ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో బూడిద టెండర్‌కు కసరత్తు

ABN , First Publish Date - 2022-05-16T06:32:28+05:30 IST

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో బూడిద విక్రయానికి టెండర్‌ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో బూడిద టెండర్‌కు కసరత్తు
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లోని యాష్‌ (ఫైల్‌)

- ఎన్‌ఎఫ్‌ఎల్‌ ఆధ్వర్యంలో ప్రక్రియ 

- 4లక్షల టన్నుల బూడిద విక్రయానికి ప్రతిపాదనలు 


కోల్‌సిటీ, మే 15: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో బూడిద విక్రయానికి టెండర్‌ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పాండ్‌లలోని సుమారు నాలుగు లక్షల టన్నుల బూడిదను విక్రయించేందుకు నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌కు ప్రతిపాదించారు. నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ ఆధ్వర్యంలో  టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. గతంలో నామమాత్రపు రేటుపై బూడిదను తొలగించారు. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బూడిద డిమాండ్‌ భారీగా పెరిగిపోవడం, సింగరేణి, జెన్‌కో సంస్థలు బూడిదను విక్రయిస్తుండడంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌పై ఒత్తిడి పెరిగింది. ఎన్‌టీపీసీ టన్నుకు రూ.400, జెన్‌కో రూ.200 చొప్పున అమ్మకాలు సాగిస్తున్నది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బూడిదను తీసుకునేందుకు పదుల  సంఖ్యలో కాంట్రాక్టర్లు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేయిస్తున్నారు. చివరికి ఫెర్టిలైజర్స్‌ మినిస్ర్టీపై సైతం ఒత్తిడి ఉన్నది. గతం లో ఎఫ్‌సీఐ ఆధీనంలో ఉన్న ఆస్థులను ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు లీజు ప్రాతిపదిన కేటాయించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సంస్థ ఆస్థులను మొత్తం నోడల్‌ ఏజెన్సీ అయిన ఎస్‌బీఐ వద్ద కుదువ పెట్టింది. సాంకేతికంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పరిధిలోని లావాదేవీలు, టెండర్లు నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగం గా బూడిద విక్రయాలకు సంబంధించి గతంలో ఎఫ్‌సీఐ అవలంభించిన విధానాల గురించి వివరాలు తీస్తున్నారు. టెండర్‌ నిర్వహణకు సంబంధించి ఎన్‌ఎఫ్‌ఎల్‌కు నివేదించారు. మొదటి దశలో నాలుగు లక్షల టన్నుల బూడిదను విక్రయించేందుకు టెండర్‌ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. కనీసంగా రూ.200చొప్పున టన్నుకు విక్రయించినా ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు రాబట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారు. మరో వైపు సింగరేణి సంస్థ కూడా 7ఎల్‌ఈపీ బొగ్గు తీసిన స్థలంలో స్టోవింగ్‌ చేసేందుకు అవసరమైన బూడిదను ఇవ్వాలంటూ ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు లేఖ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సింగరేణి సంస్థకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాటమ్‌ యాష్‌ కేటాయించే అవకాశం ఉంది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ పరిశ్రమ ఆవరణలోని బంకర్‌ ద్వారా స్టోవింగ్‌ చేయనున్నారు.

Updated Date - 2022-05-16T06:32:28+05:30 IST