారుడి వాటా సేకరణ

 (ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండో విడత సబ్సిడీ గొర్రెల పంపిణీకి జిల్లా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీపీ) ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు ముందుకు రావడంతో గొర్రెల పంపిణీపై ఆశలు వదులుకున్న లబ్ధిదారులకు ఊరట కలిగింది. యూనిట్లను వచ్చే ఏప్రిల్‌  నెలాఖరుకల్లా గ్రౌండింగ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. యూనిట్‌ వ్యయాన్ని లక్షా 25 వేల నుంచి లక్షా 75 వేల రూపాయలకు పెంచింది. ఇందులో ఎప్పటిలాగానే లబ్ధిదారుడి వాటా కింద 25 శాతం సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును గతంలో డీడీ తీసి ఇవ్వగా, ఇప్పుడు లబ్ధిదారుడి పేరిట వర్చువల్‌ అకౌంట్‌ తీయించి దాని ద్వారా స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 200 మంది లబ్ధిదారులు తమ వాటా కింద డబ్బులను చెల్లించారు. గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2017లో సబ్సిడీ గొర్రెల పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ప్రాథమిక గొర్రెల సహకార సంఘంలో సభ్యులై ఉండి, 18 ఏళ్లు నిండిన వారందరికీ యూనిట్లను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 21,143 మంది లబ్ధిదారులను గుర్తించగా వీరందరికీ రెండు విడతల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు గ్రామసభలు నిర్వహించి డ్రా తీసింది. డ్రాలో పేర్లు వచ్చిన వారందరికీ అదే ఏడాది సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. మిగతా వారికి తర్వాత ఏడాది ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 2018లో మొదటివిడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. కానీ రెండో విడత గొర్రెలను పంపిణీ చేయలేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ ఊరిస్తూ వచ్చారు. నిధుల కొరత వల్ల పథకాన్ని ముందుకు తీసుకు వెళ్లలేదు. అసెంబ్లీ ఉపఎన్నికలు జరిగిన హుజూరాబాద్‌, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో మాత్రం సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. ఎన్‌సీడీసీ నుంచి ప్రభుత్వానికి రుణం లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. పథక అమలు గురిచి వారం రోజుల క్రితం రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి రెండో విడత గొర్రెలను ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

- పెరిగిన యూనిట్‌ వ్యయం..

ఈ పథకం కింద ఒక పొట్టేలుతో పాటు 20 గొర్రె పిల్లలను అందజేస్తారు. దీని విలువ 1,25,000 రూపాయలుగా నిర్ణయించారు. 75 శాతం సబ్సిడీ పోనూ 25 శాతం లబ్ధిదారుడి వాటా కింద 31,250 రూపాయలు చెల్లించారు. పథకాన్ని ప్రవేశపెట్టి ఐదేళ్లు గడవడంతో అప్పటికీ, ఇప్పటికీ గొర్రెల ధరలు పెరగడంతో యూనిట్‌ వ్యయాన్ని 1,75,000కు పెంచారు. లబ్ధిదారుడి వాటా కింద 43,750 చెల్లించాల్సి ఉంటుంది. ఒక విత్తన పొట్టేలు ధర 7 వేల నుంచి 10 వేలకు, పెద్ద గొర్రె పిల్లల ధర 5,200 నుంచి 7,400 రూపాయలకు పెంచారు. లబ్ధిదారుడి వాటా సొమ్మును గతంలో డీడీల రూపంలో ఇచ్చారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని భావించిన అధికారులు ఈ-లాభ్‌ పోర్టల్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి రిజిష్టర్‌ చేశారు. తద్వారా వచ్చే వర్చువల్‌ ఖాతాకు లబ్ధిదారులు తమ సొమ్మును ఆర్‌టీజీఎస్‌ ద్వారా గానీ, నెఫ్ట్‌ ద్వారా గానీ చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో 10,543 మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటి వరకు 200 మంది వరకు తమ వాటా సొమ్మును లబ్ధిదారులు చెల్లించారని అధికారులు తెలిపారు. సబ్సిడీ గొర్రెల పథకం గురించి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

- మరణించిన లబ్ధిదారుడి యూనిట్‌ కుటుంబ సభ్యులకు..

నాలుగు సంవత్సరాల క్రితం సబ్సిడీ గొర్రెల పథకం కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో కొందరు మృతిచెందారు. వారి స్థానంలో కుటుంబంలో ఒకరికి యూనిట్‌ మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరణించిన వాళ్లు 500 నుంచి 600 వరకు ఉంటారని అధికారులు చెబుతున్నారు. మండలాల వారీగా మరణించిన లబ్ధిదారుల వివరాలను పశుసంవర్థక శాఖాధికారులు  గుర్తిస్తున్నారు. వారి స్థానంలో ఆ కుటుంబంలో 18 ఏళ్లు నిండిన కుమారుడికి గానీ, భార్యకు గానీ యూనిట్‌ను మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరణించిన వారి మరణ ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే ప్రతిపాదిత కుటుంబ సభ్యులకు మంజూరు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. మరణించిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లోపు లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని ఆదేశించింది. గతంలో లాగా గొర్రెలను బయటి రాష్ట్రాల్లోనే కొనుగోలు చేయనున్నారు. కొనుగోలు విధానంపై మార్గదర్శకాలు విడుదల కావాల్సి ఉన్నాయని జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్‌ రవీందర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


Updated Date - 2022-08-10T05:36:10+05:30 IST